– కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పింది నిజమే
– 14 ఏళ్ల క్రితమే చెప్పినా పట్టించుకోని కేరళ ప్రభుత్వం
– పశ్చిమ కనుమలకు పొంచి ఉన్న ముప్పు
నిర్దేశం, తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్‌లో నిన్న భారీ కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం సాయత్రం నాటికి సుమారు 160 మందికి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా గాయపడ్డారు. 3000 మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో నీటితోపాటు వచ్చిన చెత్తాచెదారం మెప్పాడి గ్రామాన్ని ముంచేసింది.
ముండక్కై, చురల్మల, అత్తమాల, నూల్‌పుజా గ్రామాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు, అన్నీ కొట్టుకుపోయాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు, డాగ్ స్క్వాడ్ సహాయక చర్యలు చేపట్టాయి. 160 మంది మృతికి సంతాప సూచకంగా ఈరోజు కేరళలో జాతీయ జెండా సగం మాస్ట్‌లో ఉంది, అయితే వాయనాడ్‌లో ఇంత భారీ కొండచరియ ఎందుకు సంభవించింది? ఒక అధ్యయనం దీనికి సంబంధించి కొంత సమాచారం వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. వాతావరణ మార్పు, మృదువైన ఉపరితల భూభాగం, అటవీ విస్తీర్ణం కోల్పోవడం వల్ల వాయనాడ్‌లో వినాశకరమైన కొండచరియలు విరిగిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గత సంవత్సరం విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశంలోని కొండచరియలు ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలు 30 ఉంటే.. ఒక్క కేరళలోనే 10 ఉన్నాయి.
పశ్చిమ కనుమలు, కొంకణ్ కొండలలో (తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర) 0.09 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా కేరళలో పశ్చిమ కనుమలలో జనాభా కూడా చాలా ఎక్కువ. 2021లో స్ప్రింగర్ ప్రచురించిన ఒక అధ్యయనంలో కేరళలోని కొండచరియలు విరిగిపడే ప్రాంతాలన్నీ పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉన్నాయని, ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం, వాయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నాయని పేర్కొంది.
14 ఏళ్ల క్రితం చేసిన సిఫార్సులు అమలు కాలేదు
వాయనాడ్‌లో నిన్న జరిగిన కొండచరియలు విరిగిపడటం పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల ప్యానెల్ సిఫార్సులను మరోసారి గుర్తు చేసింది. కేరళలోని పర్వత శ్రేణులను పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా ప్రకటించి వాటి పర్యావరణ సున్నితత్వం ఆధారంగా పర్యావరణ సున్నిత మండలాలుగా విభజించాలని సిఫారసు చేస్తూ ప్యానెల్ 2011లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
పర్యావరణపరంగా సున్నితమైన జోన్-1లో మైనింగ్, పవర్ ప్లాంట్లు, పవర్ ప్రాజెక్టులు, పవన శక్తి ప్రాజెక్టులపై నిషేధం విధించాలని కూడా సిఫారసు చేసింది. అయితే పారిశ్రామికవేత్తలు, స్థానిక సంఘాల ఒత్తిడి కారణంగా ప్యానెల్ సిఫార్సులు 14 సంవత్సరాలుగా కూడా అమలు కాలేదు.