Take a fresh look at your lifestyle.

ప్రధానికి 12 అంశాలపై రేవంత్, భట్టి వినతిపత్రం

తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరముందని తెలిపారు

0 44

– ప్రధాని మోదీతో భేటి అయిన సీఎం, డిప్యూటీ సీఎం
– విభజన హామీలు సహా పలు అంశాలను నెరవేర్చాలని వినతి

నిర్దేశం, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై ప్రధానికి వినతి పత్రాలు అందించారు.

1. సింగరేణి ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49శాతం ఈక్విటీ వాటా ఉంది. దాని ప్రకారం బొగ్గును సింగరేణికే కేటాయించాలని ప్రదానిని కోరారు.
2. ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకుంది. కానీ ఇప్పటివరకుతెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదు. తెలంగాణకు IIM మంజూరు చేయాలని అభ్యర్థించారు.
3. 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు.. తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అవసరమైన భూమిని గుర్తించింది. ఆగిపోయిన ఆ ITIR ప్రాజెక్ట్ ను పునరుద్ధరించాలని కోరారు.
4. రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చింది. 2023 జులైలో వ్యాగన్ తయారీ కేంద్రానికి బదులుగా పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
5. హైదరాబాదులో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను స్థాపించడానికి పేరొందిన కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఈ ప్రతిపాదనలన్నీ ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని విన్నవించారు.
6. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకు 25 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సంసిద్ధంగా ఉందని చెప్పారు.
7. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధి కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకుఅయిదేండ్లలో తెలంగాణకు రూ.2,250 కోట్లు కేటాయించింది. అయితే వీటికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని కోరారు.
8. హైదరాబాద్లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్–కరీంనగర్, హైదరాబాద్ నాగపూర్ రహదారుల్లో ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను బదిలీ చేయాలని కోరారు. వీటితో పాటు హైదరాబాద్ సిటీలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌తో పాటు రవాణా సదుపాయాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని అభ్యర్థించారు.
9. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో ఈ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాను.
10. జాతీయ రహదారుల అభివృద్ధిలో బాగంగా భారత్ మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డులో ఉత్తర భాగం నిర్మాణంలో భాగంగా 50 శాతం భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వటంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరారు. దక్షిణ భాగాన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు.
11. తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరముందని తెలిపారు. జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్గొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్–అమనగల్–షాద్నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట–రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల– మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్– జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవల్లి–యాదగిరిగుట్ట–రాయగిరి క్రాస్రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు.
12. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking