– మొదటిసారి పోటీలో కనిపించని రెడ్డీలు
– రేసులో మధుయాష్కి, మహేష్ కుమార్
నిర్దేశం, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఎంత బలమైందో, పీసీసీ అధ్యక్ష పదవి అంత బలమైంది. అలాగే ముఖ్యమంత్రి పదవికి ఎంత పోటీ ఉంటదో పీసీసీ చీఫ్ పదవికీ అంతే పోటీ ఉంటుంది. అందుకే, బలమైన నేతలు, బలమైన సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి పదవితో పాటు పీసీసీ కుర్చీపై దుప్పటి వేసి మరీ దక్కించుకుంటున్నారు. అయితే ఈసారి పీసీసీ కుర్చీ పోటీలో రెడ్లు, వెలమలు లాంటి సామాజిక వర్గాలు కనిపించడం లేదు. ప్రస్తుతం పోటీలో ఇద్దరు బీసీ నేతలు ఉన్నారు. చిత్రంగా ఆ ఇద్దరు కూడా గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్.. ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఇంతకు ముందు పోటీలో ఈ ఇద్దిరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, దళిత నాయకుడు సంపత్ కుమార్ ఉండేవారు. కొంత రన్నింగ్ అనంతరం, వీరికి అలుపొచ్చిందో, తప్పించారో తెలియదు కానీ.. మొత్తానకి ఔటయ్యారు. బహుశా.. తీసివేత పద్దతిలో అధ్యక్ష ఎంపిక జరుగుతున్నట్టుంది. అంటే, ఈ వ్యక్తి అధ్యక్షుడని ఎంపిక చేయకుడా, వీరు అర్హులు కాదంటూ ఒక్కొక్కర్ని తొలగిస్తున్నారు. చివరకు ఎవరు మిగులుతారో వారు అధ్యక్షులు అన్నమాట. చిన్న పిల్లల కుర్చీలాటలాగ భలే ఉందిగా.
ఎవరి అవకాశం ఎంత?
మధుయాష్కి గౌడ్: సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో విధేయులకు పదవులు దక్కుతుంటాయి. ఈ కోణంలో చూస్తే ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో మధుయాష్కి పార్టీకి నమ్మకమైన నేత. గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచి గాంధీ కుటుంబానికి దగ్గరగా మెలిగారు. అంతే కాకుండా 2007 నుంచి ఏఐసీసీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. విధేయతకే పట్టం కట్టాలనుకుంటే మధుయాష్కికే అవకాశం దక్కుతుంది.
మహేష్ కుమార్ గౌడ్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్.. రేవంత్ రెడ్డి తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతే కాకుండా బీసీ సంఘాలు నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రాహుల్ గాంధీ కొంత కాలంగా ఓబీసీ అంశాన్ని ప్రముఖంగా చెప్తున్నారు. రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలను తమవైపుకు తిప్పుకోవాలి అనుకుంటే మహేష్ కు అవకాశం దక్కుతుంది.