త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
నిర్దేశం, హైదరాబాద్ః
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సమావేశం కానున్నారని తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టాక 2024 జులైలో తొలిసారి ఇరువురూ భేటీ అయ్యారు.
అప్పట్లో ప్రజాభవన్ లో జరిగిన ఈ సమావేశంలో విభజన సమస్యలపై చర్చలు జరిపారు. విడిపోయి పదేళ్లయినా చట్ట ప్రకారం జరగాల్సిన పంపకాలు పూర్తి కాకపోవడంపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా పరిష్కృతం కాని సమస్యలపై తాజాగా మరోమారు భేటీ కావాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.