ప్రతి పార్టీకి వెనుకబడే ఓటర్లు ఉంటారు. నిజం చెప్పాలంటే, ప్రతి పార్టీకి వెనుకబడిన వారే ఓటర్లు. ఆ వెనుకబడిన ఓటర్లతోనే ఆయా పార్టీలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అలా అని వెనుకబడిన వారిని వారు ముందుకు తెస్తారా అంటే అదీ కాదు. స్వయంగా ఆ పార్టీలే వారిని మరింత వెనుకకు నెడుతుంటాయి. కారణం, వాళ్లు ముందుకు వస్తే ఆ పార్టీలు వెనకకు పోతాయి. నేను చెప్తున్నది బీసీల గురించేనని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓటర్ల సంగతి పక్కన పెడితే. బీసీల నుంచి వచ్చే నాయకులు కూడా ఇలాగే ఉంటారు. నాయకులంటే ప్రజల వెంట తిరగాలి. కానీ, బీసీ నాయకులు మాత్రం అలా చేయరు. వారు అగ్రకుల నాయకుల వెంట తిరుగుతారు.
నిన్న ఒక చర్చలో భాగంగా సీనియర్ రాజకీయ విశ్లేషకులు అయిన నారగోని ఓ మాట అన్నారు. ‘‘రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రజల వెంట పడుతుంటే.. బీసీ, ఎస్టీ, ఎస్సీ నాయకులేమో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ల వెంట పడుతున్నారు’’ అని. నిజానికి నిజమే ఇది. ఈ నాయకులు వెనకాల ఉన్నారు కాబట్టే.. ఆధిపత్యకుల నాయకులు ముందుకు వెళ్తున్నారు. ధైర్యంగా పార్టీలు పెడుతున్నారు. వారికి నచ్చిన అంశాన్ని ముందుకు తెచ్చి, ఆ సమస్యలోనే బీసీలను నెట్టివేస్తున్నారు. అందుకే బీసీలు బ్యాక్ వర్డ్ కులాలుగానే కాదు బ్యాక్ వర్డ్ నాయకులుగా కూడా చరిత్ర సృష్టిస్తున్నారు.
10 ఏళ్ల క్రితం చట్టసభల్లో 22 శాతం ఉన్న బీసీ ప్రతినిధులు ఉండేవారు. కానీ ప్రస్తుతం అది 16 శాతానికి తగ్గింది. మండల్ కమిషన్ అమలు తరువాత బీసీ నాయకత్వంలో ఉన్న పార్టీలు ఒక్కసారిగా పైకి లేచాయి. ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్ వంటి పార్టీలు అధికారాన్ని సాధించాయి. దేశంలో ఏదో జరగబోతోంది, అగ్రకుల రాజకీయ కోటలు బద్ధలు అవుతున్నాయనే అంచనాలు వచ్చాయి. కానీ, అంతలోనే జాతీయ రాజకీయ క్రీడలో బలైపోయారు. బలైపోవడం అలవాటైంది కదా.. ఎవరినెందుకు బాధపెట్టడమని అలా చేస్తున్నారు కాబోలు. బీసీలు మరీ ఇంట్రోవర్టులు.
బీసీ పార్టీలు చాలా గమ్మత్తుగా వ్యవహరిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, లేదంటే బీజేపీల కూటముల్లో ఉంటాయి. వాటి ఎజెండా ఏంటంటే.. కాంగ్రెస్ వైపు ఉన్నవారు బీజేపీని ఓడించాలి, బీజేపీ వైపు ఉన్నవారు కాంగ్రెస్ ను ఓడించాలి. వారిని వీరిని ఓడించడం, గెలిపించడం తప్ప తాము గెలవాలని, తమ పార్టీ గెలవాలి, తమ సమాజం గెలవాలని ఎవరూ రాజకీయం చేయడం లేదు. సమస్య కులం కాకుండా ఉండేందుకు బీజేపీ, కాంగ్రెస్ లాంటి అగ్రకుల పార్టీలు జాగ్రత్త పడుతుంటే.. ఆ ఉచ్చులోనే బీసీ నాయకులు పడిపోతున్నారు. తమ పార్టీని నిండా పడేస్తున్నారు. ఇలా అయితే సామాజిక న్యాయం ఎక్కడి నుంచి లభిస్తుంది?
సొంతంగా పార్టీ కాదు కదా.. ఒక నాయకుడిగానైనా బీసీలు గుర్తింపు సాధించడం లేదు. చిన్నా చితకా పదువులు, ఉపశమనాలు, తమ వర్గాలకు పథకాలు అనే దగ్గరే ఆగిపోతున్నారు. వాటితోనే సంతృప్తి పడుతున్నారు. ఇంకొన్ని సార్లు అయితే.. వేరే పార్టీ కేవలం ఇద్దరు బీసీలకే అవకాశం ఇచ్చింది, ఈ పార్టీ ఏకంగా ముగ్గురికి ఇచ్చిందంటూ సంబరపడిపోతున్నారు. బీసీల సమస్యే ఈ దేశ సమస్యని మాన్యవర్ కాన్షీరాం అన్నారు. బహుశా.. ఈ విషయాన్ని బీసీ నాయకులు పరిగణలోకి తీసుకున్నట్టు లేరు. బీసీలను వాడుకునే అందరూ ఎదుగుతారు, కానీ బీసీలు మాత్రం అక్కడే ఉంటారు. దీనిపై బీసీ మేధావులు, నాయకులు ఆలోచించాలి.