నిర్దేశం, హెల్త్: కరోనా వైరస్ గ్లోబల్ మహమ్మారిని మనమందరం చూశాము. ఈ వ్యాధి ప్రపంచం మొత్తాన్ని ఏక కాలంలో కుదిపివేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అయితే, ఇలాంటి డెత్ గేమ్ మళ్లీ జరగడం కష్టమని చాలా మంది అనుకుంటారు. కానీ, వాస్తవం ఏమిటంటే 2050 నాటికి దాదాపు 4 కోట్ల మందిని చంపేసే సైలెంట్ కిల్లర్‌ను ప్రపంచం ఇంకా ఎదుర్కోబోతోంది. ఏంటీ ఈ సైలెంట్ కిల్లర్? దానిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
నిజానికి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల గురించి. అంటే, మందులు ఏమాత్రం లొంగని అంటువ్యాధులు. ‘ది లాన్సెట్’ జర్నల్‌లో వచ్చిన ఒక పరిశోధన ప్రకారం, 1900 నుంచి 2021 మధ్య, ఔషధ-నిరోధక ఇన్ఫెక్షన్ల కారణంగా 10 లక్షల మందికి పైగా మరణించారు. 2025 నాటికి అంటే వచ్చే 25 ఏళ్లలో దాదాపు 4 కోట్ల మంది దీని వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏం జరుగుతుంది?
ఔషధ ప్రభావాలను తట్టుకోగలిగే విధంగా బాక్టీరియా అభివృద్ధి చెందినప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఇప్పుడు తేలికగా నయమయ్యే వ్యాధులు కూడా భవిష్యత్తులో ప్రాణాపాయంగా మారతాయి. న్యుమోనియా, డయేరియా వంటి సాధారణ వ్యాధులు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, యాంటీబయాటిక్స్ అధిక వినియోగం దీనికి ప్రధాన కారణం. మీరు కూడా చిన్న సమస్య వచ్చినా వెంటనే మందు తీసుకుంటే, ఇక నుంచి ఆ అలవాటును మార్చుకోవాలి.
తప్పించుకోవడానికి మార్గం
రీసెర్చ్ హెడ్ డాక్టర్ మోహ్సిన్ నఘవి ప్రకారం, ఈ ఔషధ నిరోధకత సమస్య చాలా దశాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే, రాబోయే కాలంలో ఈ ముప్పు మరింత తీవ్రంగా మారనుంది. అత్యంత సమస్యాత్మకమైన బ్యాక్టీరియా కోసం కొత్త, మరింత ప్రభావవంతమైన యాంటీబయాటిక్స్‌ను అభివృద్ధి చేస్తే, సుమారు 11 మిలియన్ల మందిని రక్షించవచ్చని అంటున్నారు. టీకా, కొత్త మందులు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ ద్వారా తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి మనం కొత్త వ్యూహాన్ని రూపొందించాలని ఆయన అన్నారు.