– పరమశివుడి ముగింపు ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాట
– మరింత పెరగనున్న మృతుల సంఖ్య
– ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సీఎం యోగి
నిర్దేశం, లఖ్ నవూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్‌లోని రతీభాన్‌పూర్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 120 మంది భక్తులు మరణించారు. ఇందులో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇక గాయపడ్డ వారి సంఖ్య వందల్లోనే ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఇటావా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రతీభాన్‌పూర్‌లో పరమశివుడికి ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగానే తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇటావా జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ స్పందిస్తూ.. ‘‘హత్రాస్ జిల్లాలోని రతీభాన్‌పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాలు జరిగాయి. వీటికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 120 మంది భక్తులు మృతి చెందారు’’ అని అన్నారు.
ఈ సంఘటనపై యూపీ ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం అధికారిక X హ్యాండిల్ స్పందిస్తూ.. ‘‘హత్రాస్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి తగు వైద్యం అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా పాలనాధికారిని ఆదేశించారు. ఏడీజీ ఆగ్రా, కమీషనర్ అలీఘర్ నేతృత్వంలో ఘటనకు గల కారణాలను పరిశోధించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు’’ అని పోస్ట్ చేశారు.
నిబంధనలు ఏం చెప్తున్నాయి?
ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా నిర్వహించినట్లయితే, దాని మొత్తం బాధ్యత కార్యక్రమ నిర్వాహకులు, శాంతిభద్రతల నిర్వాహకుల(పోలీసులు)పై ఉంటుంది. భద్రతా లోపం జరిగితే నిర్వాహకులతో పాటు పాలకవర్గం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, ఇంత పెద్ద కార్యక్రమానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ సత్సంగానికి నిర్వాహకులు ఎవరు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది.