Take a fresh look at your lifestyle.

సారు, కారు.. పరిస్థితి బేజారు

అదేంటో విచిత్రం.. కారు దిగుతున్న నేతలంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కమలం పార్టీవైపు కనుసైగనైనా చేయకపోవడం ఆసక్తికరం.

0 84

– కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్న గులాబీ ఎమ్మెల్యేలు
– సమావేశాలకు డుమ్మా కొట్టి సంకేతాలు
– నేతలను బుజ్జగించలేక తల పట్టుకున్న కేసీఆర్

నిర్దేశం, హైదరాబాద్: కారు దిగెదాక కారుమల్లయ్య.. కారు దిగినాక కాంగ్రెస్ మల్లయ్య అన్నట్లు ఉంది బీఆర్ఎస్ నేతల పరిస్థితి. ఎప్పుడెప్పుడు కండువా మార్చేద్దామా? ఎప్పుడెప్పుడు జెండా ఎత్తేద్దామా? అన్నట్లే కనిపిస్తున్నారు. కాసింత సందు దొరికిందా కనురెప్పపాటులో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ కే.కే, పోచారం, కడియం లాంటి సీనియర్లను ఆదర్శంగా తీసుకుంటున్నారు కాబోలు.. హస్తం పార్టీ వైపు క్యూ కడుతున్నారు. కారు దిగుతున్న నేతలను చూసి నోరు మెదలేకపోతున్నారు కేసీఆర్. ఫాం హౌజ్ కు రప్పించుకుని నచ్చజెప్పినా లెక్కనైనా చేయకుండా గెట్టు దాటుతున్నారు. గులాబీ జెండాను చూస్తే కేసీఆర్ గుండె తరుక్కుపోతోంది కాబోలు, ఫాంహౌజ్ దాటి అడుగు బయట పెట్టడం లేదు.

అందుకే డుమ్మా కొట్టారు
తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ఏవో పనుల వల్లనో వీరు డుమ్మా కొట్టలేదంట. పార్టీ మార్పుపై అటు అధికార పార్టీకి ఇటు సొంత పార్టీకి సంకేతాలు ఇచ్చేందుకే డుమ్మా కొట్టారట. గైర్హాజరైన ఎమ్మెల్యేల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు ఉన్న 47 మంది కార్పొరేటర్లకు గాను 30 మంది మాత్రమే హాజరయ్యారు.

బీజేపీలో ఎందుకు చేరడం లేదు?
అదేంటో విచిత్రం.. కారు దిగుతున్న నేతలంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కమలం పార్టీవైపు కనుసైగనైనా చేయకపోవడం ఆసక్తికరం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది లీడర్లు గతంలో కాంగ్రెస్ నేతలు కావడం ఒక కారణమైతే, జాతీయ రాజకీయాల్లో పోయి చేసేదేమీ లేదు. తమ పరిధిలో తమ రాజకీయాన్ని కాపాడుకుంటే చాలు అనుకోవడం రెండో కారణం.

టిట్ ఫర్ టాట్
బీఆర్ఎస్ పరిస్థితిని చూసి పార్టీ మారేవారు కొందరైతే.. కాంగ్రెస్ ఆకర్షణకు లొంగి పార్టీమారేవారు కొందరు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. ప్రతి స్పందనకు ప్రతిస్పందనలాగే గతంలో కేసీఆర్ చేసిన దానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిస్పందిస్తోందన్నమాట.

Leave A Reply

Your email address will not be published.

Breaking