– వచ్చే ఏడాది ప్రారంభం కానున్న జనగణన
– 2026 ప్రారంభం నాటికి ఫలితాలు
– ఈసారి 31 ప్రశ్నలు అడిగే ఛాన్స్
– దీనితో పాటే కులగణన చేయాలని డిమాండ్
నిర్దేశం, న్యూఢిల్లీ: 2021లో దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన కోవిడ్ వల్ల వాయిదా పడింది. అనంతరం.. వివిధ కారణాల వల్ల మరో మూడేళ్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనితో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్ను అప్డేట్ చేసే ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలవనున్న ఈ ప్రక్రియ 2026 వరకు జరగనుంది. 2026 చివర్లో జనగణనకు సంబంధించిన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే వచ్చే ఏడాది జరిగే జనగణనతో భవిష్యత్ సెన్సస్ సైకిల్స్ మారే అవకాశం ఉంది. అంటే ఈ జనగణన 2025-2035 కాలానికే చేపడితే, వచ్చేసారి 2035-2045 కాలానికి లెక్కిస్తారు.
జనగణనకు 31 ప్రశ్నలు
జనగణనకు సంబంధించి ప్రజలను 31 ప్రశ్నలను అడగనున్నారు. ఒక కుటుంబానికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్, సైకిల్, స్కూటర్ లేదా మోటార్ సైకిల్ లేదా మోపెడ్ ఉన్నాయా, వారికి కారు, జీపు లేదా వ్యాన్ ఉందా అనే ప్రశ్నలు ఉంటాయి. ఇంట్లో వారు వినియోగించే తృణధాన్యాలు, తాగునీటి ప్రధాన వనరు, ప్రధాన లైటింగ్ వనరు, మరుగుదొడ్డి సౌకర్యం, మరుగుదొడ్డి రకం, వ్యర్థ నీటి అవుట్ లెట్ లభ్యత, స్నాన సదుపాయం లభ్యత, వంటగది, ఎల్పీజీ/పీఎన్జీ కనెక్షన్ లభ్యత, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం, రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ లభ్యతను కూడా పౌరులను అడుగుతారు. ఇంటి అంతస్తు, గోడ, పైకప్పు ప్రధాన సామాగ్రి, ఇంటి పరిస్థితి, సాధారణంగా ఇంట్లో నివసిస్తున్న వారి సంఖ్య, ఇంటి పెద్ద మహిళా, ఇంటి పెద్ద షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినవారా, ఇంటి ఆధీనంలో ఉన్న నివాస గదుల సంఖ్య గురించి పౌరులను అడుగుతారు. ఇంటిలో నివసిస్తున్న వివాహిత జంట(లు) సంఖ్యను కూడా అఢిగే అవకాశం ఉంది.
కులగణనకు విపక్షాల పట్టు
ఇక జనగణనతో పాటే కులగణన చేయాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈసారి జరగనున్న జనాభా లెక్కల్లో కులగణన ఉంటుందా లేదా, లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు ఈ లెక్కలు ఉపయోగిస్తారా లేదా అని అంశాలపై కాంగ్రెస్ స్పష్టత కోరింది. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రానికి సోమవారం సూచించింది. ఈ కొత్త సెన్సస్‌లో 1951 నుంచి ప్రతి సెన్సస్‌లో అడుగుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతోపాటు దేశంలోని అన్ని కులాల వివరణాత్మక గణన కూడా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, అలాంటి కులగణన చేపట్టడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కులగణనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. తదుపరి జనాభా గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
జనాభా లెక్కింపు తర్వాత పార్లమెంట్ నియోజవకర్గాల పునర్ విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు సీట్లను కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా నియంత్రలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్ విభజిస్తే, అప్పుడు ఆర్టికల్ 82కు సవరణ చేపట్టాల్సి ఉంటుంది. 2026 తరువాత జరిగిన మొదటి జనాభా లెక్కల సంబంధిత గణాంకాలు ప్రచురించబడే వరకు, అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు జరగదు.
2011 జనాభా లెక్కల అంశాలు
భారతదేశ జనాభా గణన ప్రతి దశాబ్దానికి నమోదవుతుంది. మొదటిది 1872లో జరిగింది. స్వాతంత్య్రం తరువాత మొదటి జనాభా గణన 1951లో జరగ్గా, చివరిది 2011లో జరిగింది. 2011 డేటా ప్రకారం, దేశం మొత్తం జనాభా 121 కోట్లు, లింగ నిష్పత్తి 1,000 పురుషులకు 940 స్త్రీలు, అక్షరాస్యత రేటు 74.04 శాతం, 2001 నుండి 2011 వరకు జనాభా పెరుగుదల 17.64 శాతం ఉంది. జనాభాలో మొత్తం 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ దాదాపు 20 కోట్ల జనాభాతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా నమోదైంది. 64,429 జనాభాతో అతి తక్కువ జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ నమోదైంది. రాజస్థాన్ 3,42,239 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం కాగా, గోవా 3,702 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి చిన్న రాష్ట్రంగా నమోదైంది.