మంత్రి కొండా సురేఖకు పిచ్చి పట్టిందా?

నిర్దేశం, హైదరాబాద్: ఆంధ్రా రాజకీయాలంటే అసహ్యించుకునేవారు చాలా మందే ఉంటారు. కారణం, అక్కడి రాజకీయాలు ఆడావారి శీలం చుట్టూ తిరుగుతాయి. ఇది ఇంతకు ముందు మాట. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే.. ఆంధ్రా రాజకీయ నాయకులు కూడా అసహ్యించుకునేంత నీచంగా ఉన్నాయి. ఈ మొత్తం రాజకీయాల్లో మంత్రి సురేఖ కెప్టెన్. తాజాగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలు చేసే వారికి కూడా చిరాకు తెప్పిస్తున్నాయి. మీడియాకు అయితే వార్తలో ఆమె మాటలు రాయలేకపోతున్నారు. రాజకీయ విమర్శ, ప్రతివిమర్శలు నడుస్తూనే ఉంటాయి. కానీ, తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ అంతటి నీచంగా మరెవరూ మాట్లాడలేదు.

పిచ్చి పట్టిందా?

రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్నారు కొండా సురేఖ. గతంలో కూడా మంత్రిగా పని చేశారు. అనేక పదవుల్లో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇన్నటికీ మించి ఒక మహిళ. మరి కొండా సురేఖకు ఏమైంది? పిచ్చి పట్టిందా? మతి భ్రమించిందా? చిప్ ఏమైనా మిస్ అయిందా? నిజాలైనా, అబద్ధాలైనా పబ్లిక్ లైఫులో ఉన్నప్పుడు నోరు అదుపులో ఉండాలి. కానీ సురేఖ మాటలు డ్రైనేజీ కంటే కూడా కంపు కొడుతున్నాయి. వాడెవడో సోషల్ మీడియాలో చేసిన చిన్న ట్రోల్ కు మరీ ఇంతలా దిగజారాలా? మంత్రి స్థాయి అన్నాక ఎన్నో విమర్శలు వస్తాయి, అందులో చిల్లర, చితకా కూడా ఉంటాయి. వాటికి అతిగా స్పందించి తన స్థాయిని తగ్గించుకున్నారు సురేఖ.

నాటి రాజకీయాలు ఇప్పుడు పని చేయవు

వరంగల్ రాజకీయాల్లో కొండా కుటుంబం రౌడీయిజం గురించి అందరికీ తెలిసిందే. నోటికొచ్చినట్టు వాగడం, చేతికొచ్చినట్టు కొట్టడం కొండా కుటుంబానికి కామన్. కొండా రాజకీయంపై అనేక విమర్శలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ల..కారలతో రాజకీయ నేతలను ఇష్టారీతిన కొండా సురేఖ తిట్టారు. అయితే ఈ రాజకీయాలు ఇప్పుడు పని చేయవు. ఒకప్పటి రాజకీయం ఇప్పుడు చేస్తామని కొండా సురేఖ అనుకుంటున్నారేమో? వాటికి ఇసుమంత కూడా తావు లేదు. ఏం మాటలు అవి? సురేఖ మాటలపై రియాక్ట్ అయ్యేందుకు ఎవరి నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు.

సురేఖను తొలగించకపోతే కాంగ్రెస్ పని అంతే

కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. వెంటనే క్రమశిక్షణా చర్యల కింద సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలి. వీలైతే పార్టీ నుంచి ఉద్వాసన పలికినా మంచిదే. లేదంటే, కాంగ్రెస్ పార్టీ పని అంతే. ఇప్పటికే పలు వివాదాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి.. సురేఖ కామెంట్స్ వల్ల నేరుగా ఐసీయూలో పడ్డట్టైంది. ఇప్పటికే ప్రత్యర్థుల రాజకీయ వలలో పడుతున్న కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే సురేఖను తొలగించడం వల్ల ఇలాంటి వివాదాలకు చాలా వరకు బ్రేక్ వేయొచ్చు.

నాగార్జున హుందాగానే స్పందించారు

మోయలేని నిందలు వేసినప్పటికీ నటుడు నాగార్జున హుందాగానే స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. సినీ ప్రముఖుల జీవితాలు రాజకీయ స్వార్థం కోసం వాడుకోవద్దని హెచ్చరించారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలని హితవు పలికారు. ‘‘బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’’ అని రాసుకొచ్చారు.

సురేఖలు రాకుండా చూడాలి

రాజకీయాల్లో బూతులు, ఆరోపణలు, చిల్లర విమర్శల వల్ల రాజకీయాల్లో ఇలాంటివి కామనే అనే అనుకుంటున్నారు చాలా మంది. నిజానికి, మిగతా అన్ని రంగాలతో పోలిస్తే రాజకీయ రంగంలోనే నోరు బాగా అదుపులో పెట్టుకోవాలి. నేరుగా ప్రజలతో మమేకమై, ప్రజల కోసమే ప్రత్యక్షంగా పని చేసే రంగం రాజకీయం. ప్రజల ప్రతి ఎమోషన్ లో రాజకీయం మిలితమై ఉంటుంది. రాజకీయ నాయకుల ప్రతి యాక్షన్, ప్రతి మాట ప్రజలను ప్రతిబించాలి. కానీ, నేల విడిచి సాము చేసినట్లు వ్యవహరిస్తున్నారు నేతలు. ఈరోజు జరిగింది చాలా తీవ్రమైంది. నోరు జారిన మాటను వెనక్కి తీసుకోలేం కానీ, రేపు మరింత మంది సురేఖలు రాకుండా జాగ్రత్త పడాలి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!