చట్టానికి అందరూ సమానమే..?
– నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ వస్తే..
– వరవరరావు కు బెయిల్ ఇస్తే ఇద్దరి మధ్య ఎంత తేడానో..
చట్టానికి అందరూ సమానమే.. ఇది వినడానికి బాగుంది. ఆచరణలో అది సాధ్యం కాదు. తప్పు చేసినోళ్లను అరెస్టు చేసి జైలుకు పంపిస్తే వాళ్లు ఊచలు లెక్కించాల్సిందే. కానీ, అరెస్ట్ అయినోళ్ల స్టేటాస్ తోనే న్యాయం జరుగుతుందనడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, విరసం నేత వరవరరావుల కేసులలో కోర్టులు వ్యవహరించిన తీరు ఉదాహరణగా పేర్కొనచ్చు.
పొద్దున మధ్యంతర బెయిల్.. సాయంత్రం విడుదల
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నుంచి హంగామా చేశారు. ఢిల్లీ నుంచి అడ్వోకెట్లు ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వచ్చారు. అయినా.. ఆలస్యంగానైనా మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు బయటకు వచ్చారు.
కారణం..? కాటరాక్ట్ సర్జరీ పేరుతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. విచారణలో ఉన్న వ్యక్తికి కాటరాక్ట్ శస్త్ర చికిత్స అవసరం అని వైద్య పరీక్షలు చెపుతాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, విరసం నేత వరవరరావులకు న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర బెయిల్ విషయంలో ఎంతో తేడా ఉంది. వరవరరావుకు మధ్యంతర బెయిల్ కోసం ఎన్ని అడ్డంకులో..
కాటరాక్ట్ సర్జరీ చేయించుకోవడానికి తనకు అనుమతించమని విరసం నేత వరవరరావు సెప్టెంబర్ 2022లో మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టును అడుగుతారు. ఆ కోర్టు కొట్టి వేస్తుంది. హైకోర్టుకు అప్పీలుకు వెళతారు. అక్కడ ఎనిమిది నెలలు విచారణ జరిపిన సింగిల్ జడ్జి “నాకు అధికారం లేదు, డబుల్ బెంచికి వెళ్లండి” అంటారు. ఆ డబుల్ బెంచి మరొక నాలుగు నెలలు విచారించి, 2023 అక్టోబర్ చివరిలో అనుమతి ఇస్తుంది. అనుమతి ఇస్తున్నామని నిండు కోర్టులో ప్రకటించిన పది రోజుల తర్వాత కూడా ఆ ఉత్తర్వు ప్రతి ఇవ్వకుండా తాత్సారం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నాడు. అతనికి కూడా కాటరాక్ట్ సర్జరీ అవసరమని వైద్యులు చెబుతారు. అతని తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అనుమతి ఇస్తున్నామని ఉదయం 11కు ప్రకటిస్తే, వెంటనే ఉత్తర్వులు తయారై, మధ్యాహ్నం 4 కల్లా ఆ చంద్రబాబు నాయుడు జైలు నుంచి బైటికే వచ్చారు.
అందరి కాటరాక్టు శస్త్రచికిత్సలూ ఒకటే సర్జరీ కూడా సేమ్..
“చట్టం ముందు అందరూ సమానులు” కానే కాదు!!! అనడానికి ఇదో ఉదాహరణ. – యాటకర్ల మల్లేష్