బుద్ధిగా పనిచేసుకుంటున్న సీనియర్లు.. కాంగ్రెస్ కు ఏమైంది?

నిర్దేశం, హైదరాబాద్: కాంగ్రెస్ అంటే కలహాల పార్టీ. గొడవలేని రోజు ఉండదు. నాయకుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక జగడం జరుగుతూనే ఉంటుంది. ఇక సీనియారిటీ గొడవలైతే చెప్పనేలేం. నాయకుడికి సమర్థత ఉన్నదా లేదా అనేది కాదు.. ఢిల్లీ నుంచి గల్లి దాక నేను సీనియర్నంటే, నేనే సీనియర్ అని ఎప్పుడు కొట్లాటలోనే ఉంటారు. అదేంటో విచిత్రం.. ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు పదవులు పొందారు. ఆయన టీపీసీసీ చీఫ్ అయిన కొత్తలో కొంత గడబెడ నడిచింది కానీ, ఇప్పుడైతే ఎవరూ దీనిపై పెద్దగా మాట్లాడటం లేదు. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇది సమస్యే కాదు.

రేవంత్ రెడ్డి చాకచక్యం
వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణ కాంగ్రెస్ లో అనేక మార్పులు వచ్చాయని చెప్తున్నారు. అంతకు ముందు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా పార్టీలో సీనియారిటీ గొడవలు బాగానే జరిగాయి. కానీ, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఇవి తగ్గుముఖం పట్టాయి. పార్టీలో ఇదే ప్రధాన సమస్య అని, ఇది సమసిపోయి సమన్వయం సాధిస్తే పార్టీ విజయాలవైపుకు అడుగులు వేస్తోందనే చర్చ బాగా ఉండేది. రేవంత్ దీన్ని ప్రముఖంగా తీసుకుని విజయవంతంగా పరిష్కారించారని అంటున్నారు. అదే నేడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉంచిందని, ప్రభుత్వంలో కొంత మంది సీనియర్లకు పదవులు రాకపోయినా అందుకే మౌనంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటున్నారని అంటున్నారు.

నిజానికి ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. మన పక్క రాష్ట్రమైన కర్నాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ ఉందని పరిస్థితులను బట్టి తెలుస్తూనే ఉంది. అయితే తెలంగాణలో కనిపిస్తున్న వాతావరణం సమన్వయంతో కూడినదా.. సమయం కోసం మౌనంగా ఉన్నదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ, ఇంతకు ముందెన్నడూ చూడని వాతావరణం మాత్రం నేటి తెలంగాణలో కనిపించడం విశేషం.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!