విప్లవ పార్టీ నిర్మాణానికి కృషి చేయండి
— పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసిన సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్
— ఇకమీదట పార్టీ అనుభంద ప్రజా సంఘాలు పాత పేర్లతోనే కొనసాగించాలని తీర్మానం.
— ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా 115 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినాన్ని ఎత్తిపట్టాలని పిలుపు.
సూర్యాపేట ఫిబ్రవరి 21 విప్లవం విందు బోజనం కాదని, అది ఎన్నో కష్ట నష్టాల గుండా కొనసాగే పోరాటం అని, అలాంటి పోరాటానికి బలమైన విప్లవ సిద్దాంతంపై ఆదారపడిన విప్లవ పార్టీ నిర్మాణ అవసరాన్ని గుర్తించి, తీవ్రంగా శ్రమించాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం పార్టీ అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ అధ్యక్షతన సూర్యపేటలో పార్టీ ముఖ్యుల సమావేశం జరిగింది. సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన, సిపిఐ(ఎం.ఎల్) రాంచంద్రన్, సిపిఐ(ఎం.ఎల్) క్రాంతి మూడు విప్లవ సంస్థలు సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీగా ఐక్యమై డిసెంబర్-31, 2024 నాటికి సంవత్సరం పూర్తయిందని ప్రబాకర్ వెల్లడించారు. వ్యక్తిగత రాజకీయ అవకాశవాదులను, పదవి వ్యామోహా పరులను పార్టీ నుండి తొలగించడం వలన నేడు చండ్రపుల్లారెడ్డి పార్టీ బలమైన పార్టీగా నిలిచిందని పేర్కొన్నారు. పార్టీ, ప్రజాసంఘాల అభివృద్ధిలో ప్రతి పార్టీ సభ్యుడు కష్ట పడుతున్నాడని వెల్లడించారు. ఐక్యతలో బాగంగా సంవత్సరం కిందట పార్టీ ప్రజా సంఘాలకు ముందు “భారత” అని నిర్ణయించామని, మేదావులు, సానుభూతి పరుల సూచనల మేరకు ఇకమీదట ప్రజా సంఘాల ముందు భారత అనే పదాన్ని తొలగించి, పాత పేర్లతోనే ప్రజాసంఘాలను కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏదైన సరే ఆచరణ ద్వారానే సాధ్య మవుతుందని అన్నారు. అందులో బాగమే ఈ మార్పు అని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ, అమిత్ షాల బీజేపీ ప్రభుత్వం ఆదివాసి ప్రజలపై కక్ష గట్టి, మావోయిస్టుల పేరుతో అంతిమ యుద్దాన్ని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతిమ యుద్దం ప్రజలదే కానీ, నరేంద్రమోదీ, అమిత్ షాలది కాదని ఎండగట్టారు. ఇలాంటి క్రమంలో అడవిలో ఉన్న అపారమైన నిది, నిక్షేపాలను బడా కార్పొరేట్ సంస్థల పెద్దలైన ఆదానీ, అంబానీలకు దోచిపెట్టే కుట్రలో బాగమే ఆదివాసులను, మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో వందలాదిమందిని కాల్చి చంపుతున్నదని అన్నారు. 2026, జూన్ లోపల మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని మతతత్వ కాషాయ ప్రభుత్వం కలలు గంటుకున్నదని, ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం ఉన్నంత కాలం నగ్జల్ బరి పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయనే విషయాన్ని నరేంద్రమోదీ, అమిత్ షాలు గుర్తించాలని కోరారు. ఇప్పటికైన ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలకు తెరలేపాలని డిమాండ్ చేశారు. 115 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మార్చి-8ని, ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ఎత్తిపట్టాలని మల్లెపల్లి ప్రబాకర్ పిలుపునిచ్చారు. ఈపై కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు. జాతీయ కన్వీనర్ షేక్ షావలి, పీఓడభ్ల్యూ(విముక్తి) జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ, తెలంగాణ రైతు-కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.