వైభవంగా బాల రాముడి ప్రాణప్రతిష్ట
– అయోధ్యలో కొలువుదీరిన రామయ్య
– చరణ స్పర్శ చేసి తొలి హారతి ఇచ్చిన ప్రధాని
– ఐదు శతాబ్దాల కల సాకారం..
– దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం
– హాజరు కాని ఎల్ కే ఆడ్వాణీ
అయోధ్యలో సరయూ నది తీరాన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సోమవారం అంగరంగవైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో అభిజిత్ లగ్న ముహూర్తంలో పండితుల వేదమంత్రోఛ్చరణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. క్రతువు 12.05 ప్రారంభం కాగా, 12.29. 08 నుంచి 12. 30. 32 మధ్య 84 సెకన్ లలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాని మోదీ రాముడి చరణ స్పర్శ చేయడమే గాక తొలి హారతి ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ప్రధాని పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. బాలరాముడు స్వర్ణాభరలతో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. ఆలయం మీద హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
50 వాయిద్యాలతో మంగళ ధ్వని
ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా ఆలయ ప్రాంగణంలో 50 మంగళ ధ్వనులు ప్రతిధ్వనించాయి. భారతీయ సంప్రదాయానికి చెందిన సంగీత వాయిద్య కళకారులను వివిధి రాష్ట్రాల నుంచి రప్పించారు.
నెరవేరిన ఐదు శతాబ్దాల కల
రామాలయ నిర్మాణం, బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠతో ప్రజల ఐదు శతాబ్దాల కల నెరవేరినట్టైంది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో గుడి నిర్మించాలని భక్తులు కోరుతూ వచ్చారు. స్థల వివాదస్పదం కావడంతో గుడి నిర్మించలేదు. 1990 నుంచి రామాలయ నిర్మాణం ఆకాంక్ష ఎక్కువైంది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలో రాముడి గుడి నిర్మించడానికి మార్గం సుగమమైంది.
పులకించిన భారతవని..
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం యావత్తు భక్తి పారవశ్యంతో పులకించి పోయింది. దేశ వ్యాప్తంగా జై శ్రీరాం నినాదాలు మారు మోగాయి. ఇళ్లలో, ఆలయాల్లో పూజలు చేశారు. టీవీలలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించారు.
హాజరైన వివిధ రంగాల ప్రముఖులు
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు, స్వాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బేన్ పటెల్, ఆర్ ఎస్ ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ గర్భగుడిలో ఉన్నారు.
హాజరు కాని ఎల్ కే ఆడ్వాణీ
అయోధ్య రామాలయం కోసం పోరాటం చేసిన బీజేపీ అగ్రనేత ఎల్ కే ఆడ్వాణీ హాజరు కాలేదు. చలివాతవరణం వల్ల హాజరు కావడం లేదని ఒక ప్రకటన వెలువడింది. 1990లో గుజరాత్ లోని సోమ్ నాథ్ ఆలయం నుంచి అయోధ్యలో రామజన్మభూమి వరకు రథ యాత్ర నిర్వహించారు. ఆడ్వాణీ రథయాత్రతో బీజేపీ బలపడింది.