బిక్షాటన చేసి చదువుకుని నేడు ఏఎస్పీగా.. 12 ఫెయిల్ సినిమా కంటే పెద్ద కథ

‘‘తిండి దొరక్కపోతే చిన్నతనంలో అడుక్కోడానికి వెళ్లేవాడిని. భిక్షాటన చేసి చదువుకున్నాను. మీకు ఆ పరిస్థితి లేదు. బాగా చదువుకుని గొప్పవాళ్లు కావచ్చు” అని అనంతపురం జిల్లాలో ఓ ఏఎస్పీ పిల్లలకు చెప్పిన వీడియో సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఆకలి ఆయశాన్ని నేర్పితే కులవివక్ష కసిని పెంచింది. ఈ రెండు కలగలిస్తే నేటి ఏఎస్పీ హనుమంతు. జిల్లా పోలీసు శాఖకే రెండో అత్యున్నత వ్యక్తి స్థాయిలో ఉండి, చిన్నతనంలో తాను తిండికి లేక ఆడుక్కొని తిన్నానని చెప్పేందుకు ఎంత ధైర్యం కావాలి..?! అంత ధైర్యం ఉంది కాబట్టే.. పేదరికం అడుగడుగునా వెక్కిరించినా, మొక్కవోని గుండె ధైర్యంతో ఎదిరించి, కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఏఎస్పీ హనుమంతు చెప్పిన మాటలు వింటే, ఆయనకు హ్యాట్యాఫ్ చెప్పకుండా ఉండలేరు.

కూలికి పోతేనే కడుపు నిండేది

ఆకలితో అల్లాడుతూ, తల్లితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేసే వాడట. గుక్కెడు అన్నం కోసం ఊర్లు తిరిగేవాడట. ఊర్లో ఎవరైనా చనిపోతే, పనిచేసేందుకు వెళ్లేవాడట. చావు, కర్మకాండ పనుల్లో పాల్పంచుకునేవాడట. అంత్యక్రియల కోసం సమాధులు తీసేందుకు కూడా వెళ్లేవారట. ఆ తర్వాత వారు పెట్టే అన్నంతో కడుపు నింపుకునేవారట.

స్కూలుకు వెళ్తే తరిమేసారు

తన స్కూలు ప్రవేశం గురించి హనుమంతు మాట్లాడుతూ.. ‘‘ఒక గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ, ఒక చెట్టు కింద కూర్చొని అమ్మ, నేను ఇద్దరం తింటున్నాం. అప్పుడు పిల్లలు స్కూలుకు వెళ్తుంటే నేను వాళ్ళని చూస్తున్నానంట. అప్పుడు నాలో చదువు మీదున్న ఆసక్తిని అమ్మ గమనించిని స్కూలుకు పంపింది.’’ అని గుర్తు చేసుకున్నారు. తల్లితో కలిసి అన్నం కోసం వెళ్లే హనుమంతు ఆ ప్రాంతంలో ఉన్న వారికందరికీ తెలుసు. దీంతో ఆయనను మెదట స్కూల్లో చేర్చుకోలేదట. స్కూలుకు వెళ్లేసరికి అన్నం కోసమే వచ్చానేమో అనుకుని ‘ఇక్కడ అన్నం లేదు పో’ అని పంపించేశారట. టీచర్ చేరదీసి, కొత్త బట్టలు ఇచ్చి ప్రోత్సహించారని చెప్పారు.

డిగ్రీ అలా పూర్తైంది

అన్నం కోసం కర్మకాండలు చేయడం, సమాధులు తొవ్వడం చేశారట. కారణం అక్కడ అన్నం ఎక్కువగా పెడతారని. పనుల వల్ల స్కూలుకు వెళ్లకపోతే, ఎందుకు స్కూలుకు రాలేకపోతున్నానో తెలియక టీచర్లు రెండు మూడు సార్లు కొట్టారట. తర్వాత విషయం తెలిసి చలించిపోయారట. ఇక మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ల చిన్నమ్మకు పూలు ఇచ్చేవాడట. ఆమెకు ఆయన వయసున్న ఇద్దరు కొడుకులు ఉండడంతో డబ్బులకు బదులు వారి పాత బట్టలు అడిగేవారట. అలా సీజన్ వచ్చినప్పుడల్లా బట్టల కోసం ఆమె దగ్గరికి వెళ్లి తెచ్చుకునే వాడినని చెప్పారు. ఇక సీనియర్ల ఇళ్లకు వెళ్లి పని చేసి, వారి పుస్తకాలు తీసుకునేవాడట. అలా ఎన్నో కష్టాలకోర్చి మదనపల్లి బీటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.

హైదరాబాద్ లో అవే కష్టాలు

ఉద్యోగ సెలక్షన్ కోసం హైదరాబాద్‌కు వెళ్లి బస్టాండులో బెంచ్‌పైన పడుకొని సెలక్షన్స్‌కు వెళ్లానని హనుమంతు చెప్పారు. అన్నం కోసం ఉదయం ఫుట్ పాత్‌పైన ఉండే బండ్ల దగ్గర ప్లేట్లు కడగడం లాంటివి చేసేవాడిని తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు రన్నింగ్ చేస్తూ బస్టాండులో పడుకోవడానికి ఇబ్బంది కలిగితే తర్వాత భవన కార్మికుల దగ్గర పనికి వెళ్లుతూ అక్కడే పడుకున్నానని గుర్తుచేసుకున్నారు.

చిప్పలో తాగిన నీళ్లే కసిని పెంచాయి

అప్పట్లో గ్రామాల్లో అంటరానితనం పాటించేవారు. దళితులకు గ్లాసుల్లో కాకుండా కొబ్బరి చిప్పలో నీళ్లు ఇచ్చేవారు. ఈ ఘటన హనుమంతుకు ఎదురైంది. ‘‘ఒకసారి చెనగ పెరికే పనికి వెళ్లినప్పుడు దాహం వేసి, నాతో పని చేయిస్తున్న ఒకామెను నీళ్లు అడిగితే ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంది కానీ నాకు నీళ్లు ఇవ్వటం లేదు. ఏమయ్యింది అమ్మా అంటే చిప్ప కోసం వెతుకుతున్నాను అంది. మీ ఇంట్లో గ్లాసులు లేవా అమ్మా అని అడిగితే గ్లాసులో మీకు నీళ్లీయకూడదు కదా అంది. ఆ కొబ్బరి చిప్పలో నీళ్లు పోస్తుంటే బాధేసింది. అప్పుడు నేను ఇంటర్. ఎలాగైనా మంచి పొజిషన్‌కు వచ్చి వీళ్లకు సమాధానం చెప్పాలని ఆరోజే అనిపించింది’’ అని తన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన గురించి చెప్పాడు.

కిరణ్ కుమార్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హనుమంతు తిరుపతి ఏఆర్ డిఎస్పీగా పనిచేస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాలలో సిఎం కాన్వాయ్ భద్రతాధికారిగా హనుమంతు వ్యవహరించారు. ‘‘ఒకప్పుడు వాళ్ల ఇంటిముందర కుర్చోని తిన్నాను. ఆఫీసర్ అయ్యాక ఇంట్లో తిన్నాను’’ అని హనుమంతు చెప్పుకొచ్చారు. ‘‘నేను కష్టపడి కుటుంబానికి డబ్బులు ఇస్తూ చదువుకున్నాను. నా కథ తెలిస్తే కొంతమంది అయినా మారుతారు. ఇలా కొంతమంది తల్లుల కన్నీళ్లు తుడిచిన వాడిని అవుతానని ఇది చెబుతున్నా. అంబేద్కర్ ‘పే బ్యాక్ సొసైటీ’ గురించి చెప్పారు. నువ్వు ఎదిగిన తర్వాత మిగిలిన వారిని ఎదిగేలా చేయాలి అని చెప్పారు. నేను ఇప్పటికీ దాన్నే అనుసరిస్తున్నా’’ అని ఆయన తెలిపారు.

మేధావుల మౌనం ఈ ప్రపంచానికి చాలా నష్టం చేస్తుంది. ‘‘ఇప్పటికీ నేను బెగ్గింగ్ చేస్తూనే ఉన్నా. ఒకప్పుడు నాకోసం, ఇప్పుడు పేద ప్రజల కోసం. మేధావులు ముందుకు రావాలని అడుక్కుంటున్నా. సమాజం బాగుపడటానికి అడుక్కుంటున్నాను.’’ అని హనుమంతు చెప్పారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!