రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయిన బంగ్లా ప్రధాని

– స్వతంత్ర కుటుంబాలకు రిజర్వేషన్లపై అంటుకున్న నిప్పు
– తీవ్ర నిరనల నేపథ్యంలో రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా
– తన సోదరితో కలిసి భారత్ పారిపోయినట్లు వార్తలు
– మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆర్మీ

నిర్దేశం, ఢాకా: బంగ్లాదేశ్‌లో గత నెల నుంచి కొనసాగుతున్న విపరీతమైన హింస నేపథ్యంలో షేక్ హసీనా ఆ దేశ ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, షేక్ హసీనా మిలటరీ హెలికాప్టర్‌లో భారత్‌కు బయలుదేరినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

అధికారిక నివాసం నుంచి సోదరితో..
షేక్ హసీనా తన సోదరితో కలిసి ప్రధాని అధికారిక నివాసం ‘గాన్ భవన్’ నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చివరకు హసీనా సోమవారం తన పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ ధృవీకరించారు.

కర్ఫ్యూ ఉల్లంఘన
దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ధిక్కరించిన వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో నిరసనలు కొనసాగించారు. ఆ తర్వాత ప్రధాని అధికారిక నివాసంపై దాడి చేశారు. రాజధాని ఢాకాలో సైనికులు, పోలీసులు సాయుధ వాహనాలతో షేక్ హసీనా కార్యాలయం చుట్టూ ముళ్ల తీగతో అడ్డుకట్టలు వేశారు. అయితే జనాలు వీధుల్లోకి వచ్చి బారికేడ్లను ఛేదించారు.

మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుంది – ఆర్మీ చీఫ్
షేక్ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ ఢాకాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. “ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశాన్ని నడిపేందుకు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది” అని ఆయన అన్నారు. అలాగే, దేశంలో కర్ఫ్యూ లేదా ఎమర్జెన్సీ అవసరం లేదని, ఈరాత్రికి సంక్షోభం పరిష్కారమవుతుందని ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ అన్నారు.

బంగ్లాదేశ్‌లో నిరవధిక కర్ఫ్యూ
నిరసనకారులు, అధికార పార్టీ మద్దతుదారుల మధ్య చెలరేగిన హింసలో ఇప్పటివరకు 14 మంది పోలీసులతో సహా సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. హింసాకాండలో వేలాది మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే దేశం మొత్తం మీద నిరవధికంగా కర్ఫ్యూ విధించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!