Take a fresh look at your lifestyle.

రిజర్వేషన్లపై ఎందుకంత ఏడుపు?

కొన్ని కులాల దగ్గరే డబ్బు పోగైంది. భూములు వారి వద్దే ఉన్నాయి. గౌరవం కూడా ఆ కొన్ని కులాలకే ఉంది. నిజానికి కులమే ఇక్కడ మొదటి రిజర్వేషన్

0 288

నిర్దేశం, హైదరాబాద్: ‘అనగనగా రాగం తినతినగా రోగం’ అన్నట్లు ఉంది కొంత మంది తీరు. పెద్ద పెద్ద చదువులు చదువుతారే కానీ సమాజాన్ని కనీసం అర్థం చేసుకోకుండా ఏదేదో వాగుతుంటారు. మన దేశంలో ఇలా తరుచూ వినిపించే వాటిలో ‘రిజర్వేషన్’ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సమాజానికి నీతులు చెప్పే స్థాయిలో ఉండి కూడా, కనీస బాధ్యత లేకుండా మాట్లాడుతుంటారు. రిజర్వేషన్ల అంశంపై స్పందించేవారికి వాస్తవాలు తెలియవని కాదు, కానీ వాళ్ల మెదళ్లలో పేరుకుపోయిన అక్కసు అసందర్భంగా ఉబికి వస్తూ ఉంటుంది.

గగన్ ప్రతాప్ దుర్మార్గ వ్యాఖ్యలు
ఇక విషయంలోకి వస్తే.. గగన్ ప్రతాప్ అనే వ్యక్తి రిజర్వేషన్ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపివేస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ లో చదివి, సైంటిస్టుగా పేరు సంపాదించుకున్న గగన్ యూట్యూబ్ ద్వారా చాలా పాపులర్ అయ్యారు. తన యూట్యూబ్ ద్వారా లక్షల మందికి జ్ణానాన్ని అందిస్తున్న అతడు.. తాజాగా రిజర్వేషన్ మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే మీక్కూడా ఒళ్లు జలదరిస్తుంది. అక్కసుతో చేశాడా, పాపులారిటీ కోసం చేశాడా అనేది పక్కనపెడితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రం అతి కిరాతకంగా అవమానించాడు.

ఇంతకీ అతడు చేసిన కామెంట్స్ ఏంటంటే.. 2040లో పరీక్షల విధానం ఇలా ఉంటుందని ట్వీట్ చేశాడు. అందులో ‘‘OCలు అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. BCలు కొన్ని ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. SCలు పరీక్షకు హాజరైతే సరిపోతుంది. STలు పరీక్షకు అప్లై చేస్తే సరిపోతుంది. ప్రభుత్వాలను రిజర్వేషన్లను పెంచుతూ పోతే జరిగేది ఇదే’’ అని రాసుకొచ్చాడు. కులగణన తర్వాత జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్ల పెంపుపై బిహార్ ప్రభుత్వం వేసిన ముందడుగుపై గగన్ చేసిన వ్యాఖ్యలివి.

సరే.. గగన్ వ్యాఖ్యలపై నెటిజెన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. అలాగే అతడికి కొంత మంది నుంచి మద్దతు కూడా లభిస్తోంది. అది వేరే విషయం. కానీ రిజర్వేషన్ పరిస్థితిని, సమాజ పరిస్థితిని ఏమాత్రం ఆలోచించకుండా గగన్ లాగే చాలా మంది రిజర్వేషన్లపై విషయం కక్కుతూ ఉన్నారు.

రిజర్వేషన్ అంటే ఏంటి?
రిజర్వేషన్ ను గురించి మాట్లాడే ముందు భారతీయ సమాజం గురించి ఆలోచించాలి. ఇక్కడి సమాజం పూర్తిగా కులాల ప్రాతిపదికన ఏర్పడి, ఆ కులాల ద్వారా విపక్ష ఏర్పడింది. కొన్ని కులాల దగ్గరే డబ్బు పోగైంది. భూములు వారి వద్దే ఉన్నాయి. గౌరవం కూడా ఆ కొన్ని కులాలకే ఉంది. నిజానికి కులమే ఇక్కడ మొదటి రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ వల్లనే వందల ఏళ్ల నుంచి అత్యధిక జనాభా ఆర్థికంగా సామాజికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీన్ని నిర్మూలించేందుకు వెనుకబడిన వారికి చేయూతనిచ్చేందుకు రిజర్వేషన్ అనే అంశాన్ని రాజ్యాంగంలో పొందు పర్చారు.

రిజర్వేషన్ వల్ల ఏం జరిగింది?
విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయ పరమైన రిజర్వేషన్ వల్ల వెనుకబడిన కులాల వారు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడమే కాకుండా కొంత గౌరవాన్ని పెంచుకున్నారు. ఇదే సమయంలో వారిపై వివక్ష, దాడులు కొంత వరకు తగ్గాయి. కానీ సమాజంలో ఉన్న ఈ పోకడను రిజర్వేషన్ పూర్తిగా నిర్మూలించలేదు. ఇది పెయిన్ కిల్లర్ మాత్రమేనని రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ చెప్పారు.

రిజర్వేషన్ వల్ల నష్టం జరుగుతోందా?
రిజర్వేషన్ వల్ల భూమి-ఆకాశం బద్దలవుతోంది. ప్రపంచం తిరగడబుతోంది అని కొంత మంది ఏవేవో చెప్తుంటారు. రిజర్వేషన్ వల్ల ప్రతిభ చచ్చిపోతోందని అంటుంటారు. సామాజికంగా పేదరికంలో పుట్టినవారు డబ్బున్న, చదువుకున్న కుటుంబంలో పుట్టిన వారితో పోటీ పడి చదవాలని అనుకోవడం ఎంతటి మూర్ఖత్వం? ఎన్నో తరాలు మోసపోయిన సమాజానికి కొంత చేయూతనిస్తే, దానిపై అక్కసు ప్రదర్శించడం ఎంతటి అమానవీయం? అయినా దేశ జీడీపీలో రిజర్వేషన్ వాటా ఎంత? చిత్రంగా చాలా కాలంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వచ్చిన వారు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారు. ఒకవైపు దాన్ని అనుభవిస్తూనే ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లపై ఏడ్వటాన్ని ఏమనుకోవాలి?

ముగింపు
కచ్చితంగా రిజర్వేషన్లు లేని సమాజం కావాల్సిందే. సమాజంలో ఉన్న అందరిని సమానంగా చూడాల్సిందే. కానీ అలా చూడాలంటే అందరూ సమానంగా ఉండాలి. సమానంగా ఉండాలంటే ఇప్పుడున్న అసమానతలు తొలగాలి. అవి పోవాలంటే వంచించబడ్డ వారికి, అణగారిన వారికి చేయూత ఇవ్వాల్సిందే. రిజర్వేషన్లను ప్రభుత్వాలు సరిగా అమలు చేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశ జనాభాలో 90 శాతం వెనుకబడిన కులాల ప్రజలే. ఇన్నేళ్ల రిజర్వేషన్ల అనంతరం వారి వాటా అన్ని రంగాల్లో ఇప్పటికీ 5-20 శాతం మాత్రమే ఎందుకుందని ఆలోచించాలి. సమస్యను హృదయంతో అర్థం చేసుకుంటే అర్థమవుతుంద.. దగాపడ్డ సమాజానికి రిజర్వేషన్ అనేది బహుమానం కాదు, అతి చిన్న సాయమని.
– టోనీ బెక్కల్

Leave A Reply

Your email address will not be published.

Breaking