రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం – 3
నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదెప్పుడు..?
ధారావాహిక – 03
శ్రీకాకుళ ఉద్యమం..

నక్సల్స్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి నుంచి ముప్పాళ్ల లక్షణరావు వరకు మధ్యలో వెంపటాపు సత్యంలాంటి ఇంకెందరో ఉన్నారు. విద్యార్థులకు విద్య బోధన చేయాల్సిన ఆ ఉపాధ్యాయులు కుళ్లిన సమాజానికి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు.

శ్రీకాకుళం జిల్లాలో 1960 – 67 మధ్య కాలంలో గిరిజనులను దోపీడి చేసే భూస్వాములకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుడు వెంపటాపు సత్యం ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయనను గిరిజనులు ప్రేమతో ‘గప్పగార’ అంటూ పిలిచే వారు. సహాచరుడు ఆదిభట్ల కైలాసంతో శ్రీకాకుళం అడవులలో ఉద్యమాలు నిర్వహించి భూస్వాముల గుండెల్లో బాంబులా తయరయ్యారు వెంపటాపు సత్యం. పార్వతీపురం తాలుకాలోని బోరికొండలలో 1970 జూలై నెలలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలను పట్టుకుని పోలీసులు కాల్చి చంపారు. శ్రీకాకుళం ఉద్యమంలో వెంపటాపు సత్యం.. సుబ్బరావు పాణిగ్రహి.. ఛాగంటి భాస్కర్ రావు.. మల్లిఖార్జునుడు.. ఆదిబట్ల కైలాసం.. పంచాది కృష్ణమూర్తి.. పంచాది నిర్మల (దంపతులు)తో పాటు ఎందరో నక్సల్స్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మొదట తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో శ్రీకాకుళంలో పని చేసిన వెంపటాపు సత్యం, పంచాది కృష్ణమూర్తి, పంచాది నిర్మల, కైలాసం శ్రీకాకుళం అడవులలో చేసిన ఉద్యమం చరిత్రలో నిలుస్తోంది.

బాంచను బతుకుల్లో మొలిచిన బందూకులు
‘ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ అణచివేత ఉంటుంది. ఎక్కడ అణచి వేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఆయా పరిస్థితులు పరిమితులను బట్టి తిరుగుబాట్లు, ఉద్యమాలు, విప్లవాలుగా రూపొంతరం చెందుతాయనడానికి చరిత్ర చెబుతున్న సత్యం. నక్సల్స్ ఉద్యమం ఇందుకు మినహాయింపు కాదు.’

ఏ ఉద్యమమైన ఎందుకు మొదలవుతుంది..? మనిషిని మనిషిగా గుర్తించని, గౌరవించని, బతుకనీయని పరిస్థితులు ఏర్పడినప్పుడే. నక్సల్స్ ఉద్యమ చరిత్రను ఆ దృక్కోణంలోంచే చూడాలి. ఒకనాడు ‘సాపాద లక్షదేశమని’ (వెయి బంగారు నాణేల కప్పం లభించే ప్రాంతం) పిలిచే భూబాగంలో ఉన్న తెలంగాణలోని జిల్లాలు శతాబ్దాల నాడు సస్యశ్యామల దేశమే. రాజ్యం, దాని తాలూకు అధికారం కడుదూరంగా ఉన్న జనపదం, రాజ్యం విస్తరించడం మొదలయ్యాక పీడన మొదలైంది. తర్వాత కాలంలో రాచరికాలు కుప్పకూలినా అవ్యవస్థ అవశేషాలైన నిజాం జమానాలు జాగీర్దారులు, దొరలు వెట్టి చాకిరీ కట్టుబానిసతనాన్ని అమలు చేశారు. ఒల్లు వంచి చుక్క చెమట రాల్చని దొరలు ఊళ్లకు ఊళ్లు భూములన్నీ రాయించేసుకున్నారు. పొలాలు, పుట్రలు, కొండలు, కోనలు అడవుల్లాగే ఊళ్లో జనాన్ని కూడా తమసొంత ఆస్తిగా మార్చుకున్నారు. అజామాయిషీ చేశారు. నిజాం పాలన అంతమైనా నల్లదొరల అధికారం చెక్కుచెదరలేదు. భూమిపైనే కాక జన జీవనాన్ని మొత్తంగా దొరలే నిర్ణయించారు. నిర్దేశించారు. కూలీ చేయించేది దొరే. వడ్డీలకు డబ్బులిచ్చేది దొరే. శిక్షలు వేసేది దొరే. పల్లె జీవనానికి దొరే సర్వం. శతాబ్దాలుగా కొనసాగిన ఈ అర్ధవలస భూస్వామ్య వ్యవస్థను ఒక తరం భరించింది. మరోతరం కర్మ సిద్దాంతంతో సరిపెట్టుకుంది. కొత్తతరం మార్పు కోసం ఆలోచన చేసింది. చదువు పేరిట రాజధాని చేరిన కొత్తతరం విద్యాలయాలలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. అక్కడి కొత్త గాలులు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు వ్యాపించాయి. పీడిరచే వ్యవస్థపై పిడికిలి బిగించాయి. ఆ తిరుగుబాటు శతాబ్దాల చరిత్రను తిరగారాస్తున్నందన్న విషయం అప్పుడు వారికి తెలియదు..!!

నిప్పురవ్వపుట్టింది..
తేదీలు.. తిథులు.. వారాలు వదిలేస్తే తెలంగాణ జిల్లాలలో నక్సల్స్ ఉద్యమం నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చారుమజుందర్ గుంటూర్ జిల్లా గుత్తికొండ బిళంకు వచ్చిన సందర్భంలో పురుడు పోసుకుంది. చదువు లేని తరం కర్మ సిద్దాంతానికి తమ బతుకులు వదిలేయగా కొత్త తరం మాత్రం ‘బాధల కేదారంలో శోధన మొదలెట్టింది. చదువుకోసం కాలేజ్‌కు వెళ్లిన విద్యార్థులు కొత్త విషయాలు తెలుచుకున్నారు. 1967లో పశ్చిమబెంగాల్‌లోని నక్సల్‌బరిలో పుట్టిన ఉద్యమం యువతకు స్పూర్తి నిచ్చింది. సాయుధ పోరాట మార్గంలో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే దోపీడి లేని వ్యవస్థ నిర్మాణం సాధ్యమన్న నిర్ణయానికి వచ్చారు వారు. సమాజంలో మార్పు కోసం, భూస్వామ్య వ్యవస్థ ఉక్కుపాదాల కింద నలిగి పోతున్న బడుగు జనం విముక్తి కోసం, ఉద్యమ మార్గాలను ఎన్నుకుని దీనికి ప్రతిబందకంగా నిలిచే తమ ఉన్నత విద్యకు స్వప్తీ పలికారు. నక్సల్బరిలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాట నమూనాతో, శ్రీకాకుళం రైతాంగ పోరాటం ఆధర్శంగా 1970 దశకంలో తెలంగాణ గడ్డపై విప్లవ కెరటాల నిప్పు రాజుకుంది. ఆ నిప్పును రాజేసింది.

ఒకే ఒక్కడు కొండపల్లి సీతారామయ్య.
కానీ, ఆ నిప్పుకు ఆజ్యం పోసి మంటలు పెరుగడానికి కారణమయ్యారు కె.జి. సత్యమూర్తి అలియాస్ శిలసాగర్, అప్పల సూరి, కొలిపార నరసింహారావు, మహాదేవన్, ముక్కు సుబ్బరెడ్డి అలియాస్ రంగన్న, ఐ.వి.సాంబశివరావు, మల్లిఖార్జున శర్మ. ఆ ధగధగమండే ఆ మంటల నుంచి ఎగిరి పడ్డ నిప్పు కణాలే దేశం నలుమూలల అగ్గి రాజేసింది. నక్సల్స్ ఉద్యమ మంటలను దేశ వ్యావ్తంగా ముట్టించి నూతన ప్రజాస్వామిక విప్లవం వస్తుందని నిరాంతంర ఉద్యమిస్తున్నారు. ఉద్యమించారు వారు. ఆ నక్సల్స్ ఉద్యమం ‘ రైల్ బండి’ గమ్యం ‘విప్లవం’ నిజానికి విప్లవం విందు బోజనం కాదు. ఆ రైల్‌లో ఎందరో ఎక్కుతారు. గమ్యం రాక ముందే (బలహీనతలతో, స్వార్థమైన కోరికలతో లొంగిపోతారు.) బలవంతంగా కారణలు వెతుక్కొని దిగుతారు. ఆ తరువాత ఎసీ గదులలో కూర్చుండి ఉద్యమాన్ని విమర్శిస్తుంటారు ఉద్యమ ద్రోహులు. కొందరైతే ప్రభుత్వం ఇచ్చే పారితోషికంకు లొంగి పార్టీ సమాచారం చెపుతారు.
అయినా ఆ ఉద్యమ రైలు బండి బాటలో ప్రయాణం చేసినంతా కాలం వారు చేసిన పోరాటాలు, త్యాగాలు చరిత్రలో నిలుస్తాయి.
కొండపల్లి సీతారామయ్య జీవితం కూడా త్యాగాల పుట్ట. విద్యార్థి దశ నుంచే కమ్యూనిష్టు ఉద్యమంలో పని చేసిన వృత్తి విప్లవకారుడు అతను. కొండపల్లి సీతారామయ్య సహాసం. ఉద్యమ ఎత్తుగడలు. వ్యూహాల గురించి శతృవు కూడా ఒప్పుకోవాల్సిందే. అతను రాజేసిన నిప్పురవ్వ నుంచి ఎగిసిపడిన నిప్పు కణాలే సురపనేని జనార్ధన్‌రావు, ముప్పళ్ల లక్ష్మన్‌రావు, మల్లోజుల కోటేశ్వర్‌రావు, మల్లోజుల వేణుగోపాల్, నల్లా ఆదిరెడ్డి, కుమార్‌రెడ్డి, విజయకుమార్(జర్నలిస్టు), డాక్టర్ విజయకుమార్, మీసాల రాజిరెడ్డి, గజ్జెల గంగారాం, నరేష్ (సత్యం) తుచర్ కాంత్ బట్టచార్య, చంద్రశేఖర్(చంద్రం), నారాయణ, చాహు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నళిని, డాక్టర్ చంద్రవతి, గాదే ఇన్నయ్య, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ వేణు, డాక్టర్ సూరీ, డాక్టర్ చిరంజీవి, గాజర్ల రాజ్‌కుమార్, జున్ను చిన్నలు, వెంకట రమణి, ఐలయ్య, అల్లం నారాయణ, నారాదాస్ లక్ష్మన్‌దాస్, విశ్వేశ్వర్‌రావు, శివాజీ, బండ ప్రకాష్, నారాయణరెడ్డి, క్రిష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, డాక్టర్ బాబురావు, బార్ల యాదగిరి రాజు, కె.సత్యనారాయణ, పాముల రాంచందర్, కె.వి.తిలక్, కోరేడ్డి వెంకట్‌రెడ్డి ఇలాంటి విప్లవ కారులు ఎందరో ఉద్యమ బాటలో ప్రయాణం చేసారు. ఆ ఉద్యమ బాట నుంచి మొదట తప్పుకుంది డాక్టర్ కొల్లూరి చిరంజీవి. నాగాపూర్‌లో జరిగిన ఉత్తర తెలంగాన ప్లీనరి తరువాత పోలీసులకు పట్టుబడిన చిరంజీవి పోలీసులకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కొన్నెళ్ల తరువాత ముక్కు సుబ్బరెడ్డి. శివాజీ, అల్లం నారాయణ, బండ ప్రకాష్ ఇలా చాలా మంది తుపాకీ వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. మరి కొందరు పోలీసులకు పట్టుబడి చిత్రహింసలు అనుభవించారు. తుచర్‌కాంత్ బట్టచార్య లాంటోళ్లు అక్రమ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. నమ్మిన ఆశయం కోసం ఇంకా ఆ ఉద్యమాన్ని బలోఫేతం చేస్తున్న వారు మరి కొందరు. వీళ్లంతా మొదటి, రెండవ తరం విప్లవకారులు. ఆ తరువాత ఉద్యమ రణరంగంలో దూకిన వీరులు పటోళ్ల సుధాకర్, మాధవ్, సంతోష్‌రెడ్డి, దొంతు మార్కెండెయా, రమాకాంత్(ఆర్.కె.), జంపన్న వేల మంది నక్సలైట్ ఉద్యమ బాట పట్టారు.
విద్యార్థులకు విప్లవ రాజకీయాలు నేర్పి పోరుబాట చూపిన కొండపల్లి సీతారామయ్య.
ఆయన ఆలోచన నుంచి పుట్టిన ఉద్యమం ఏమైందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..)
(4వ ఎపిసోడ్ లో కలుద్దాం..)