– విండోస్ లో సాంకేతిక లోపంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు
– నిలిచిపోయిన విమాన సర్వీసులు, రైళ్లు
– స్టాక్ మార్కెట్, న్యూస్ ఛానళ్లపై తీవ్ర ప్రభావం
నిర్దేశం, న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ ఉన్నట్టుండి గట్టి దెబ్బే కొట్టంది. విండోస్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు, విమాన సేవలు నిలిచిపోయాయి. బ్రౌజింగ్ చేయబోతే తమకు ఎర్రర్ తో కూడిన బ్లూ స్క్రీన్‌ని కనిపిస్తోందంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ వినియోగదారులు కంప్టైంట్ చేస్తున్నారు. దీని కారణంగా సూపర్ మార్కెట్లు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమెరికాలోని మూడు విమానయాన సంస్థలు తమ విమానాలన్నింటినీ నిలిపివేశాయి. భారత్‌లో కూడా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
చాలా పెద్ద మీడియా సంస్థల్లో కూడా పని ఆగిపోయింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ సర్వీస్ 911కి అంతరాయం ఏర్పడింది. బ్రిటన్‌లో స్కై న్యూస్ ప్రసారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో విండో క్రాష్ అయిన చిత్రాలను ప్రజలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
ఇండియాలో ప్రభావం
భారతదేశంలో విమాన ప్రయాణ సేవలను అందించే మూడు విమానయాన సంస్థల సర్వర్లు పెద్ద ఎత్తున సాంకేతిక లోపాలను ఎదుర్కొన్నాయి. ఇండిగో, అకాసా ఎయిర్, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో వెబ్ చెక్-ఇన్‌లో సమస్యలను ఎదుర్కొన్నాయి. దీంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ సహా దేశంలోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానాశ్రయాలలో మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రయాణికులకు తెలిపింది.
రైల్లు ఆగిపోయాయి, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై కూడా ప్రభావం
మైక్రోసాఫ్ట్ కారణంగా బ్రిటన్‌లో రైల్వే వ్యవస్థ కూడా కుప్పకూలింది. మైక్రోసాఫ్ట్ ఆగిపోవడంతో రైళ్లను నడపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైల్వే కంపెనీలు ప్రయాణికులకు తెలిపాయి. స్కై న్యూస్ చానెల్ అంతరాయం కారణంగా మూసివేయవలసి వచ్చింది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పనులు కూడా ఆగిపోయాయి.
సూపర్ మార్కెట్లు, న్యూస్ ఛానెల్స్ పై తీవ్ర ప్రభావం
మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ న్యూస్ 24 ఛానెల్ న్యూస్ ప్యాకేజీని ఇవ్వలేకపోయింది. ఇక చెక్అవుట్ సిస్టమ్ క్రాష్ అయిన కారణంగా ఆస్ట్రేలియాలోని సూపర్‌మార్కెట్‌లు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది వినియోగదారులు తమ కార్డు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసు వ్యవస్థ కూడా పనిచేయడం మానేసింది.