ఖాకీ డ్రెస్ వదిలాడు.. ఖద్దరు డ్రెస్ లో కదిలాడు.. మాజీ DSP గంగాధ‌ర్ తో నిర్దేశం స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ

– పోలీసు బాస్ గా సక్సెస్..
– మరింత సేవ చేయాలని పొలిటికల్ లీడర్ గా..

(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)

సమాజంలో పోలీసు జాబ్ కు ఉన్న గౌరవం వేరు.. ఖాకీ డ్రెస్ లో కనిపించగానే అలర్ట్ అయ్యే వారే ఎక్కువ. కారణం..? తప్పు చేసినోళ్లను అరెస్టు చేసే అధికారం ఆ ఒక్క పోలీసుకే ఉంది. కానిస్టేబుల్ కావచ్చు.. సబ్ ఇన్ స్పెక్టర్ కావచ్చు.. సర్కిల్ ఇన్ స్పెక్టర్ కావచ్చు.. ఇంకెదైనా ఉన్నత జాబ్ లోని పోలీసు అధికారి కావచ్చు.. ఆ ఖాకీ డ్రెస్ కు ప్రజలు ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది మరి. కానీ.. మధనం గంగాధర్ ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దరు డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరో పన్నెండేళ్ల సర్వీస్ ఉండగానే డీఎస్పీ పదవికి రాజీనామా చేసి తాను కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల కథన రంగంలోకి దిగిన మధనం గంగాధర్ అప్పుడే గ్రౌండ్ లెవెల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయనకు అంతలోనే ఎంతగానో ఆదరణ వస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రిటైర్డ్ అధికార్లు ఇలా ఒక్కక్కరుగా మద్దతు పెరుగుతోంది. అనతి కాలంలోనే ఇంత మద్దతు అందుకున్న నవ రాజకీయ నాయకుడు, మాజీ పోలీస్ బాస్ మధనం గంగాధర్ ను ‘‘నిర్దేశం’’ సీనియర్ రిపోర్టర్ వయ్యామ్మెస్ ఉదయశ్రీ పలకరించింది.

నిర్దేశం: మీ కుటుంబ నేపథ్యం ఏంటి?

గంగాధర్: నా పేరు మధనం గంగాధర్. నా తల్లిదండ్రులు రాజలింగం-గంగమ్మ. ఐదుగురు కొడుకుల్లో నేను మొదటివాడిని. ఆర్మూర్ పట్టణం, సంచార జాతి బేడ బుడగజంగం కుటుంబం మాది. పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో ఆర్మూర్ లో మా కుటుంబం స్థిరపడింది. చిన్నప్పటి నుంచి వివిధ పనులు చేస్తూ చదువుకున్నాను. బాలకార్మికుడిగా, పేపర్ బాయ్ గా, సీజనల్ పనులు కూడా చాలా చేశాను. చదువకునే సమయంలో ఎన్సీసీలో చేరాను. అందులో సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి చేరడంతో నాకు దేశం, దేశ భద్రత, సమగ్రత, నాయకత్వ లక్షణాలు, సమాజానికి మెరుగైన సేవలు అందించాలని ఆలోచన పెరిగింది.

నిర్దేశం: పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలు అడ్డు రాలేదా?

గంగాధర్: కుటుంబ బాధ్యత కోసం పని చేశాను, నా ఆసక్తితో చదువుకున్నాను. ఇందులో నాకు ఏదీ ఇబ్బంది అనిపించలేదు, ఏది అడ్డు అనిపించలేదు. రెండు విషయాల్లో కుటుంబం నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. రెండింటినీ ప్రేమతో, గౌరవంతో ముందకు సాగించాను.

నిర్దేశం: ఎందుకు పోలీసే కావాలని అనిపించింది?

గంగాధర్: నేను చదువకున్న, పెరిగిన ప్రాంతం ఆర్మూర్. రెండు జాతీయ రహాదారుల గుండా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ ఉన్న ప్రాంతం. పోలీసు వ్యవస్థలో డీఎస్పీ కార్యాలయం ఉండే పట్టణం. ఇక్కడ ప్రజా భద్రత ఎలా ఉంటుంది? ఎన్ని రకాల అవసరాలు ఉంటాయి? అనే విషయంలో పోలీసు వ్యవస్థ పని తీరును, వారి అవసరాన్ని దగ్గరి నుంచి చూశాను. దాదాపు అన్ని అవసరాల్లో పోలీసుల ప్రమేయం, అవసరం ఉంటుంది. బాధితులకు, ఆశావాహులకు తొందరగా న్యాయం దొరికేది, వారు వెంటనే ఆశ్రయించేది పోలీసులనే. అటు న్యాయం చేయడంతో పాటు గౌరవం కూడా దక్కుతుంది. అందుకే పోలీసు కావాలని నిర్ణయించుకున్నాను.

నిర్దేశం: పోలీసు అయ్యేందుకు ఎలా ప్రిపేర్ అయ్యారు?

గంగాధర్: ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సౌకర్యాలను సమర్ధవంతంగా వాడుకున్నాను. గ్రౌండ్, 24 గంటల లైబ్రరీ, సీనియర్స్ గైడెన్స్, మెస్.. ఇలా అన్నింటిని సరిగ్గా వాడుకున్నాను. వీటితో పాటు నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇంకా ఎక్కువ కాలం చదవలేకపోయాను. అందుకే పీజీ చేస్తున్నప్పుడే ఎస్ఐ జాబ్ కొట్టాను. మొదటి పోస్టింగ్ ఆలేరులో వచ్చింది.

నిర్దేశం: మొదటి పోస్టింగ్ అనుభవాలేంటి?

గంగాధర్: ఆలేరు ఎంతో కమ్యూనికేషన్స్, పెద్ద ట్రాన్స్ పోర్ట్ ఉన్న ఏరియా. అలాగే చాలా సమస్యాత్మక ప్రాంతం కూడా. నిజం చెప్పాలంటే.. కొత్త ఆఫీసర్లు హాండిల్ చేయలేని ప్రాంతం. నన్ను అక్కడికి ప్రయోగాత్మకంగానే పంపారు. నాకు పరీక్ష పెట్టారు. బహుశా.. మరెక్కడా ఇలా జరిగి ఉండకపోవచ్చు. అదే నాకు కలిసొచ్చింది కాబోలు. చాలా నేర్చుకున్నాను. చాలా ఎదిగాను.

నిర్దేశం: మొదటి పోస్టింగ్ సవాల్ ఏంటి?

గంగాధర్: నేను సర్వీస్ లో జాయిన్ అయిన కొత్తలోనే బస్ రాబరీ జరిగింది. దొంగలు బస్సెక్కి, మారణాయుధాలు చూపించి ప్రజల దగ్గర డబ్బులు, నగలు దోచుకెళ్లారు. సీనియర్ల గైడెన్స్ తీసుకుని ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నాను. నా సర్వీసులో ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా.. ముందుగానే ఒక అంచనాకు రావడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పని చేయడం వల్ల ఎక్కడా సమస్యగా అనిపించలేదు. అయితే మిర్యాలగూడ ప్రజలు నన్ను ఎక్కువగా ఆదరిస్తారు. వాళ్లలా నాకు బాగా కనెక్ట్ అయ్యారు.

నిర్దేశం: నక్సలిజం వైపు వెళ్లే వారికి, దొంగలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేవారట? అది ఎలా హ్యాండిల్ చేశారు?

గంగాధర్: ఇంటరాగేట్ చేసే క్రమంలో మేము వారి నుంచి చాలా డేటా సేకరిస్తాం. చదువు లేకపోవడం, లేదంటే డ్రాపౌట్, ఆర్థికంగా చితికిపోయి ఉండడం లాంటి కారణాల వల్ల దారి తప్పుతుంటారు. అలాంటి వారిని కొందరు మళ్లిస్తుంటారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఒక్కటే సరిపోదు. నాకు తెలిసిన కంపెనీల దగ్గరికి తీసుకెళ్లి ఉద్యోగం కల్పించేవాడిని. ఉద్యోగం పొందినవారు పొరపాటున కూడా మళ్లీ అటువైపు వెళ్లరు. మా డిపార్ట్ మెంట్ కు సంబంధం లేని వారి నుంచి కూడా నాకు ప్రశంసలు అందాయి. చాలా తృప్తినిస్తాయి అలాంటి పనులు.

నిర్దేశం: మీకు ఇలా బాగా సంతృప్తినిచ్చిన సంఘటనలు ఇంకా ఏమున్నాయి?

గంగాధర్: సర్వీస్ అంతా సంతృప్తిగానే నడిచింది. ప్రతి సందర్భంలోనూ చాలా కమిట్మెంట్ తోనే పని చేశాను. అయితే ఒక రెండు ఉదహారణలు చెప్తాను. ఒక చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు దినేష్ కుమార్ దార్నేకు ఉరిశిక్ష పడే విధంగా నేను, నా టీం ప్రతిష్టాత్మకంగా పని చేశాం. గచ్చిబౌలి ఇంస్పెక్టర్ గా ఉన్నప్పుడు 8 నెలల నిండు గర్భిణి హత్య జరిగింది. ఆమెను ఏడు ముక్కలుగా నరికి ఆధారాలు లేకుండా చేశారు. నిందితుడిని ఆరేళ్ల పాటు బెయిల్ మీద బయటకు రాకుండా చేసి, అన్ని ఆధారాలతో యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశాను. ఈ కేసులో నన్ను కోర్టు 19 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.

నిర్దేశం: అంత ప్రేమించే ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ఎందుకు రావానుకున్నారు?

గంగాధర్: ఉద్యోగ రంగం ఏదైనా పరిమితులు ఉంటాయి. 26 ఏళ్ల ఉద్యోగ జీవితం సంతృప్తికరమే అయినా.. ఇంకా ఏదో చేయాలనే తపన మొదటి నుంచి అలాగే ఉంది. ఇప్పుడు ఉన్న ఉద్యోగంతో అన్నింటినీ అందుకోలేను. అపరిమితమైన సమస్యల పరిష్కారానికి వేదిక రాజకీయమే. పైగా, శారీరంగా బలంగా ఉన్నప్పుడు ఏదైనా పని తీసుకుంటే అత్యుత్తమంగా చేయగలం. అందుకే, ఈ సమయం రాజకీయానికి సరైందని అనుకున్నాను.

నిర్దేశం: రాజకీయాల్లో కులాధిపత్యం ఎక్కువ. దాన్నెలా ఎదుర్కుంటారు?

గంగాధర్: మనకు సమగ్రమైన ఆలోచన ఉండాలి. ప్రజలందరూ ఉత్పత్తిలో సంపదలో భాగం. అవకాశాల్లో కూడా అందరూ భాగం కావాలి. సమాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉంటాయి. వారిని మోటివేట్ చేస్తూ, వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పోవాలి. అందరిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి, అదే విధంగా ముందుకు వెల్లగలిగితే అందరి ఆదరణ పొందగలం.

నిర్దేశం: ఏదైనా పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందా?

గంగాధర్: ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీ నుంచి టికెట్ అవసరమే. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో బాగా పని చేస్తున్నాను. బహుశా.. ఇప్పుడున్న స్థాయిలో నాకు టికెట్ రాకపోవచ్చు. ఇప్పుడు అంత అర్హత లేకపోవచ్చు. నేను ఇంకా మెరుగవ్వాలి. అయితే, ప్రధాన పార్టీల నుంచి టికెట్ అయితే ఆశిస్తున్నాను.

నిర్దేశం: ఎన్నికల్లో మీ మేనిఫెస్టో ఏంటి?

గంగాధర్: నా దగ్గర చాలా అద్భుతమైన మేనిఫోస్టో ఉంది. నిరుద్యోగులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ ప్రొఫెనషల్స్ కి ఉపయోగపడేలా మంచి ప్రణాళిక ఉంది. అలాగే 50 ఏళ్ల క్రితం డిజైన్ చేసిన ఎంఎల్సీ స్టక్చర్ లో మార్పు వచ్చే విధంగా మేనిఫెస్టో సిద్ధం చేసుకున్న. సమయం చూసి విడుదల చేస్తాను.

నిర్దేశం: ఎన్నికలంటే చాలా సమీకరణలు కావాలి. మీ శక్తి ఏంటి?

గంగాధర్: దేనికైనా ప్రణాళికాబద్దమైన సంకల్పం ముఖ్యం. ఇప్పుడు రాజకీయాలు చేసే వారు కూడా వారికి అనుకూలంగా వ్యవస్థను నిర్మించుకున్నారు. అందుకే వారి డామినేషన్ నడుస్తోంది. మనకు ఏం కావాలో మనం ఆ వ్యవస్థను నిర్మించాలి. అది సాధ్యమే. ఎందుకంటే.. ఇప్పుడున్నవన్నీ మనుషులు నిర్మించినవే. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే.

నిర్దేశం: ఎమ్మెల్సీగా గెలిస్తే చేసే మొదటి పని ఏంటి?

గంగాధర్: నిరుద్యోగులకు, మహిళలకు శాశ్వతమైన పరిష్కారం దొరికే విధంగా అజెండా ఉంది. ఉద్యోగాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నవారికి రకరకాల సమస్యలు ఉన్నాయి. ప్రైవేటు వర్కర్లకు నిర్ధిష్టమైన చట్టం లేదు. ఆర్థిక స్థిరత్వం, మద్దతు సరిగా లేదు. వాటికి పరిష్కారం చూపే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. ఓటు వేయని వారికి కూడా సమస్యలు ఉంటాయి. ఓటేయకపోవడం కూడా ఒక కారణమే. వాళ్లెందుకు ఓటేయలేదని కూడా కనుక్కోవాలి. వీటన్నిటి పరిష్కారానికి ప్రణాళిక వేసుకున్నాను. సంజార జీవితం నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, జీవిత పాఠాలు నేర్చుకుని డీఎస్పీ వరకు వచ్చిన వ్యక్తిని. సమాజంలోని సమస్యలు బాగా తెలుసు. వాటి పరిష్కారానికి మార్గాలను శోధించగలను. అందుకే గ్రాడ్యూయేట్లు నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!