– ఓటమి తర్వాత పొత్తుల కోణంలో జగన్ ఆలోచనలు
– కాంగ్రెస్ తో పొత్తు కోసమేనా బెంగళూరు పర్యటన?
– పార్టీ విలీనం చేయనున్నారంటూ పుకార్లు
నిర్దేశం, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత ఎన్నికల్లో ఒంటరిపోరు పని చేయదని, పొత్తులతోనే ఎన్నికల్లోకి దిగాలని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీని పొత్తుకు ప్రధానంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలవడానికి బెంగళూరు వెళ్తున్నట్లు సమాచారం. అయితే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.
పొత్తుకు కారణం
విపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలు చేతులు కలపడమే కాకుండా భారతీయ జనతా పార్టీని తమ కూటమిలోకి తీసుకున్నాయి. ఈ కలయికే జగన్ పార్టీకి చాలా దెబ్బ పడింది. 40 శాతం ఓట్లు సాధించినప్పటికీ, అవి సీట్లుగా మారలేదు. స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల ఐక్యత వల్ల జరిగే లాభనష్టాలను చూసిన జగన్.. రాబోయే ఎన్నికల్లో పొత్తుల కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్తున్నారు.
బెంగళూరు పర్యటన
దాదాపు పదేళ్ల తర్వాత బెంగళూరుకు జగన్ వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ‘‘అసలు ఆట ఇప్పుడు మొదలైంది.. ఎవరూ ఊహించని పరిణామాలు చూస్తారు’’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో రాజీ కుదుర్చోవడానికే బెంగళూరుకి జగన్ వెళ్లినట్లు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చలు చేసి, కాంగ్రెస్ తో దోస్తీ చేసే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారట.
పార్టీ విలీనం అంటూ పుకార్లు
నిజానికి జగన్ ఇప్పటికే డీకే శివకుమార్ తో చర్చలు జరిపారని, తొందరలోనే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని బీజేపీ ఎమ్మెల్సీ నల్లిమల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మరికొంత విపక్ష పార్టీల నేతల కూడా నుంచి కూడా ఇదే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడమనేది ఊహాజనితమే కానీ, రాజకీయాల్లో ఏమైనా జరుగొచ్చని చాలా ఉదహారణలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.