నిర్దేశం, వాషింగ్టన్: మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై అమెరికా ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశారు. టార్గెట్ అంటే అంతా ఇంతా కాదు. తాను అధ్యక్షుడిని కాగానే, జుకర్‌బర్గ్‌ను జీవితాంతం జైలులో పెడతానని శపథం చేశారు. 2020 ఎన్నికల సమయంలో తనపై జుకర్‌బర్గ్ కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తే జీవిత ఖైదు తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఈ మాటలు ట్రంప్ డైరెక్టుగా చెప్పలేదు. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ‘సేవ్ అమెరికా’ అనే ట్రంప్ పుస్తకంలో ఈ హెచ్చరిక వచ్చింది. 2020 ఎన్నికల్లో మార్క్ జుకర్‌బర్గ్ రిగ్గింగ్ చేశారని ఈ పుస్తకంలో ట్రంప్ ఆరోపించారు.
జుకర్‌బర్గ్‌తో సమావేశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఎన్నికల ఫలితాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మేటా సీఈవో లేదా ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జీవిత ఖైదు తప్పదని హెచ్చరించారు. ట్రంప్ అబద్ధాలు చెప్పట్లేదు. బిడెన్-హారిస్ పరిపాలన అభ్యర్థన మేరకు తాను కొంత సమాచారాన్ని సెన్సార్ చేసినట్లు ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా అంగీకరించారు. కొవిడ్-19కి సంబంధించిన కొంత కంటెంట్‌ను సెన్సార్ చేయమని బిడెన్ పరిపాలన ఫేస్‌బుక్‌పై ఒత్తిడి తెచ్చిందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఆ తర్వాతనే 2020 ఎన్నికల్లో తనపై మార్క్ జుకర్‌బర్గ్ కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నారు.
జుకర్‌బర్గ్, ట్రంప్ మధ్య వివాదం ఏంటి?
డొనాల్డ్ ట్రంప్ ప్రకారం.. జుకర్‌బర్గ్ ఆయన భార్య ప్రిస్సిల్లా చాన్ 2020 ఎన్నికల్లో 420 మిలియన్ డాలర్లు తీసుకున్నారట. ఈసారి కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని జుకర్‌బర్గ్‌ను ట్రంప్ బహిరంగంగా బెదిరించారు. 2020 ఎన్నికల సమయంలో జుకర్‌బర్గ్ తనపై కుట్ర పన్నారని మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. కాగా, 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతివ్వబోనని, ఎన్నికల రోజు వరకు ఎలాంటి సాయం చేయబోనని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ టీమ్‌లో ఎలోన్ మస్క్ క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా, జుకర్‌బర్గ్ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం విశేషం.