తమిళనాడు లక్ష్యంగా కమలం దళం

తమిళనాడే లక్ష్యంగా కమల దళం

చెన్నై, నిర్దేశం:
దక్షిణాదిలో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే తమిళనాడులో గత కొన్నిరోజులుగా పొలిటికల్ డ్రామాకు తెరతీస్తోంది. తమిళనాడులో పాతమిత్రుడితో కలిసి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. తమిళనాడులో ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే కాంగ్రెస్ సహా మిత్ర పక్షాలు కలిసి ఈసారి కూడా కూటమిగా బరిలోకి వెళ్ళాలని భావిస్తోంది. ఇక నటుడు విజయ్ సొంత పార్టీని ఏర్పాటు చేసి తాను ఒంటరిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ముందుగా ఏఐడీఎంకేతో కలిసి పోటీ చేసి అధికార భాగస్వామ్యంతో డిప్యూటీ సీఎంగా ఉండేలా ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి.. ఏపీలో టీడీపీ-జనసేన ఫార్ములా లోనే విజయ్ కూడా రాజకీయాల్లో తన ప్రయత్నాలను మొదలు పెడతారని జోరుగా చర్చ జరిగింది. అధికార DMKను గద్దెదించేందుకు పక్కా ప్రణాళికతో వెళ్తోంది. తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది.. అధికార డిఎంకె ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.. అందుకు గట్టి ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కలిసి వెళ్తేనే అది సాధ్యమని విశ్లేషకులు చెబుతుంటే.. విపక్షాల వ్యూహాలను డిఎంకె మాత్రం ఏ మాత్రం లెక్క చేయడంలేదు. బీజేపీ ఈసారి దక్షిణాన కొట్టి తీరాలన్న కసితో చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అలా బీజేపీ వేస్తున్న ఎత్తులకు డీఎంకే ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. జనంలో సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలకు ఎక్కడా అందడం లేదు.తమిళనాడులో పాగా వేయాలన్న ప్రయత్నాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యూహంతో ముందుకు వెళుతోంది. అయితే ఎక్కడో తేడాగా ఉందన్న చర్చ జరుగుతోంది. పొత్తు కోసం ఏఐడీఎంకే నుంచి దూరమైన అందరినీ కలిపేలా బీజేపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పొత్తులను సెట్ చేయడం.. మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళను కలిపి బీజేపీ చేస్తున్న కూటమి ప్రయత్నాలకు ఏఐడీఎంకే షరతులు పెడుతోంది. అలా పెట్టె షరతుల్లో కొన్ని విషయాల్లో తగ్గుతున్నా మరి కొన్ని అంశాల్లో బీజేపీ ఏమాత్రం తగ్గడం లేదు.తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏడీఎంకే సహా మరి కొన్ని పార్టీలను కలిపి కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఐదేళ్ల వరకు రాష్ట్రంలో డీఎంకేతో సమానంగా బలమైన పార్టీగా ఉన్న ఏఐడీఎంకేలో చీలికతో కాస్త బలహీన పడింది.

గతంలో జయలలిత జైలుకెళ్లిన సందర్భంలో నమ్మినబంటుగా ఉన్న ఓ పన్నీరు సెల్వం పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే జయలలిత నచ్చలి శశికళ కూడా పార్టీకి దూరమైంది. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పార్టీని లీడ్ చేస్తున్నారు. మునుపటిల పార్టీకి బాగుండాలంటే ఈ ముగ్గురు కలవాల్సిన అవసరం ఉందని భావించిన బీజేపీ అందర్నీ కలిపే ప్రయత్నం మొదలుపెట్టింది.ఇటీవల పొత్తుల విషయంపై చర్చించేందుకు ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి పలని స్వామి ఢిల్లీ వెళ్లి అమిత్ షా సహా పలువురు ముఖ్యనేతలను కలిశారు. అయితే ఆ సమయంలో బీజేపీకి ఏఐడీఎంకే తరఫున పళని స్వామి కొన్ని షరతలు పెట్టినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యమైనది తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్న అన్నమలైను ఆ బాధ్యతల నుంచి పక్కన పెట్టాలని విధించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల అన్నమలై పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఏఐడీఎంకే పార్టీలోకి పన్నీరు సెల్వం మళ్లీ తీసుకొచ్చే ప్రతిపాదనను కూడా ఆయన విభేదించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పొత్తుల విషయమై మాట్లాడేందుకు మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్-ఓపిఎస్ ఇద్దరికీ వేరువేరుగా మోదీ అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయింది. ఓపిఎస్‌కూ కూడా అపాయింట్‌మెంట్ దక్కడం పట్ల ఈపిఎస్ కినుక వహించినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధానిని కలిసి ఆలోచనను విరమించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రధాని షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు ప్రకటన వచ్చింది. ఎలాంటి రాజకీయ సమావేశాలు భేటీలు లేవని ఓపిఎస్ అపాయింట్‌మెంట్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది.ఇటీవల తమిళనాడు చీఫ్ పదవికి రాజీనామా చేసిన అన్నమలై కూడా ఒకంత అసంతృప్తితో ఉన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో అధ్యక్ష పదవి అనేది నాకు ఉల్లిపాయతో సమానం అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. ఓపిఎస్- టిటివి దినకర్, శశికళ పళని స్వామి అందరిని కలపాలని బీజేపీ ప్రయత్నాలకు ఈపీఎస్ సుముఖంగా లేరన్నది తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. వీటన్నింటిపై బ్యాక్ గ్రౌండ్‌లో అన్ని వర్క్‌వుట్ చేసుకున్నాక పొత్తులపై ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మోదీ పర్యటనలు షెడ్యూల్ మార్పులు చేసి పొలిటికల్ మీటింగ్స్ అన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అయ్యాక అన్ని పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »