రేవంత్ ఖేల్ షురూ
బీఆర్‌ఎస్ కోట ఖాళీ!
కాంగ్రెస్ బాట పడుతున్న గులాబీ దళం
మాజీ మంత్రులు, జెడ్పీచైర్‌పర్సన్లు, కీలక నేతలందరిదీ అదే దారి
రాష్ట్రంలో రంజుగా రాజకీయాలు
(ఈదుల్ల మల్లయ్య)
అవును.. రాష్ట్రంలో సీఎం రేవంత్ ఖేల్ షురూ అయింది.. ఇక గులాబీ దళాన్ని మడత పెట్టి చుట్టుడే అన్నట్లుగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీలక నేతలందరూ హస్తం బాట పట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలో గులాబీ కోట ఖాళీ కావడం ఖాయం అంటున్నారు. ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
ఇప్పటికే కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ తో సమావేశం కావటం పలు అనుమానాలకు కారణమైంది. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపు దిశగా రేవంత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు మంచి పట్టున్న జిల్లాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టినట్లు సమచారం. అందులో భాగంగా నియోజవర్గాల వారీగా చేరికలను ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చేరికలు ముమ్మరం..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవటం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ లక్ష్యంతో సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గానూ పార్టీ నాయకత్వం కొనసాగిస్తోంది. ఎంపీ సీట్లను గెలవటం ద్వారా రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల ఎంపిక పైన దాదాపు కసరత్తు పూర్తి చేసింది.
ఇతర పార్టీల నేతల చేరికలను ముమ్మరం చేయటం ద్వారా ప్రతిపక్షాలను దెబ్బ తీసే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటుగా కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు సునీతారెడ్డి, కుమారుడు రినీష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. సునీతారెడ్డి వరుసగా మూడోసారి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేయగా, ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
బొంతు రామ్మోహన్ సైతం…
జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లోకి చంద్రశేఖ రెడ్డి..
టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ స్వయానా పిల్లనిచ్చిన మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి కారు దిగడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన… తాను తెలంగాణ వాదిని అని చెప్పారు. బీఆరెస్స్ లో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇప్పుడు తాను తన పేరెంట్ పార్టీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కారణం… చంద్రశేఖర్ రెడ్డి గతంలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. ఇదే సమయంలో తాను కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీలో సూచనలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్..
నిజామాబాద్ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ రజిత యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు కీలక నేతలు వెళ్తున్న సమయంలో.. కాంగ్రెస్ కు ధీటుగా కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది