నిర్దేశం, హైదరాబాద్ః అదేదో సినిమాలో కాలేజీ విద్యార్థులు అడుగుతారు. ముందుగా మమ్మల్ని కలెక్టర్లను చేయండి, తర్వాత పరీక్షలు పెట్టండి అని. ఏడాది కింద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కూడా అచ్చం అలాగే ఉంది. ముందు విజయోత్సవాలు చేసుకుని తర్వాత పనులు చేస్తామనే ఉద్దేశమేమో కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చీపురుపుల్లంత కూడా అమలు కాలేదు. అప్పుడే విజయోత్సవాలు జరుపుతున్నారు. ఈరోజు వరంగల్ జిల్లాలో మొదటి విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇది జరగబోతోంది. ఆ తర్వాత కరీంగనర్, మహబూబ్ నగర్ లలో కూడా నిర్వహించబోతున్నారు. బహుశా.. ఆ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని గొప్పలు చెప్పుకోబోతున్నారు.
ప్రభుత్వానికి క్లారిటీ వచ్చింది
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. అయితే ఏడాదైనా అందులో ఒకటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు. మహాలక్ష్మీ పథకంలో ఒక్క ఉచిత బస్సు మాత్రమే అమలు అయింది. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. ఆరెండింటి ప్రస్తావనే లేదు. మిగిలిన 5 గ్యారెంటీలు కాంగ్రెస్ నేతలకైనా గుర్తున్నాయో లేదో. 100 రోజులు అన్న దగ్గర ఏడాది పూర్తి కావచ్చింది. బహుశా.. ఇవి ఇప్పట్లో అమలు కావని ప్రభుత్వానికి కూడా స్పష్టత వచ్చింది. పని కానంత మాత్రాన పండగనెందుకు ఆపాలని అనుకున్నారేమో ఏమో.. ఎప్పుడైతేనేమి, అదేదో ఇప్పుడే చేస్తే కాసేపు కాలక్షేపం అని విజయోత్సవాలు జరుపుతున్నట్లు ఉన్నారు.
గెలిపించినవారే గర్జించారు
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఉద్దేశపూర్వకంగానే వారిని పట్టించుకోలేదు. ఈ వ్యతిరేకతనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పని చేసింది. చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలలు కాకముందే.. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడ్డారు. మధ్యలో లోకసభ ఎన్నికలు రావడం, ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలేదనే కారణాలు ప్రజా వ్యతిరేకతను కొంత ఆపింది కానీ, విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత పనితీరుకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది.
రెడ్డి విజయోత్సవాలు అంటే బాగుంటుంది
ఒక పక్క కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధేమో.. సామాజిక న్యాయం, ఎవరెంత మందో అంత వాటా ఉండాలని అంటున్నారు. నిమ్న కులాలను అగ్రకులాలు వంచించాయని, మోసం చేయాలని పదే పదే చెప్తున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం చూస్తే రెడ్డి తప్ప మరేమీ కనిపించడం లేదు. ప్రభుత్వంలో రెడ్డిలే ప్రధానంగా ఉన్నారు. అధికారుల్లో ఉన్నత పదవులు రెడ్డిలకే ఇస్తున్నారు. ఇంతా చేసి.. ఈ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెందింది. రేపటి విజయోత్సవాలను ప్రజాపాలన విజయోత్సవాలు అని కాకుండా రెడ్డిపాలన విజయోత్సవాలు అంటే కరెక్టుగా ఉంటుంది.
కేసీఆర్ లాగే ఉంది పాలన
తెలంగాణ ఏర్పడిన అనంతరం ఎన్నికల్లో పిచ్చాపాటి హామీలు ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక అన్నీ పక్కన పెట్టేశారు. ఫాం హౌజ్ లో రిలాక్స్ అవుతున్న టైంలో వచ్చే ఆలోచనలను అమలు చేస్తే గొప్పలకు పోయేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయి, మూసీ అంటూ ఏవేవో మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్ ఎలాగూ సరిపోదు కాబట్టి.. కేసీఆర్ లాగే గారడీ చేయాలని అనుకున్నట్లు ఉన్నారు. తెలంగాణలో అభివృద్ధి మరీ ఎక్కువై.. భరించలేక గోదావరి, కృష్ణా నదులై పారుతున్నట్లు డంబాచారానికి పోతున్నారు. అదేదో ఓ డైలాగ్ ఉంటుంది. మ్యాటర్ వీక్ ఉన్న దగ్గరే ప్రచారం పీక్స్ లో ఉంటుందన్నట్టు.. కాంగ్రెస్ కు చేయడం చాతకాక, ప్రచార ఆర్భాటానికి పోతోంది. నిజానికి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. వందల కోట్లు పెట్టి పత్రికల్లో ప్రకటనలు, బహిరంగ సభలు చేయాల్సిన అవసరం ఉండదు.