నీచ రాజకీయం.. అరికెపూడి గాంధీ vs కౌశిక్ రెడ్డి

అరికెపూడికి చీర, గాజులు పంపి నిప్పంటించారు కౌశిక్ రెడ్డి. ఇక తానేంత తక్కువగా అంటూ తన మనుషుల్ని తీసుకుని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పెట్రోల్ పోశారు గాంధీ

0

నిర్దేశం, హైదరాబాద్: ఆంధ్రా రాజకీయాలు అంటే చాలు.. వ్యక్తిగత కక్షలు, బూతు మాటలు.. ఇప్పటి వరకు ఉన్న ప్రచారం ఇది. కానీ పొరుగున ఉన్న మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు తెలంగాణ ప్రజాప్రతినిధులు. బూతులు తిట్టుకోవడం, దాడులు చేసుకోవడం, ఛాలెంజ్ లు విసురుకోవడం, మందిమార్బలంతో భయానకంగా వ్యవహరించడం లాంటివి నానాటికీ తెలంగాణలో కామన్ అవుతున్నాయి. లేటెస్టుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలాంటి రాజకీయాన్ని మరో ఎత్తుకు లేపారు.

అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నిన్నీమధ్యే కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీల మధ్య మొదలైన ఈ రాజకీయం.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కూల్ డ్రింగ్ పోస్తే యాసిడ్ లా మండే వరకు వచ్చింది. అరికెపూడికి చీర, గాజులు పంపి నిప్పంటించారు కౌశిక్ రెడ్డి. ఇక తానేంత తక్కువగా అంటూ తన మనుషుల్ని తీసుకుని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పెట్రోల్ పోశారు గాంధీ. ఇరు పార్టీల మధ్య ఘర్షణ. మాటల బూతు పురాణం అలా సాగింది. ఇది కాస్త.. స్థానికత లెక్కపెట్టుకునే వరకు వెళ్లింది.

అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కాస్త.. ముదిరి ముదిరి ఇంత వరకు వచ్చింది. వార్తలో రాయలేనటువంటి మాటలతో మీడియా ముందే ఇరు నేతలు తిట్టిపోసుకున్నారు. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ ఆయన ఇంటికే వెళ్లి సవాల్ చేశారు గాంధీ. ఈ క్రమంలో కౌశిక్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు టమోటాలు, గుడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఉద్రిక్తతల మధ్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇటువైపు హరీశ్ రావు ఆరంగేట్రం చేస్తే, అటువైపు తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లారు.

ఇద్దరి మధ్య పార్టీ మార్పుపై అభ్యంతరం ఏర్పడింది. దీని మీద కోర్టు ఇప్పటికే ఓ తీర్పు ఇచ్చింది. అయినా ఇరు పార్టీల నేతలు తమ జులుం చూపిస్తూనే ఉన్నారు. ఇక గాంధీని ఆంధ్రా వ్యక్తని గులాబీ పార్టీ అంటోంది. మరి ఆయన గెలిచిందే బీఆర్ఎస్ టికెట్ మీద.. అప్పుడు టికెట్ ఎందుకు ఇచ్చినట్టు? కాంగ్రెస్ వాదన కూడా చిత్రంగానే ఉంది. రాజీనామా చేసి వస్తే కానీ పార్టీలో చేర్చుకోనని చెప్పిన రేవంత్ రెడ్డే.. పార్టీ మారిన వారికి పదవులు ఇస్తున్నారు. సరే.. ఈ రాజకీయాలు పక్కన పెడితే.. ఆ బూతులు, దాడులు ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చిన రాజకీయం ఇది? దీనికి ఇరు పార్టీలు బాధ్యులే. కాంగ్రెస్ కు పాలన మీద ధ్యాస లేదు, బీఆర్ఎస్ కు ప్రజల వైపు ఉండి పోరాటే ఓపికా లేదు. చిల్లర గొడవలతో తెలంగాణ రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking