పోలీసుశాఖతో పెట్టుకోవద్దు….
కేటీఆర్‌ను హెచ్చరించిన రాజాసింగ్
హైదరాబాద్, నిర్దేశం:
ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు చెప్పిన విధంగానే పోలీసులు వింటారని, పోలీసు శాఖతో పెట్టుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశంతో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. ఏకంగా రేవంత్ రెడ్డి బెడ్‌రూమ్‌లోకి చొచ్చుకెళ్లి మరీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని అన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా.. ఆ సమయంలో తనను అరెస్ట్ చేసిన వారిని ఏమీ చేయలేదని తెలిపారు. కానీ ‘మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం’ అని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారని ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు చెప్పిన విధంగా పోలీసులు లీగల్‌గానే పనిచేస్తారని…
ఆ విషయం మర్చిపోయారా కేటీఆర్ అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి పోలీసులు జైలుకు పంపిస్తున్నారని… బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌కు చూశారన్నారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు కూడా పంపించారని రాజా సింగ్ గుర్తుచేశారు. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో సొంత పార్టీ నేతలు, కొంతమంది బీజేపీ అధికారులు.. పోలీసులకు మద్దతుగా నిలిచారన్నారు. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారే స్వయంగా తనతో చెప్పారన్నారు. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను, బీజేపీ అధికారులను ఏం చేయాలని ప్రశ్నించారు.