– హ్యాకింగ్ అంటూ ఒంటి కాలిపై లేస్తున్న పార్టీ అధిష్టానం
– రాష్ట్రంలో అధికారం ఉండడంతో నోరుమెదపలేకున్న నేతలు
నిర్దేశం, హైదరాబాద్: ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్లు ఉంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేస్తోందంటూ జాతీయ కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ కు నోట మాట రావడం లేదు. కారణం.. కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ ను ఓడించి సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. పట్టమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది పరిస్థితి. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అంటే రాష్ట్రంలో వచ్చిన అధికారం మీద దెబ్బపడుతుంది. కావు అంటే కాంగ్రెస్ అధినాయకత్వానికి వ్యతిరేకం అవుతుంది.
టెన్షన్ పెడుతున్న రాహుల్ తీరు
ఈవీఎం హ్యాకింగ్ గురించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌనంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో, అవి కూడా పార్టీ ఐటీ సెల్ నుంచి వస్తున్న కొన్ని పోస్టులు మినహా పార్టీ నేతలెవరూ ప్రత్యక్షంగా దీనిపై కామెంట్ చేయడానికి ముందుకు రావడం లేదు. మరొకపక్క పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీనేమో.. ఈవీఎంపై రోజురోజుకూ స్వరం పెంచుతున్నారు. ఈ పరిస్థితి తెలంగాణలోనే కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
నోరు మూయించిన మోదీ.. బూస్ట్ ఇచ్చిన మస్క్
నిజానికి, ఈవీఎం హ్యాకింగ్ మీద కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే మొన్నటి లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ దీనిపై మాట్లాడలేదు. కారణం, కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు రావడం. తమకు అనుకూలంగా సీట్లు వచ్చాక కూడా వ్యతిరేకిస్తే హాస్యమే అవుతుంది. అలా అని ఈవీఎంల మీద చర్చ ఆపేస్తే మొదటికే మోసం వస్తుంది. పైగా ఏదో మాట్లాడుదాం అనే లోపే.. ఇప్పుడు విపక్షాలు ఈవీఎంల మీద నోరు మెదపవు అంటూ మోదీ నోరు మూయించారు. కక్కలేక మింగలేక ఉన్న టైంలో ఎలాన్ మస్క్ కామెంట్స్ కాంగ్రెస్ కు బూస్టులా అందింది.
తెలంగాణ కాంగ్రెస్ దారెటు?
ఈవీఎంల మీద కాంగ్రెస్ అధిష్టానం స్టాండ్ స్పష్టంగానే ఉంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ లోనే అయోమయం కొనసాగుతోంది. ఒకవేళ ఇక్కడి నేతలు కూడా ఈవీఎం హ్యాక్ గురించి మాట్లాడితే.. జుట్టు బీఆర్ఎస్, బీజేపీలకు ఇచ్చినట్లే. దీంతో ఎటూ తేల్చుకోలేక జుట్టు పీక్కునే పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా.. దీనిపై స్పందించొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కానీ, ఏదో ఒక సందర్భంలో దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎటువైపనేది నేడు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న.