నిర్దేశం, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అంటే చిన్నపాటి జాతీయ ఎన్నికలే అనాలి. దేశానికి ఆర్థిక, సంస్కాృతిక రాజధానిగా మహారాష్ట్ర వెలుగొందుతోంది. అంతే కాకుండా.. యూపీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. మరి రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి ఉన్నవారైనా మహారాష్ట్రపై ఓ కన్నేసి ఉంచుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. కాసింత సమయం దొరికితే ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఇదే చర్చ. ఇక సర్వే సంస్థలు ఊరుకుంటాయా? వెంటనే వెళ్లి గ్రౌండ్ రిపోర్టు తీసుకుని, ఇవే అంచనాలు అంటూ.. లెక్కలు చెబుతాయి.
రాష్ట్రంలో మహాయుతి లేదా మహా వికాస్ అఘాడీలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే దానిపై వివిధ సర్వేలు వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, ఏక్నాథ్ షిండే. అజిత్ పవార్ కూటమి అయిన, ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని మ్యాట్రైస్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)ల కూటమి అయిన మహా వికాస్ అఘాడికి ఎదురుదెబ్బ తగలనుందని చెప్పింది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ సీట్లలో మహాయుతి కూటమికి 145-165 సీట్లు వస్తాయని, అదే సమయంలో ప్రతిపక్ష ఎంవీఏకు 106-126 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
బీజేపీ నేతృత్వంలోని కూటమికి 47 శాతం, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 41 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 12 శాతం వరకు ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, థానే-కొంకణ్ ప్రాంతాల్లో బీజేపీకి భారీ మద్దతు లభిస్తుందని, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 9 వరకు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 1,09,628 మంది అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఇందులో 57 వేల మంది పురుషులు, 28 వేల మంది మహిళలు, 24 వేల మంది యువత అభిప్రాయాలు ఉన్నాయి.
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న విడుదలవుతాయి.