రేవంత్ కు ఇక తిరుగు లేదు…
– లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ స్పీడ్..
– పరువు తీసుకున్న బీఆర్ఎస్
– 8 సీట్ల గెలుపుతో తిరుగులేని నేతగా నిరూపణ
– బీఆర్ఎస్ ఓడి బీజేపీని గెలిపించింది
నిర్దేశం, హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డికి ఇక తిరుగులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఆయన లోక్ సభ ఎన్నికల ఫలితాలు అగ్ని పరీక్షలా భావించారు. డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 సీట్లతో సరి పెట్టుకుంది.
అయినా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డికి బూస్ట్ లాంటివే. మూడు స్థానాలు ఉన్న పార్టీని 8 స్థానాలకు చేర్చిన ఘనత రేవంత్‌దే. ఇపుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇక రేవంత్ రెడ్డికి తిరుగు లేనట్లే.
లోక్ సభ ఎన్నికల్లో రేవంత్
లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన దైన శైలిలో ఎన్నికల ప్రచారం చేసి బీజేపీని మూడు చెరువుల నీళ్లు తాగించాడు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ చేసిన ప్రచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సెంటర్ ఆఫ్ లీడర్ గా మారారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో సమానంగా ఎంపీ సీట్లు గెలిపించిన రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఢోకా లేదనేది నిజం.
పరువు తీసుకున్న బీఆర్ఎస్
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ పార్టీలు చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకుని తమ సత్తా చాటుకున్నాయి. బీఆర్ఎస్ మాత్రం ఒక్క ఎంపీ సీటు గెలువక పోవడం.. పోటీ చేసిన చాలా ప్రాంతాల్లో డిపాజిట్ లు కూడా రాకుండా పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో సమానంగా ఎంపీ సీట్లు తెచ్చుకోవడమే కాదు, కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం కూడా ఓ కారణమని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కారణంగా మోడీ దూకుడు రాజకీయాలు ఇక పనిచేయవు. రాష్టాలను ఇక్కట్లకు గురిచేసే చర్యలకు దిగకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
బీఆర్ఎస్ ఓడి బీజేపీని గెలిపించింది
లోక్ సభ ఎన్నికల్లో ఓడి పోతామని తెలిసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయి. తాము గెలవక పోయినా కాంగ్రెస్ పార్టీ గెలవద్దనే వ్యూహంతో కేసీఆర్ వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ గెలిచిన ఎంపీ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాలేదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఏది ఏమైనా బీఆర్ఎస్ బాధతో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ మాత్రం తాము లోక్ సభ ఎన్నికల్లో సక్సెస్ అయ్యామని గర్వంగా చెబుతున్నాయి.