– హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసిన బీజేపీ
– ఎంఐఎంతో దోస్తీతో కాంగ్రెస్ పార్టీకి అనేక విమర్శలు
– సెక్యూలర్ రాజకీయ బలహీనతను రేవంత్ అధిగమిస్తారా?
నిర్దేశం, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్ ను చాలా మంది ‘హైడ్రా’బాద్ అంటున్నారు. కారణం.. కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాల వరుస కూల్చివేతలు జరుగుతుండడం. ఇదేమీ కొత్త కాదు కానీ, కూల్చివేతల్లో భాగంగా స్టార్ సెలెబ్రిటీ ఎంతో ప్రేమతో నిర్మించుకున్న ఫంక్షన్ హాల్ నేలమట్టం చేయడంతో హైడ్రాకు హైప్ పెరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చర్చ హీటెక్కింది. అంతే కదా మరి.. మామూలు జనాల ఇళ్లపైకి బుల్డోజర్ వెళ్లడం కొత్తేమీ కాదు. అదే బుల్డోజర్ వందల కోట్లు ఉన్న వాడి ఇంటి మీదకు వెళ్లడమే విశేషం.
బీజేపీ బటన్ బాగానే పని చేసింది
ఏమైతేనేమి.. ఎవరి నిర్మాణాలనూ వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి బల్లలు గుద్దీ మరీ చెప్తున్నారు. కూల్చివేతలపై కస్సు బుస్సు అంటూనే అవి కూల్చరా, ఇవి కూల్చరా అంటూ లిస్ట్ పంపిస్తున్నాయి విపక్షాలు. ఇంతలో హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసింది బీజేపీ. బండ్లగూడలోని సకలం చెరువు పరిధిలో ఓవైసీ కుటుంబం నిర్మించిన ఫాతిమా కళాశాల భవనం ఎప్పుడు కూలుస్తారని నిలదీసింది. బీజేపీ అలా డిమాండ్ చేసిందో లేదో ఇలా ఫాతిమా కాలేజీకి నోటీసులు వెళ్లాయి. ఈ ఇద్దరి కంటే ఫాస్ట్ గా అక్బరుద్దీన్ స్పందిస్తూ.. తనను కాల్చి చంపినా ఓకే కానీ, పేద విద్యార్థుల భవనం కూల్చొద్దని అన్నారు.
గురి ఎంఐఎం.. దెబ్బ కాంగ్రెస్ కు
బహుశా.. బీజేపీ ఎక్కుపెట్టిన ఈ గురి ఎంఐఎం కంటే ఎక్కువగా కాంగ్రెస్ తగిలినట్లు కనిపిస్తోంది. ఎంఐఎంతో ఎక్కువ కాలం దోస్తీ చేసిన కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు ఉన్నాయి. పాతబస్తీలో ఏమాత్రం అభివృద్ధి జరక్కపోవడం ఎంఐఎంతో లాలూచీనేనని, అలాగే ముస్లిం ఓట్లకు భయపడి ఎంఐఎంను కానీ, ఇతర ముస్లింల తప్పిదాలను కానీ పట్టించుకోరని చాలా పెద్ద పెద్ద విమర్శలే ఉన్నాయి. తాజాగా ఈ విషయం మరోసారి పైకి లేచింది. ఒకవేళ హైడ్రా కనుక ఫాతిమా కాలేజీ మీద చర్యలు తీసుకోకపోతే.. రేవంత్ రెడ్డి కూడా మిగతా కాంగ్రెస్ నేతల మాదిరేనని తేలిపోతుంది.
బుజ్జగింపు సెక్యూలర్ రాజకీయాలు
సెక్యూలర్లమని చెప్పుకునే చాలా పార్టీలు అన్ని వర్గాలతో ఒకే రకంగా వ్యవహరించడం లేదు. ముస్లింలతో బుజ్జగింపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. అలా అని ముస్లింలకేదో చేశారంటే అదీ లేదు. పాతబస్తినే చూసుకుంటే.. 75 ఏళ్ల రాజకీయంలో సాధించింది ఏమంటే, చెప్పనీకి ఏమీ లేదు. నేటికీ అక్కడ అమ్మాయిల్ని గల్ఫ్ కు అమ్మేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా అని ఇప్పటికిప్పుడు వెళ్లి పాతబస్తీలో కొత్త సెంటు కొట్టడం అంత వీజీ కాదు కానీ, అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ తోలే ధైర్యం చేసినా తొలి అడుగు పడుతుంది.