నిర్దేశం, షిమ్లా: ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే ఏం చేస్తారు? సహజంగా పన్నులు పెంచుతారు, ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారు, అప్పులు తెస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూటే సపరేటు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ప్రాణాంతకమైన గంజాయి సాగుకు దిగింది. నిజానికి గంజాయి పండించినా, రవాణా చేసినా, వినియోగించినా పోలీసులు పట్టుకుని పుంగి భజాయిస్తరు. కానీ, కాంగ్రెస్ సర్కార్ పుణ్యాన హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు ఎవరైనా గంజాయి పండించవచ్చు. అందుకోసం ఏకంగా చట్టం చేసింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. దీనికి ప్రతిపక్ష బీజేపీ సపోర్ట్ కూడా ఉందండోయ్.
గంజాయి సాగును చట్టబద్ధం చేసే నిర్ణయానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు ప్రతిపక్షాల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ వచ్చింది. అసలు వ్యతిరేకించినవారే లేరు. రాష్ట్రంలోని ఔషధ, పారిశ్రామిక ప్రయోజనాల కోసం గంజాయిని సాగు చేయాలని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది. ఆ కమిటీ సిఫారసుల మేరకే రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేసే తీర్మానాన్ని పెట్టినట్లు ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు గంజాయి సాగు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
హిమాచల్ ప్రదేశ్ అనగానే టూరిజం గుర్తుకు వస్తుంది. ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు. అలాగే వ్యవసాయం లాంటివి కూడా బాగానే ఉన్నాయి. వీటితో చాలా ఏళ్లుగా బండి నెట్టుకుంటూ వస్తున్న హిమాచల్ ప్రదేశ్ కు ఉన్నట్టుండి ఆర్థిక కష్టాలు ఎందుకు వచ్చాయి? ఇది పూర్తిగా నాయకుల తప్పిదమే. పైగా, ఈ తప్పిదాన్ని సరిదిద్దడానికి బదులు.. ప్రభుత్వమే గంజాయి సాగుకు దిగడమేంటి? ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ఇంతటి దుర్మార్గానికి దిగాల్సిన అవసరం ఏంటి? కేంద్రంలో ఉన్న బీజేపీనే హిమాచల్ లో ప్రతిపక్షం. మొన్నటి వరకు అధికారంలో కూడా ఉంది. ఢిల్లీలో గల్లాలు పట్టుకుని కొట్టుకునే ఈ పార్టీలు.. గంజాయి సాగు కోసం చేతులు కలిపాయి. అధికార కుర్చీ కోసం కొట్లాటే కానీ, పాలనలో, దుర్మార్గంలో రెండూ ఒకటేనని తేలిపోయాయి.
దేశాన్ని ఏలిన, ఏలుతున్న ఈ రెండు పార్టీలు వికృతంగా వ్యవహరిస్తున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఔషదాల తయారీలో గంజాయిని వినియోగిస్తారు. అయితే అదే సాకుగా చూపి నియంత్రిత సాగు అనే పేరు పెట్టీ సాగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయం అధికారం రాజ్యాంగాన్ని యదేచ్చగా నిర్వీర్యం చేస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ వేరు కాదు.