6 సార్లు మారిన జాతీయ జెండా.. ఆ పాత 5 జెండాలు ఎలా ఉండేవో తెలుసా?

నిర్దేశం, హైదరాబాద్: ఏ దేశస్తులకైనా జాతీయ జెండా అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. తమ గౌరవాన్ని, ఐక్యతను జాతీయ పతాకం ద్వారా తెలియజేస్తుంటారు. మనకు కూడా స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. దేశమంతా మూడు రంగులే కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి తిరంగా (హర్ ఘర్ తిరంగా) అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునివ్వడంతో.. ఈ ఉత్సాహం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంతో పాటు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన దేశం మొత్తం మువ్వెన్నల జెండాకు వందనం చేస్తుంది. అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ జెండా రావడం వరకు పెద్ద చరిత్రే ఉంది. దీనికి ముందు ఐదు జెండాలను మన జాతీయ జెండాలుగా ప్రతిపాదించారు. అవేంటో తెలుసుకుందాం.

భారతదేశం అధికారిక జెండాను 1906 సంవత్సరంలో కోల్‌కతాలో మొదటిసారిగా ఎగురవేశారు. 1906లో భారతదేశానికి లభించిన జెండా నేటి జెండాకు పూర్తి భిన్నంగా ఉంటుంద. ఆ జెండాలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు మూడు రంగులు సహా.. తామరపువ్వు, చంద్రుడు, సూర్యుడు గుర్తులను పెట్టారు.

ఒక సంవత్సరం అనంతరం, అంటే 1907లో రెండవసారి జాతీయ జెండా రూపు మారింది. దీనిని మేడమ్ భికాజీ కామా కొంతమంది విప్లవ మిత్రులతో కలిసి పారిస్‌లో ఎగురవేశారు. ఈ జెండాలో ఎరుపు రంగుకు బదులు కుంకుమ రంగు, ఎనిమిది తామరపువ్వులకు బదులు ఎనిమిది నక్షత్రాలను చేర్చారు.

ఇక 1917 సంవత్సరంలో లోకమాన్య తిలక్‌తో కలిసి అనీబిసెంట్ మరోసారి కొత్తరూపుతో జెండాను ఎగురవేశారు ఈ జెండా చాలా భిన్నంగా ఉండేది. ఈ జెండాలో ఐదు ఎరుపు చారలు, నాలుగు ఆకుపచ్చ చారలు ఉండేవి. ఎడమ వైపున యూనియన్ జాక్ సహా.. చంద్రుడు, నక్షత్రాలను పొందుపర్చారు.

నాల్గవసారి 1921లో మళ్లీ భారత జెండాలో మార్పు వచ్చింది. విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో ఈ జెండాను మహాత్మాగాంధీకి అందించారు. ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఏర్పాటు చేసిన ఈ జెండాలో స్పిన్నింగ్ వీల్ జోడించారు.

ఆ తర్వాత 1931 సంవత్సరంలో భారతదేశ జెండా మరోసారి మారిపోయింది. ఈ జెండా ఈనాటి జెండాను పోలి ఉంటుంది. ఈ జెండా పైభాగంలో కుంకుమపువ్వు రంగు చార, మధ్యలో తెలుపు, చివరిలో ఆకుపచ్చ ఉంటుంది. మధ్యలో తెల్లటి వర్ణంలో రాట్నం ఉంది. దీనిని భారత కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించింది.

ఇక భారతదేశ జెండా చివరిసారిగా జూలై 1947లో మార్చారు. అప్పుడు రూపొందించిన జెండానే నేటికీ వాడుకలో ఉంది. ఈ జెండాలో పైభాగంలో కాషాయం రంగు, మధ్యలో తెలుపు, దిగువన ఆకు పచ్చ రంగు జత చేరింది. మధ్యలో చరఖా స్థానంలో అశోక చక్రం చేర్చారు. ఈ జెండాను మన తెలుగువాడు పింగళి వెంకయ్య రూపొందించారు. జెండాలో ఉన్న మూడు రంగుల్లో కాషాయం శక్తికి, ధైర్యానికి ప్రతీక అయితే తెలుపు శాంతికి సత్యానికి గుర్తు. ఇక ఆకుపచ్చ రంగు ప్రగతి, పవిత్రతకు చిహ్నం. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి నిదర్శనం.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!