రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం – 02

రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం

నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదెప్పుడు..?

ధారావాహిక – 02

నక్సలైట్ ఉద్యమం.. అనగానే మొదట  గుర్తుకు వచ్చేది చారుమజుందర్. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన తన తండ్రి స్వాతంత్ర్య పోరాట యోధుడైన బీరేశ్వర్ మజుందార్ ఉద్యమ స్పూర్తిని తీసుకున్నారు. 1967లో నక్సల్భరీలో గిరిజనులు భూస్వాములతో తిరుగుబాటు చేసిన ఉద్యమానికి చారు మజుందర్ నాయకత్వం వహించారు. అప్పటి వరకు ప్రజాస్వామ్య పద్దతిలో కొనసాగిన ఉద్యమం హింస మార్గంలో వెళ్లడంతో అదే స్థాయిలో నిర్బందం పెరిగింది. నక్సల్భరీ ఉద్యమ స్పూర్తితో దేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు  విస్తరించాయి. చాలా రాష్ట్రాలలో నక్సలైట్లు పోటీ ప్రభుత్వాలను కొనసాగించారు. కానీ.. ఆ ఉద్యమం తీరు తెన్నులను పరిశీలించాలంటే చారుమజుందర్.. కొండపల్లి సీతారామయ్య.. ముప్పాళ్ల లక్ష్మణరావుల ఉద్యమాలను తిరుగేయాల్సిందే.

హింసకు శ్రీకారం చుట్టిందే చారు మజుందర్

చారు మజుందర్ ఇరువై ఏళ్ల వయసులోనే తన చదువును అర్ధంతరంగా నిలిపి గిరిజనుల తెభాక మూమెంట్‌ ఉద్యమంలో చేరారు. 1937 – 38లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో చేరిన కొంత కాలానికే అందులోనుంచి బయటకు వెళ్లి భారత కమ్యూనిష్టు పార్టీలో చేరి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు.

అప్పటి పోలీసులు చారు మజుందర్‌ను అరెస్టు చేయాలని వారెంట్‌ జారీ చేసారు. తప్పని సరి పరిస్థితిలో ఆజ్ఞాతంలోకి వెళ్లి పోయిన చారు మజుందర్‌ ఉద్యమాలను బలోపేతం చేయడానికి గిరిజనులను.. రైతాంగాన్ని సంఘటితం చేసారు. ఆ పోరాటాలను చూసిన అప్పటి ప్రభుత్వం 1948లో భారత కమ్యూనిష్టు పార్టీపై నిషేదం విధించింది. ఆ సమయంలో చారు మజుందర్‌ను అరెస్టు చేసి మూడేళ్లు జైల్లో బంధించింది. జైల్‌ నుంచి విడుదలైన తరువాత 1954లో ఉద్యమంలో క్రీయశీల కార్యకర్తగా పని చేసే ఉద్యమ కారిణి లీలాను పెళ్లి చేసుకున్నారు చారుమజుందర్‌. ఆ తరువాత కాసు సన్యాల్‌, జంగల్‌ సంతాల్‌తో కలిసి చాలా ఉద్యమాలకు నాయకత్వం వహించారు ఆయన.

మొట్ట మొదట చారు మజుందర్‌ తన సొంత ఊరు నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.  సిలిగిరి సబ్‌ డివిజన్‌లోని తన స్వగ్రామంలో ఉండి ఉద్యమాలు ప్రారంభించారు. కష్ట పడి పని చేసే తమను శ్రమ దోపీడి చేస్తున్న భూస్వాములను గిరిజనులతో ఖతం చేయించారు చారుమజుందర్. నక్సల్బరీలో జరిగిన భూస్వాముల హత్యలతో కమ్యూనిష్టుల ఉద్యమం మరో మలుపు తిరిగింది. ఆ ఉద్యమాన్ని అణచడానికి వచ్చిన పోలీసు అధికారిని గిరిజన రైతాంగం హత్య చేసింది.

ఆ మరునాడు భారీ ఎత్తున వచ్చిన పోలీసు బలగాలు జరిపిన కాల్పులలో తొమ్మిది మంది గిరిజనులు మృతి చెందారు. ఆనాటి గిరిజన తిరుగుబాటు ఉద్యమాన్ని  చైనా పత్రికలు ‘వసంత మేఘ గర్జన’గా అభివర్ణించాయి.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రైతాంగ పోరాటాలు చేయడంలో కీలక పాత్ర పోషించారు చారు మజుందర్‌, కాసు సన్యాల్‌, జంగల్‌ సంతాల్‌.. అయితే.. మొదట నక్సల్బరీలో ఆదివాసులు చేసిన తిరుగుబాటుతోనే  నక్సలైట్‌ ఉద్యమంగా పిలువడం ప్రారంభమైంది.

నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఉద్యమాలు చేస్తున్న చారు మజుందర్‌, కాసు సన్యాల్‌, జంగల్‌ సంతాల్‌ తో పాటు తరిమెల నాగిరెడ్ది, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, చండ్ర రాజేశ్వర్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్యలు 1967 నాటి కమ్యూనిష్టు ఉద్యమాలలో కీలకంగా వ్యవరించారు.

         1975లో విప్లవం..

ఒక మానవుణ్ణి మరో మానవుడు దోపీడి చేయని వ్యవస్థ కావాలని సాయుద పోరాటం చేయడంతో విప్లవం వస్తోందని చారు మజుందర్ పేర్కొన్నారు. 1975లో భారత దేశంలో విప్లవం సాధించగలమనే నమ్మకంతో ఆయన సాయుద పోరాటాన్ని ఉదృతం చేశారు.  సాయుద పోరాటం అంటే..? తుపాకులతో గెరిల్లా పోరాటం చేసి శతృవును తుద ముట్టించి విప్లవం సాధించడం. తుపాకి గొట్టం ద్వారానే విప్లవం సాధిస్తామని నమ్మిన చారు మజుందర్‌ వర్గ పోరాట నిర్మూలనలో భాగంగా భూస్వాములను.. వడ్డి వ్యాపారులను.. దొరలను హత్యలు చేసి వారి నుంచి గ్రామాలను విముక్తి చేయాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు పల్లెలకు వెళ్లాలనే పిలుపు విప్లవోద్యమంలో మరో మలుపు.

చారు మజుందర్‌ అధ్యక్షతన 1968 అక్టోబర్‌లో జరిగిన సమావేశం కీలకమైన తీర్మాణాలు చేసింది. సాయుధ పోరాటాన్ని తక్షణం ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి, కార్మిక వర్గ నాయకత్వంలో జనతా ప్రజాతంత్ర రాజ్యస్థాపన దిశగా అడుగులు వేయాలని చర్చించారు. 1969లో భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్‌`లెనినిస్ట్‌)గా పార్టీ పెట్టి ఉద్యమాలు చేయడం ప్రారంభించాడు చారుమజుందర్. చివరకు 16 జూలై 1972లో ఆజ్ఞాతంలో ఉన్న చారు మజుందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రహస్యల కోసం చిత్రహింసలు పెట్టారు. ఆనారోగ్యంతో బాధ పడుతున్న అతనికి మెడిసిన్‌ ఇవ్వకుండా హింసించారు. చివరకు 28 జూలై 1972లో తెల్లవారు జామున 4 గంటలకు పోలీసు స్టేషన్‌ లాకప్‌ లో ప్రాణాలు వదిలాడు చారు మజుందర్‌.

చారుమజుందర్ మరణం తరువాత నక్సలైట్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే..? రేపటి కోసం ఎదురు చూడాల్సిందే..?

(3వ ఎపిసోడ్ లో కలుద్దాం..)

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »