జర్నలిస్టుల సంఖ్యను నియంత్రించాలి
– జర్నలిజం పెరిగింది, కన్ఫ్యూజన్ పెరిగింది
– ఒకప్పుడు జర్నలిస్టుగా పని చేశాను, అందుకే చొరవతో చెప్తున్నాను
– యువ జర్నలిస్టులు బాధ్యత తెలుసుకోవాలి
– ప్రిన్సిపుల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ పాటించాలి
– ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవంలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ
నిర్దేశం, విజయవాడః
“ఒకప్పుడు పత్రికలు మాత్రమే ఉండేవి, అవి కూడా చాలా కొద్దిగా ఉండేవి. ఆ సమయంలో జర్నలిస్టులు గౌరవం ఉండేది. కానీ, నేడు జర్నలిజం చాలా విస్తృతమైంది. జర్నలిస్టులు పెరిగారు, వారి మీద విమర్శలు కూడా పెరిగాయి. బ్రేకింగ్ న్యూస్ ల కోసం ఊహాజనిత వార్తలు పెరిగాయి. యాజమాన్యాలు అలాగే ఉన్నాయి. ఇంత కన్ఫూజన్, బాధ్యతారాహిత్యం పోవాలంటే జర్నలిస్టుల సంఖ్య కూడా తగ్గాలేమో” అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శనివారం విజయవాడలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
“నేను కూడా మొదట జర్నలిస్టునే. 1981లో ఈనాడు పత్రికలో విజయవాడ రిపోర్టరుగా పని చేశాను. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లినా మర్యాద చేసేవారు, గౌరవించేవారు. గొప్పగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఇండిపెండెంట్ చానల్స్ పేరుతో కొంతమంది యువ జర్నలిస్టులు మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకంగా ఉంది. టీవీలు వచ్చి బ్రేకింగ్ న్యూస్ వచ్చాక వాతావరణం మారిపోయింది. ఒకప్పుడు పత్రికల్లో వార్త వస్తే ప్రజలకు ఎంతో నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు నమ్మకం లేదు. వారికి నమ్మకం కలగాలంటే జర్నలిస్టుల్లో నిజాయితీ పెరగాలి. జర్నలిస్టుల మీద యాజమాన్యాలకు గౌరవం పెరగాలి. సమాజంలో కొంత మందే జర్నలిస్టులు. కానీ, అనేక సంఘాలు ఉన్నాయి. కన్ఫ్యూజన్ తగ్గించి, గౌరవం పెంచాలంటే జర్నలిస్టులను తగ్గించాలి, సంఘాలను తగ్గించాలి” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ “అన్ని బీట్లకు జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్టులు అందులో నిష్ణాతులు అవ్వాలి. అన్నీ వెరిఫై చేసుకుని వార్తలు రాయాలి. ప్రిన్సిపుల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ పాటించాలి. అంటే, మనం ఏదైనా వార్త రాసేప్పుడు వారికి ఏదైనా హాని కలుగుతుందా అని కనుక్కోవాలి. జర్నలిస్టులు బాగా సంపాదిస్తారు, విలాసవంతమైన భోగాలు ఉంటాయని ప్రజలు అనుకుంటారు. కానీ వందకు 99 జర్నలిస్టులకు ఇళ్లు ఉండవు, నానా కష్టాలు పడతారు. విలాసవంతమైన జీవితం కొద్ది మందికే. అందరికీ ఒక క్రమశిక్షణ కలిగిన సంఘం ఉండాలి. గుర్తింపు ఉండాలి. ఏడాదికోసారి శిక్షణ తరగతులు ఉండాలి. అలా జర్నలిజంపై గౌరవం పెంచాలి” అని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
నిర్దేశం చీఫ్ ఎడిటర్ కు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు
పాత్రికేయ విభాగంలో ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిస్టుగా నిర్దేశం దినపత్రిక చీఫ్ ఎడిటర్ యాటకర్ల మల్లేశ్ కు అవార్డు లభించింది. మాజీ సీజేఐ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అవార్డులు పొందిన జర్నలిస్టులకు ఎన్వీ రమణ స్వయంగా అవార్డులు ఇచ్చారు. అలాగే వెలుగు మెదక్ స్టాఫ్ రిపోర్టర్ శ్రీధర్ కు కూడా అవార్డు లభించింది. జర్నలిస్టులకు మెమొంటో , ప్రశంసా పత్రం, ఐదు వేల రూపాయల పారితోషకాన్ని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అందించింది.