నిర్దేశం, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల సంరక్షణ కోసం చేపట్టిన హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యలను ఖండిస్తూ కూల్చివేతలు నిలిపివేయాలని వేసిన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం హైడ్రా కమిషనర్ కు చివాట్లు పెట్టింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాల్ని కూడా ఎలా కూల్చుతారంటూ హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనుమతులిచ్చిన వారిపై క్రిమినల్ కేసులు
అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారుల సంగతేంటని హైకోర్టు ప్రశ్నించింది. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కూల్చివేతలు చేపడితే తాము సంతోషించేవారమని కోర్టు తెలిపింది. హైడ్రా కూల్చివేతల విషయంలో పెద్దొళ్లు, పేదోళ్లు అనే వ్యత్యాసం చూపిస్తున్నారా అని కూడా ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన టైం గడవక ముందే ఇళ్లను కూల్చివేయడం హైడ్రా అత్యుత్సాహం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న భవనాలను హైడ్రా కూల్చడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.
కూల్చివేతపై
ఆదివారం కూడా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శని, ఆదివారాలతో పాటు సూర్యాస్తమయం సమయంలో కూల్చివేతలు చేపట్టవద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తి గుర్తు చేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనం ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. భవనాన్ని 48గంటల్లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చి 40గంటల్లో ఎలా కూలుస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీవాట్లు
అక్రమ కట్టడాలు కడుతుంటే ఆపండి లేదా సీజ్ చేయండి.. అంతే కానీ ప్రతిదానికి కూల్చివేస్తామంటే ఏంటి? హైడ్రా వ్యవహారం బాగోలేదు. ఇలాంటి చర్యలపై సంతోషంగా లేము. ట్రాఫిక్ కు సంబంధించి హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంది? కేవలం కూల్చివేతల మీదే హైడ్రా ఎందుకు అంత ఆసక్తితో ఉందని ధర్మాసనం తలంటు పోసింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జీవో 99పై స్టే విధించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చిరించింది.