నిర్దేశం, హైదరాబాద్: 1997లో 1 రూపాయికి 4 మొక్కజొన్నపొత్తులు వచ్చేవంటే నమ్మగలరా? అదే 1 రూపాయికి 4 జామకాయలు కూడా వచ్చేవి. మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్తే.. 10 పైసలకి ఐస్‌క్రీమ్ ఇచ్చేవారట. కాలం గడిచే కొద్దీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందడం అంటే ఇదేనా? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. దేశంలో ధరలు తగ్గితే, ప్రజల దగ్గర మనీ పెరిగితే.. అది అభివృద్ధి అనుకోవచ్చు. కానీ నానాటికీ నిత్యవసర, అత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే.. ప్రజలు ఏం చెయ్యాలి?
దసరా, దీపావళి లాంటి పండుగలు వస్తే.. ఇళ్లకు చుట్టాలు వస్తుంటారు. అందువల్ల ఎప్పటిలా కంటే.. కాస్త ఎక్కువగా మనీ ఖర్చు చేస్తాం. పిండి వంటలు చేస్తాం. అందరం కలిసి భోజనాలు చేస్తాం. అదో ఆనందం. కానీ ఆ ఆనందాన్ని కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు దూరం చేస్తున్నాయి. పెరిగిపోతున్న ధరలను కంట్రోల్ చెయ్యట్లేదు. పైగా మరింతగా ధరలు పెంచుతూ.. వికటాట్టహాసం చేస్తున్నాయి.
ఈమధ్యే నూనెల ధరలు పెరిగాయి. సరిగ్గా పండుగల టైమ్ చూసి కేంద్రం ఈ షాక్ ఇచ్చింది. అప్పటికే ఉల్లిపాయల ధరలు పెరిగి ప్రజలు షాక్‌లోనే ఉన్నారు. ఇప్పుడు ఏ వస్తువుల ధరలు తక్కువగా ఉన్నాయి అని వెతుక్కోవాల్సి వస్తోంది. సామాన్య, పేద ప్రజలు పండుగ చేసుకోవాలంటేనే ఆసక్తి తగ్గిపోతోంది. చేతిలో మనీ ఉన్నప్పుడే కదా పండుగ ఆనందం ఉండేది. పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలు లీటర్‌కి 20 రూపాయలకు పైగా పెరిగాయి. వేరుశనగ నూనె ఏకంగా 160 రూపాయలు దాటేసింది. రైస్ బ్రాన్ ఆయిల్ సైతం రూ.120కి చేరింది. కొబ్బరి నూనె ధర కూడా భారీగా పెరిగింది. వంటనూనెలకు కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో.. ఆ వంకతో కంపెనీలు భారీగా ధరలు పెంచేశాయనే ఆరోపణలున్నాయి.
ఒకప్పుడు రూ.100కే సంచి నిండా కూరగాయలు వచ్చేవి.. ఇవాళ రూ.500 సరిపోవట్లేదు. ప్రజలు ఏం చెయ్యాలి? చివరకు ఆకుకూరల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. కొత్తిమీర కొండెక్కి కూర్చుంది. 50 గ్రాములు 20 రూపాయలు ఉంటోంది. ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో.. కూరగాయల కొరత ఉంది. అదే సమయంలో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ.. ధరలు పెంచుతున్నారు.