1% అగ్రకులాలకు EWS.. మరి 50% బీసీలకు?

నిర్దేశం: ‘‘అందుగలడు ఇందులేడని సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా అందందు గలడు’’.. ఈ మాట అగ్రకులాలకు బాగా సరిపోతుంది. ఈ దేశంలో వారు లేని రంగం లేదు. ఆ మాట‌కొస్తే ఏ రంగ‌మైనా స‌గం వారే ఉంటారు. కొన్నింట్లో అయితే రంగమంతా వారే ఉంటారు. అయినా ప్రభుత్వంలో ఉన్నవారికి ఎందుకో.. అగ్రకులాల్లో పేదలు కనిపించారు. అంతే కళ్లల్లో నుంచి మూసీ నది వరదలా పారింది. వెంటనే పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి 10% EWS రిజర్వేషన్ చట్టం చేసేశారు. వెంటనే అమలులోకి తెచ్చారు కూడా.

రిజర్వేషన్ అనేది మన దేశంలో ఎప్పుడూ పెద్ద వివాదమే. దేశంలో ప్రతిభ కాపాడడానికి, మెరిట్ ను ప్రోత్సహించడానికి కొందరు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంటారు. చిత్రంగా, వీళ్లెవ‌రు ఈడబ్లూఎస్ రిజర్వేషన్లను వ్య‌తిరేకించ‌లేదు. స‌రిక‌దా చాలా గొప్ప నిర్ణ‌య‌మ‌ని చిటికెలు వేశారు. బహుశా ఇంతకంటే వికృత హాస్యం ఉండదేమో. రిజర్వేషన్ విధానాన్నే వ్యతిరేకించేవారు ఈడబ్లూఎస్ రిజర్వేషన్ ఎందుకు వాడుకుంటున్నట్లు? దాన్ని ఎందుకు సమర్ధించినట్టు? మెరిట్ ప్రకారమే వెళ్లొచ్చు కదా. నిజానికి.. వందల ఏళ్ల నుంచి కులం అనే పేరుతో అన్ని భోగాలు అనుభవించింది ఎవరు? అది రిజర్వేషన్ కాదా?

రిజ‌ర్వేష‌న్లు కులం ప్రాతిప‌దిక‌న కాకుండా ఆర్థిక వెనుక‌బాటు త‌నంగా ఇవ్వాలని కొందరి వాద‌న‌. అగ్ర‌కులాల్లో పేదలు ఉన్నార‌ని చాలా బాధ‌గా చెప్తారు. మ‌రి వెనుక‌బ‌డిన కులాల్లో ఉన్న అంద‌రూ పేదలే క‌దా. అస‌లు ఆ కులాలే పేద‌రిక కులాలుగా ఎందుకు మిగిలాయి? వారిని చ‌దువుకోవ‌ద్ద‌ని చెప్పింది ఎవ‌రు? వారికి ఆస్తులు సంపాదించే హ‌క్కు లేద‌ని, భూమి ఉండొద్ద‌ని చెప్పింది ఎవ‌రు? ఇప్పుడు మెరిట్ అని చెప్పుకునే కులాలే క‌దా.. ఇప్పుడు రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకిస్తున్న వారే క‌దా?

ప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో అందరికీ భాగస్వామ్యం లభించాలి. సరిగ్గా చెప్పాలంటే అందరికీ సమాన భాగస్వామ్యం లభించాలి. కానీ ప్రధానమంత్రి, కేంద్రమంత్రి మండలి నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్ వరకు ఏ కులాల వారు ఎక్కవ ఉంటారో అందరికీ తెలిసిందే. దేశంలో 50% ఉన్న బీసీలకు ఈ మొత్తం వ్యవస్థలో 15% ప్రాధాన్యత ఉందా అనేది అసలు ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు నాలెడ్జ్, కాంపిటీషన్ అంటూ ఏవో కబుర్లు చెప్తారు. మరి బీసీలకు నాలెడ్జ్ రాకుండా చేసింది, కాంపిటీషన్ నుంచి దూరంగా ఉంచింది ఎవరు?

10% లేని అగ్రకులాల్లో కేవలం 1% వెనుకబడ్డారని ఆగమేఘాల మీద ఈడబ్లూఎస్ రిజర్వేషన్ తెచ్చారు. మరి 50% పైనే ఉన్న బీసీల్లో 95% పైగా అతి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఎందుకు ఈడబ్లూఎస్ లాంటి రిజ‌ర్వేష‌న్ తీసుకురారు? బీసీల ఓట్ల‌తోనే గెలిచే ప్ర‌భుత్వాలు, బీసీల టాక్సుల‌తోనే న‌డిచే వ్య‌వ‌స్థ‌లో బీసీలు ఎప్పుడూ బాధితులుగానే ఉన్నారు. అగ్రకులాల్లో పేదల గురించి కన్నీళ్లు కార్చే ప్రభుత్వాలు, పార్టీలకు బీసీ సమాజంలో పేద‌ల‌లు ఉన్నారంటే ఎందుకు ప‌ట్టించుకోదు?

ప్రభుత్వంలో బీసీలు నిర్ణయాధికారంలో ఉన్నా, సరైన ప్రాతినిధ్యంలో ఉన్నా బీసీలకు ఇలాంటి అన్యాయం జరిగేదా? కేంద్ర విద్యా సంస్థల్లో బీసీల వాటా 2 శాతం కూడా లేదు. చిత్రంగా వారికి 27% రిజర్వేషన్ ఉంది. కనీసం ఆ కోటా ఎందుకు నింపడం లేదు? చదువుకున్న బీసీలే లేరా ఈ దేశంలో?.. బీసీలు కొన్ని పదవుల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఎక్కడా.. 4వ తరగతి, అంత కంటే చిన్న ఉద్యోగాల్లో. అక్కడ బీసీలకు ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు? ఓపెన్ కేటగిరీ మొత్తం ఎవరు తీసుకెళ్తున్నారు? ఇవన్నీ చర్చనీయాంశాలే.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!