డీ ఎస్ జీవిత ప్రస్థానం
- కో ఆపరేటివ్ ఉద్యోగి నుంచి పీసీసీ చీఫ్ వరకు
- వ్యూహత్మకంగా వెళ్లారు.. సక్సెస్ అయ్యారు..
- వృద్దాప్యంలో బీఆర్ ఎస్ లో చేరి తప్పు చేశానని బాధ పడ్డారు..
- వైఎస్ సీఎం పదవి వెనుక డీఎస్ కష్టం..
- కోరిక తీరకుండానే కన్ను మూసిన డీఎస్..
- డీఎస్ వారసులుగా కొడుకులు
డీఎస్.. ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను శాసించడానికి రాజకీయ వ్యూహలే కారణం.. విద్యార్థి దశలోనే ఎన్ ఎస్ యుఐలో క్రీయశీల పాత్ర పోషించిన డీ.శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదిగారు. 1980 దశకంలో రాష్ట్ర రాజకీయాలలో క్రీయశీల పాత్ర పోషించిన, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అర్గుల్ రాజారాం కావడం కూడా కలిసి వచ్చిన ఆంశం.
కో- ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగిగా..
డీ. శ్రీనివాస్ డిగ్రీ వరకు చదివారు. రాజకీయాలలో రాక ముందు తాను కో – ఆపరేటివ్ ఉద్యోగిగా జీవిత ప్రస్థానం ప్రారంభించారు. విద్యార్ధి దశ నుంచే రాజకీయాలపై అసక్తి ఉన్న డీఎస్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో మొదటి సారి నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్ ఓటమి పాలయ్యారు. 2009, 2010, 2012, 2014లో జరిగిన ఎన్నికలలో ఓటమి నుంచి తప్పించుకోలేక పోయారు.
వైఎస్ఆర్ మంత్రి వర్గంలో..
డీ. శ్రీనివాస్ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో ఉన్నత విద్య మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబందాలు కొనసాగిస్తునే రాష్ట్ర రాజకీయాలను వైఎస్ఆర్ తో సమానంగా శాసించారు.
పీసీసీ చీఫ్ గా డీఎస్..
డీ.ఎస్. రాజకీయ ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. వ్యూహత్మకంగా ముందుకు వెళ్లే ఆయన 2004, 2009లో పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తనదైన శైలిలో శాసించారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులతో పాటు అన్ని విధాలుగా కీలకంగా పోషించి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు పొందారు. 2011లో శాసన మండలి సభ్యుడిగా గెలిచి తెలంగాణ శాసన మండలి నాయకుడిగా ఎన్నికయ్యారు.
బీఆర్ ఎస్ లో చేరిన డీఎస్…
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీ.శ్రీనివాస్ బీఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా.. డీఎస్ రాజకీయ వ్యూహాలను గుర్తించిన కేసీఆర్ 1 జూలై 2015లో బీఆర్ ఎస్ పార్టీలోకి చేర్చుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయన 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. తాను బీఆర్ ఎస్ లో చేరి తప్పు చేశానని చివరి దశలో తన సన్నిహితులతో చెబుతూ బాధ పడేవారు డీఎస్.
సీఎంగా కోరిక తీరకుండానే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను శాసించిన నేత డీఎస్.. రెండు పర్యాయాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం. ఏదో ఒకరోజు సీఎం కావాలనేది డీఎస్ కోరిక. కానీ మారిన రాజకీయాలలో ఆయన సీఎం కాలేక పోయారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ పదవికి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా డీ.శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ మరోసారి పోటీ చేశారు. అప్పటికే వైఎస్ ఆర్ మరణించడంతో కాంగ్రెస్ పార్టీలో డీఎస్ ముఖ్యులలో ఒకరుగా ఉన్నారు. అయితే.. ఆ ఉప ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం అవుతానని ప్రచారం చేశారు. అయినా.. ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ వైపు మొగ్గు చూపడంతో డీఎస్ సీఎం పదవికి దూరమయ్యారు.
డీఎస్ రాజకీయ వారసులుగా..
డీఎస్ రాజకీయ వారసులుగా ఇద్దరు కుమారులు కొనసాగుతున్నారు. పెద్ద కుమారుడు దర్మపురి సంజయ్ నిజామాబాద్ మేయర్ గా కొనసాగారు. కాగా చిన్న కుమారుడు బీజేపీ ఎంపీగా రెండో సారి గెలిచి తన తండ్రి రాజకీయాలకు వారసుడిగా ముందుకు తీసుకెళుతున్నారు.
– యాటకర్ల మల్లేష్