విజయశాంతికి బెదిరింపు కాల్స్
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. సుదీర్ఘకాలం తరువాత ప్రజాప్రతినిధి అయ్యానని ఆమె హ్యాపీగా ఉన్న సమయంలో వారికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అది కూడా ఇటీవల ఆమె అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ఈ క్రమంలో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్ర కిరణ్ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల కిందట తమను సంప్రదించాడని, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ అని పరిచయం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాండిల్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్ చంద్ర కిరణ్ రెడ్డి తమతో కలిసి పనిచేస్తూ సొంతంగా వ్యాపారాలు చేసుకున్నాడు. తమ పేరును వాడుకొని బిజినెస్ చేస్తున్నాడు అని గుర్తించి అతడి సేవలు ముగించాను.
బిజెపిలో ఉన్న సమయంలో అతడు మమ్మల్ని కలిశాడు. అతడికి అవకాశం ఇచ్చినందుకు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేశాడు. నా పేరు చెప్పుకొని ఎంతో లబ్ధి పొందాడు. ఆ తర్వాత మేము బిజెపి నుంచి బయటకు వచ్చాము. తాము ఇంకా బకాయి ఉన్నామని, పెండింగ్లో ఉన్నవి చెల్లించాలని ఆ సమయంలో చంద్ర కిరణ్ రెడ్డి నుంచి మెసేజ్ వచ్చింది.మావద్ద ఏ బకాయిలు లేవని క్లియర్ గా చెప్పాం. పెండింగ్ బకాయిలు తీర్చకుంటే శత్రువులు అవుతారు, మిమ్మల్ని బజారుకీడుస్తా. మీ సంగతి చూస్తా అని ఏప్రిల్ ఆరో తేదీన బెదిరింపు మెసేజ్ పంపాడు. ఏదో పొరపాటున చేశాడనుకుంటే, అతని ఉద్దేశం అది కాదని మెసేజ్లను చూస్తే అర్థమవుతుంది. మా మీద బెదిరింపులకు పాల్పడుతున్న అతడి పై చర్యలు తీసుకోవాలి’ అని విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.