నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు దిక్కెవరు..?
– జిల్లాకు రాని అధ్యక్షుడు
– నియోజక వర్గానికే పరిమితమైన మాజీ మంత్రి
– కవితతో నేతలకు సమన్వయం కరువు
– ఇలా అయితే పార్లమెంట్ ఎన్నికలకు కష్టమే
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి నాయకుడు లేని నావాలా తయారైంది. జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి జిల్లా వైపు కన్నెత్తి చూడక పోవడంతో పార్టీని పట్టించుకునే వారు కరువయ్యారు. అధికారంలో ఉన్న సమయంలో గాని, పోయిన తర్వాత గాని జీవన్ రెడ్డి పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమావేశం ఏర్పాటు చేయలేదు. జీవన్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడమే పెద్ద తప్పుగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. నిత్యం కేసీఆర్, కేటీఆర్ వెంట ఉండే జీవన్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించడం సరైంది కాదని అప్పట్లో అభిప్రాయపడ్డారు. కానీ కేటీఆర్ తన అనుచరులకు ఒక్కో జిల్లా అప్పగించారు. వారెవరూ గెలువలేకపోయారు. జీవన్ రెడ్డిని మార్చాలని ఇటీవల కార్యకర్తలు అధిష్ఠానానికి విన్నవించారు.
ఎంపీ ఎన్నికల్లో కష్టమే…
జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడివారక్కడ సైలెంట్ గా ఉన్న పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయలేమని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గనికే పరిమితమయ్యారు. సీనియర్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ సైలెంట్ గా ఉన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే ఒక కేసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పార్టీలో ఉంటారో ఉండరోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కవితతో సమన్వయం కరువు
కవితతో జిల్లా నాయకులకు సమన్వయం లేదు. ఆమె పెత్తనాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేశారు. దీనిని మాజీలు అప్పట్లో అడ్డుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రత్యర్థులకు సహకరించారని అభ్యర్థులు అనుమానిస్తున్నారు. కవిత తల దూర్చితే మరింత నష్టం జరిగే అవకాశముంది.