నిర్దేశం: ముఖ్యమైన పనుల్లో బిజీ అయినప్పుడో, మొబైల్‌లో నెట్‌వర్క్ లేదా ఇతర సమస్య ఉన్నప్పుడు ఫ్లైట్ మోడ్‌ను ఆన్‌లో ఉంచుతాము. అయితే ఫ్లైట్‌లో ప్రయాణించే వారు ఫ్లైట్ మోడ్‌ని ఆన్ చేస్తారా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విమానంలో ఫ్లైట్ మోడ్‌ని ఆన్ చేయడం అవసరమా?
ఇలాంటి ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉంటాయి. ఈ రోజు మనం దాని గురించి మీకు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సాంకేతికతంగా చాలా ముందుకు వెళ్లాం. కానీ నేటికీ అదే 60 ఏళ్ల రేడియో సిస్టమ్ విమానాలలో వాడుకలో ఉంది. మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే, మీ అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాల్సిందే.
అలా చేయకపోతే శిక్షార్హులే
ప్రయాణీకులు ఈ నిబంధనలను పాటించడానికి నిరాకరించి, ఫోన్‌ను ఉపయోగించినా, ఈ క్యాబిన్ క్రూ నిబంధనలను పాటించకపోయినా విమానయాన సంస్థలు మీపై కఠినమైన చర్యలకు దిగుతాయి. కొన్ని సందర్భాల్లో విమానం నుంచి దించేస్తారు కూడా. ఇది భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. మీరు ఎగిరే విమానంలో ఫోన్‌ని ఉపయోగించినట్లైతే మిమ్మల్ని పోలీసులకు అప్పగించవచ్చు.
ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకపోతే ఏమవతుంది?
ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సిగ్నల్స్ విడుదలవుతాయి. ఇవి ఫ్లైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. సెల్యులార్ కనెక్షన్లు కలిగిన పరికరాలు రేడియో తరంగాలతో పాటు విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో విమానానికి సిగ్నల్ అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల, విమానయాన సంస్థలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేసి, ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలని కోరుతాయి. భారతదేశంలోని డీజీసీఏ వంటి అనేక దేశాల ఏవియేషన్ ఏజెన్సీలు ప్రయాణీకులను తమ పరికరాలను ఫ్లైట్ మోడ్‌లో ఉంచమని చెప్తాయి.
ఈ రూల్ ఎప్పుడు వచ్చింది?
1990వ దశకంలో మొబైల్ ఫోన్‌ల నుండి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీలు ఫ్లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లను ప్రభావితం చేయగలవని ఎయిర్‌లైన్స్ గుర్తించాయని చాలా నివేదికలు పేర్కొన్నాయి. ఆ తర్వాత అలాంటి నిబంధనలను రూపొందించడం ప్రారంభించారు. 1996 సంవత్సరంలో మొదటిసారిగా అమెరికాలో ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయాలనే నియమాన్ని రూపొందించారు.