నిర్దేశం, హైదరాబాద్: 8 ప్లస్ 8 కలిపితే ఎంతని అంటే.. 16 అని టపీమని చెప్పేస్తారేమో.. అలా అయితే మీరు ఉప్పులో కాలేసినట్లే. సరైన ఆన్సర్ ఏంటంటే.. 8 ప్లస్ 8 కలిపితే సున్నా(0). ఇవి అంకగణితం కాదు, కమల గణితం. అదేంటో తెలంగాణలో బీజేపీకి బ్యాగు నిండా పుస్తకాలే ఉన్నాయి కానీ, ప్రోగ్రెస్ కార్డులోనే సున్నాలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ కలిపి 16 మంది చట్టసభ్యులు ఉన్నా కూడా.. తెలంగాణ ప్రజానికంలో బీజేపీ జాడ దొరుకట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గులాబీ పార్టీ గట్టిగానే ఎగురుతోంది. అటో ఇటో చిన్న పార్టీలు, చిన్నా చితకా ప్రజా సంఘాలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కానీ, కమలమే కనుమరుగైంది.
16 సీట్లు ఇచ్చినా పంగనామమే
ఎన్నడూ లేనన్ని సీట్లు బీజేపీకి ఈసారి తెలంగాణ ప్రజలు ఇచ్చారు. విచిత్రంగా దేశ వ్యాప్తంగా బీజేపీకి కాస్త వెనకడుగు వేస్తే.. తెలంగాణలో వీర విజృంభన చేసింది. దీంతో తెలంగాణకు ఏదో వస్తుందని ఆశపడ్డారు. అసూయపడేవారూ పడ్డారు. కానీ, వీరందరిపై కమల పార్టీ చన్నీళ్లు చల్లింది. ఏదో రెండు మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంది. అందులో ఒకటి సహాయ మంత్రే. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైనా, విభజన హామీలు గాలిలోనే పోయాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ సహా మిగతా బీజేపీ నేతలు కాంట్రవర్సీలో చలికాచుకోవడమే కానీ, కేంద్రం నుంచి తెచ్చింది ఏమీ లేదు. కనీసం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మీద వ్యూహాత్మక, నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడంలో కూడా బీజేపీ అట్టర్ ప్లాప్ అయింది.
అంతర్గత కుమ్ములాటలో బిజీ
నిజానికి ఈ జబ్బు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. బీజేపీకి ఎలా వచ్చిందనేది తెలియదు కానీ, ప్రస్తుతం ఆ పార్టీలో అధ్యక్ష పదవి మీద అంతర్గత కుమ్ములాట సాగుతోంది. తనకే కావాలంటే, తనకే కావలంటే కమల నేతలు జుట్టు పట్టుకోకుండానే కొట్టుకుంటున్నారు. బహుశా.. వీళ్లలో వీళ్లే ఇంత బిజీగా తగువులాడుకుంటుంటే బయటికి వారిని పట్టించుకునే టైం ఎక్కడుంటుంది? ఇకపోతే, పార్టీలో ఒకరికొకరికి పడకుండా పోయిందట. తమ ఈగోల ముందు పార్టీ కూడా చిన్నదైపోయింది.