దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్..
కాంగ్రెస్ – ఎంఐఎం లు కలిసినట్లేనా..?
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్.. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు చేయి అందిస్తోంది. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మేర దోస్త్ అంటూ చెట్టపట్టాల్ వేసుకుని ఎంజాయ్ చేసిన ఎంఐఎం ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్లను బుట్టలో వేసుకోవడం ఎంఐఎంకు వెన్నతో పెట్టిన విద్య. అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్ ఎస్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన ఎంఐఎంపై ఎన్నికలలో కాంగ్రెస్ కూడా తీవ్రంగా విమర్శలు చేసింది. బీఆర్ ఎస్ తోక పార్టీలా ఎంఐఎం ఉందని తీవ్రస్థాయిలో అటాక్ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంఐఎం కూడా బీఆర్ ఎస్ లానే ఫీలైంది. కానీ.. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతోనే అందరూ ఆలోచనలలో పడ్డారు. తొలి అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ ఎస్ కు మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీశారు అక్బరుద్దిన్ ఓవైసీ. అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. నువ్వా – నేనా అనే రీతిలో ప్రత్యారోపణలు కూడా చేసుకున్నారు.
లండన్ లో ప్రత్యక్షంతో…
రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీంలో సడెన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యక్షమవడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని పొలిటికల్ గా డిస్కషన్ జరుగుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బర్‌ని కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లతో సమావేశమయ్యారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమే. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం’ అన్నారు.
ఎంఐఎం కాంగ్రెస్ మధ్య…?
ఎంఐఎం కాంగ్రెస్ మధ్య మైత్రి జరగబోతోందానేది పొలిటికల్ టాక్.. ఎంఐఎంను కలుపుకుంటే పార్లమెంట్ ఎన్నికలలో లాభ పడచ్చానేది సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. లండన్ లో అక్బరుద్దీన్, రేవంత్ మధ్య ఏం చర్చ జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని పొలిటికల్ గా డిస్కషన్ జరుగుతోంది.
అక్బరుద్దీన్ సీఎం లండన్ పర్యటనలో కలిసి పాల్గొనడం చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుందనే ఆలోచన మొదలైంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
మెజార్టీ స్థానాలు సాధించి తీరుతామంటున్నారు. అధికారం పోయినా బీఆర్‌ఎస్‌కు అహంకారం తగ్గలేదన్నారు సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి బీఆర్‌ఎస్ గుర్తు లేకుండా చేస్తామని లండన్ వేదికగా ఫైరయ్యారు రేవంత్‌రెడ్డి. వంద మీటర్ల లోతులో పాతిపెడతామన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, MIM సపోర్టుతో ముందుకెళ్లాలని భావిస్తోందా..? అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల మాదరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలవాలని యోచిస్తోంది. మొత్తానికి అక్బరుద్దీన్‌తో సీఎం కలిసి పాల్గొనడం వల్ల లండన్ పాలిటిక్స్ వ్యూహం ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది.