నిర్దేశం, న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయిన ఘనత జవహార్ లాల్ నెహ్రూ తర్వాత మోదీకే దక్కింది. ఇదిలా ఉంటే, మోదీ మంత్రి వర్గంలో భారతీయ జనతా పార్టీ నేతలకే కీలక పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పు ఇంకా పూర్తిగా జరగలేదు. కానీ, తెలంగాణ విషయంలో మంత్రులను ఫైనల్ చేశారు. ముందుగా ఊహించనట్టుగానే రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఒకరు ఇది వరకే ఉన్న కిషన్ రెడ్డిని మరోసారి మంత్రి వర్గంలోకి తీసుకోగా, ఈసారి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి అవకాశం కల్పించారు.
ఒక పదవి రెడ్డి, మరొక పదవి బీసీలకు ఇస్తారనే ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఎంపిక చేశారు. ఇక ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి వారికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. జంపింగ్ జలానీలను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టారని స్పష్టమవుతోంది. ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకే అవకాశం కల్పించారు. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.