ఆర్టికల్ 370 రద్దు తెచ్చిన మార్పు.. ప్రజాస్వామ్యం వైపు తీవ్రవాదులు, వేర్పాటువాదులు

నిర్దేశం, శ్రీనగర్: ఎవరి భావజాలం, ఎవరి ఉద్దేశాలు ఏమైనప్పటికీ.. ప్రజాస్వామ్యంలో వాటిని సాధించుకునే తరీఖా ఎన్నికల్లో కలబడి విజేతగా నిలబడటం. కానీ, కొందరు ఎన్నికలనే బహిష్కరిస్తుంటారు. ఉదాహరణకు దేశవ్యాప్తంగా లెఫ్టులు, జమ్మూకశ్మీర్ లో అయితే వేర్పాటువాదులు. బహుశా ఈ ఇద్దరికీ క్షీణ దశలో ఎన్నికలు, ఓటు రుచి తెలిసింది. లెఫ్టుల గురించి మాట్లాడితే.. జమ్మూకశ్మీర్ లో మాత్రం చాలా డ్యామేజీ జరిగాక కానీ, ఈ విషయం బోధపడలేదు. అందుకే, తాము ఇన్నాళ్లు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని ఎన్నికల్లో పోటీకి దిగారు.

సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య ప్రక్రియే మార్గమని ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు.. ప్రజలంతా ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 మందికిపైగా మాజీ మిలిటెంట్లు, వేర్పాటువాదులు, నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యులు, వారి బంధువులు స్వతంత్ర అభ్యర్థులుగా, లేదా పార్టీ టికెట్లపై పోటీ చేస్తున్నారు. వారిలో మాజీ వేర్పాటువాదులు జాఫర్‌ హబీబ్‌ దార్‌, సయ్యద్‌ సలీం గిలానీ, జావిద్‌ హుబ్బి, ఆగా ముంతాజిర్‌ మెహ్ది వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

జమ్ముకశ్మీర్‌ అప్నీ పార్టీ అభ్యర్థిగా జాఫర్‌ హబీబ్‌ దార్‌ బరిలోకి దిగారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేసి.. దీన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారాయి. అత్యంత బలమైన శాసన ప్రక్రియలో భాగంకాకపోవడమే ఇందకు కారణమని వేర్పాటువాదులు, తీవ్రవాదులు అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని జాఫర్ చెప్తున్నారు. ‘ఎన్నికల ప్రక్రియ ద్వారానే సమస్యలను పరిష్కరించగలం. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

జేకేఎల్‌ఎఫ్‌ మాజీ కమాండర్‌ ఫరూక్‌ అహ్మద్‌ దార్‌ కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సైఫుల్లా ఫరూక్‌గా కూడా పేరుపొందిన అహ్మద్ దార్‌… హబ్బా కడల్‌ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. 1989లో ఆయుధాల శిక్షణ కోసం అహ్మద్ దార్.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లారు. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆ సమయంలో అందరం తుపాకీ పట్టుకున్నాం. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఏజెంట్లు మమ్మల్ని తప్పుదోవ పట్టించారు’’ అని దార్‌ చెప్తుండడం విశేషం.

ఏడాదిపాటు తీవ్రవాద కార్యకలాపాలు నడిపిన దార్‌ ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి.. దాదాపు ఐదేళ్లు జైలు జీవితం గడిపారు. 2019లో మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కశ్మీర్‌లో పాకిస్తాన్‌ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పుల్వామా, కుల్గాం, బందిపొరా, బారాముల్లా, సోపోర్‌ సహా సుమారు 15 నియోజకవర్గాల్లో జమాత్‌ వ్యూహాత్మకంగా స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపింది. వారిలో తలాత్‌ మజీద్‌, సయార్‌ అహ్మద్‌, హఫీజ్‌ మొహమ్మద్‌ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. మాజీ మిలిటెంట్లు, వేర్పాటువాదులు కలిసి తహ్రీక్‌-ఎ-అవామ్‌ అనే రాజకీయ గ్రూపుగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!