నిర్దేశం, హైదరాబాద్ః బీజేపీలో అనంత్ కుమార్ హెగ్డే, కాంగ్రెస్ లో సుప్రియా శ్రీనాథె, వైసీపీలో కొడాలి నాని, శివసేనలో సంజయ్ రౌత్. దేశ రాజకీయాల్లో ఈ పర్సనాలిటీలు చాలా ఫేమస్. వీరు నోరు తెరిస్తే చాలు.. దేశ రాజకీయాలు వీరి చుట్టూనే తిరుగుతాయి. వీరి మాటల్ని వివాదాస్పదం అంటారు కానీ, అంతకు మించి జుగుప్సాకరం అనడం సమంజసం. ఎందుకంటే అప్పుడప్పుడు నోరుజారి వివాదాస్పంగా మట్లాడుతుంటారు. తరుచూ కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. వాటి ఉద్దేశం ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడం. అయితే ఇలాంటి వివాదాల కోసం పక్క రాష్ట్రాల వైపు తొంగి చూసే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆ అసవరం లేదు. మంత్రి కొండా సురేఖ పుణ్యమా అని తెలంగాణ వైపే మిగతా రాష్ట్రాల వారు చూస్తున్నారు. కొండా పెడుతున్న రాజకీయ చిచ్చు చూస్తుంటే అదేదో అనుకోకుండా జరిగినట్లు కనిపించడం లేదు. కావాలనే ఆమె రచ్చ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక కాంగ్రెస్ పెద్ద వ్యూహమే ఉన్నట్లు అనుమానం కూడా కలుగుతోంది.
అటెన్షన్ డైవర్షన్ రాజకీయ ఎత్తుగడ
ప్రజల అటెన్షన్ డైవర్షన్ అనేది పెద్ద రాజకీయ ఎత్తుగడ. ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు దాపురిస్తే.. ఆ పరిస్థితుల నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం అనివార్యం అవుతుంది. లేదంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ హయాంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరత పనులు సాఫీగా సాగిపోయాయి. వీటిపై ప్రతిపక్షాలు పెద్దగా హడావుడి చేసింది లేదు. కారణం, ఆ సమయంలో ప్రతిపక్షాలు ఉస్మానియా ఆసుపత్రి, సెక్రెటేరియట్ కూల్చకుండా ఆపే పనిలో బిజీగా ఉన్నారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా వాటిని కూలుస్తామని అన్నారు. అంతే, విపక్షాలు అన్ని పనులు మానుకుని వెళ్లి ఉస్మానియా వద్ద కూర్చున్నాయి. ప్రభుత్వం అనుకున్న పనులను సాఫీగా చేసుకుపోయింది. మోదీ ప్రభుత్వం ఇలాగే చేస్తుంటుంది. దేశంలో నిరుద్యోగం, పేదరికం లాంటివి విలయతాండవం ఆడుతున్నాయి. వాటిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిని డైవర్ట్ చేసేందుకు వారికి హిందూ-ముస్లిం వ్యవహారం భలేగా ఉపయోగపడుతూ ఉంటుంది.
హైడ్రా వ్యతిరేతను డైవర్ట్ చేసేందుకే?
కొండా సురేఖ చేసిన కామెంట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. బహుశా.. ఆమె మాటలు పరిశీలిస్తే ఆమె అతికి మించి రెస్పాండ్ అయ్యారనిపిస్తుంది. విపక్షాలతో పేచీ సాధారణం. కానీ, వారిని విమర్శించే క్రమంలో సంబంధంలేని వారిని, అందునా సొసైటీలో పేరు పొందిన వారిని మధ్యలోకి లాగడం ఆశ్చర్యకరం. ఆమె నోరు జారిందంటే పొరపాటే.. ఎందుకంటే, నోరు జారితే ఆమె వెంటనే సర్ది చెప్పుకునే వారు. ఆమె సర్ది చెప్పిన తీరు కూడా గమ్మత్తుగానే ఉంటుంది. నాగార్జున కుటుంబాన్ని రోడ్డుకు లాగి, సమంతకు సారీ చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సవరణ. బహుశా.. కాంట్రవర్సీకి పొమ్మని చెప్పి ఉంటారు. కానీ కొండా ఏకంగా దుమారమే లేపి కూర్చున్నారు. సరిగ్గా హైడ్రాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న సందర్భం అది. ఇక దీని అనంతరం జరిగిన పరిణామాలు చూస్తుంటే.. కొండా స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా చేస్తున్న అనుమానం కలుగుతుంది.
ఇలాంటి వివాదాలకు కింది స్థాయి నేతలు
సాధారణంగా వివాదాస్పద కామెంట్స్ చేయడానికి ప్రతి పార్టీలో పేరెన్నికైన లీడర్లు ఉంటారు. ప్రభుత్వం లేదంటే పార్టీ అవసరాల దృష్ట్రా వీరు బయటికి వచ్చి బాంబ్ పేలుస్తారు. ఇది సరిగానే పేలితే అగ్ర నాయకులు వత్తాసు పలుకుతారు, మిస్ ఫైర్ అయితే వాటికి మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారు. వీరి డ్యూటీ అదే కాబట్టి.. ఏం మాట్లాడినా, ఎంత రచ్చ చేసినా క్రమశిక్షణా చర్యలు వంటివి వీరిపై ఉండవు. అయితే ఇలాంటి వారికి కొండా సురేఖకు తేడా ఉంది. నాగార్జున వ్యవహారం తర్వాత వివాదాలకు ఆమెనే స్వయంగా కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. సొంత పార్టీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డితో ఘర్షణ ఇందుకు ఉదాహరణ. కాంట్రవర్సీ బయట ఉంటే పర్లేదు కానీ, లోపలికి వస్తే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే. అయితే, కొండా సురేఖపై తదుపరి రోజుల్లో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందనేది తేలాలి.