నిర్దేశం, హైదరాబాద్: దేశంలో ఒక్కో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఒక్కోలా కనిపిస్తుంటారు. ఉదాహరణకు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వారికి హిందువులు, ఇతర మతస్తులుగా కనిపిస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ధనవంతులు పేదలుగా కనిపిస్తారు. మరో పార్టీకి మరోలా కనిపిస్తారు. దేశంలో ప్రధాన సమస్యలు పేదరికం, అజ్ణానం, దాడులు లాంటివి చాంతాడంత ఉన్నాయి. అయితే, మన దేశంలో వీటన్నిటీ ప్రధాన కారణం కులం.
వెనక్కి వెళ్తున్న వెనుకబడిన కులాలు
ఈ కుల సమాజంలో 90% ప్రజలు వెనుకబడినవారే. కేవలం 10% ప్రజలే ముందున్న వారు. ఈ సామాజిక అసమానతలను సరిచేయడానికి ఫూలే, అంబేద్కర్ లాంటి వారు చేసిన కృషి అనిర్వచనీయం. అయితే వారి ప్రయత్నాల వల్లో కాస్తో కూస్తో రెండు అడుగులు వేయగలిగిన వెనుకబడిన కులాలా తాజాగా వెనక్కి వెళ్తున్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ముందు కులాలు మరింత ముందుకు వెళ్తూ.. వెనుకబడిన కులాలను మరింత వెనక్కి నెట్టేస్తున్నాయి. రాజకీయం, వ్యాపారం, మీడియా, ఉద్యోగం.. ఆఖరికి బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడంలో కూడా అగ్రకులాలు అగ్ర భాగాన ఉన్నారు.
రాజకీయం
1990లో మండల్ కమిషన్ తర్వాత చట్టసభల్లో ఓబీసీ ప్రతినిధుల సంఖ్య 11 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ లాంటి పార్టీలు ఎదిగాయి. అయితే గత పదేళ్ల కాలంలో ఈ సంఖ్య తగ్గింది. ప్రస్తుతం చట్టసభల్లో ఓబీసీల సంఖ్య కేవలం 16 శాతమేనని స్వయంగా ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలు ఉన్న కారణంగా వారి సంఖ్యలో మార్పు లేదు.
మీడియా
హిందూ పత్రిక సర్వే ప్రకారం.. మీడియా రంగంలో నాయకత్వ స్థానాల్లో 90% శాతం అగ్రవర్ణాల వారే ఉన్నారు. ఈ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలు ఒక్కరు కూడా లేరని నివేదిక పేర్కొంది. ఇక కంటెంట్ విభాగంలో 80% అగ్రకులాలే ఉన్నారు. వెనుకబడిన వర్గాల వారు 20% మాత్రమే ఉన్నారు. నిన్నీ మధ్య యూట్యూబ్, ట్విట్టర్ వంటి వాటి వల్ల బహుజన వర్గాలు కొంత ముందుకు వస్తున్నప్పటికీ.. ఇక్కడ కూడా ఆధిపత్య కులాలదే అగ్రస్థానం ఉంది.
బిలయనీర్లు
బిలియనీర్లలో కూడా వెనుకబడిన వర్గాలు తగ్గారు. పదేళ్ల క్రితం మొత్తం బిలియనీటర్లలో 20 శాతంగా ఉన్న వీరి వాటా.. ప్రస్తుతం 11.5 శాతానికి తగ్గిందని ఎకనామిక్స్ క్యాస్ట్ సెన్సస్ అనే నివేదిక తెలిపింది. ఇందులో ఓబీసీల వాటా 9 శాతం కాగా, ఎస్సీల వాటా కేవలం 2 శాతమే. ఇక ఎస్టీలు 0.5 శాతంలో ఉన్నారు.
ఉద్యోగాలు
దేశంలో టాప్ విద్యా సంస్థల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 4వ తరగతి ఉద్యోగాల్లో కొంత మేరకు బహుజన వర్గాల ప్రాతినిధ్యం కనిపించినప్పటికీ ఉన్నత ఉద్యోగాల్లో చూద్దామన్నా కనిపించడం లేదు. నేచర్ సర్వే ప్రకారం.. ఐఐటీల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో అగ్రకులాలే 99% ఉన్నారు. ఐఐఎం, ఐఐఎస్సీ లాంటి ఇతర టాప్ విద్యాసంస్థల్లో కూడా ఇదే పరిస్థితి.
భూమి
ఇక మన దేశంలో భూమి చాలా ప్రాముఖ్యత కలిగింది. భూమి ఉన్నవారి వద్దే సంపదతో పాటు అధికారం ఉంటూ వచ్చింది. ఇలాంటి భూమి నేటికీ అగ్రకులాల వద్దే ఉంది. గ్రామీణ ప్రాంతంలోని వ్యక్తిగత భూముల్లో 48 శాతం భూమి అగ్రకులాల వద్దే ఉందని నేషనల్ స్టాటిటికల్ సర్వే తెలిపింది. దళితుల వద్ద కేవలం 8.5 శాతం భూమి మాత్రమే ఉంది. 29 శాతం భూమి ఓబీసీల వద్ద ఉంది.
దాదాపుగా అన్ని రకాల రంగాల్లో 10 శాతం ఉన్న అగ్రకులాలు 90 శాతం ఆక్రమిస్తే.. 90 శాతం ఉన్న బహుజన వర్గాల ప్రజలు కేవలం 10 శాతంలో ఉన్నారు.