ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వజ్రాయుధం
నిర్దేశం, నిజామాబాద్ :
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, అది దేశం యొక్క దశ-దిశాను నిర్దేశిస్తుందని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య అన్నారు. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించారు. మొదటగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.
తదనంతరం ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ ఓటు అనే రెండు అక్షరాలకు దేశ పరిపాలన స్థితిగతులను మార్చేశక్తి ఉందని, కేంద్ర, రాష్ట్ర, చట్టసభలలో, స్థానిక స్వపరిపాలన సంస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు ఓటు హక్కు ప్రధానమైనదన్నారు.
ప్రస్తుతం ఎన్నికలలో పెరిగిపోతున్న కుల, మత, ధన మద్యం ప్రాభాల్యాన్ని, హింసను నిరోధించి ప్రజాస్వామ్య ప్రాభావాన్ని, ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి పౌరుడు ఎన్నికలలో తప్పక పాల్గొనాలని, బేషజాలు తారతమ్యాలు లేకుండా ఆచితూచి భవిష్యత్తును నిర్మించే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడం ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కే కాకుండా భాద్యతన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ‘రైట్ ఓట్’ అనే ఆంగ్ల అక్షర ఆకారంలో కూర్చొని ఓటు విశిష్టతను తెలిపారు.
ఓటు హక్కు ప్రాముఖ్యతను, పౌరుల పాత్ర ఆవశ్యకత ను ప్రతిబింబించేలా రూపొందించిన గోడప్రతులను ప్రిన్సిపాల్ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గులు ఉపన్యాసం మొదలగు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.