ఈ రోజుల్లో, ప్రపంచంలో అనేక రకాల భావజాలాలు నడుస్తున్నాయి, వాటిలో కొన్ని చాలా క్లిష్టమైనవి, వివాదాస్పదమైనవి కూడాను. వీటిలో జాతీయవాదం, కమ్యూనిజం, సోషలిజం, నాజిజం అలాగే ఫాసిజం వంటి పదాలు ఉన్నాయి. తరచుగా వ్యక్తులు ఈ పదాలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటి గురించి పూర్తి అవగాహన చాలా మందికి ఉండదు.
ప్రపంచం వివిధ దేశాలుగా విడిపోయిందని మనకు తెలుసు. ప్రతి దేశానికి దాని సొంత భూభాగం, ప్రజలు, చట్టాలు ఉన్నాయి. కానీ దేశం ఒక వ్యక్తి యొక్క పాలన కాదు. వ్యవస్థ పని చేస్తేనే దేశం సాగుతుంది. ఈ వ్యవస్థలో, ప్రజలపై అధికారం ఉన్న ఏకైక అధికారం ప్రభుత్వం. ఈ హక్కు అంటే ప్రజలు ఎలా జీవించాలో, వారి నియమాలు, నిబంధనలు ఎలా ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఇందులో భాగంగానే దేశాన్ని ఎలా నడపాలని చెప్పే వివిధ సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి.
జాతీయవాదం: దేశం పట్ల ప్రేమ, గౌరవం
జాతీయవాదం అంటే దేశభక్తి లేదా దేశం పట్ల ప్రేమ. జాతీయవాదం అంటే దేశాన్ని ప్రేమించడం, దాని కోసం ఏదైనా చేయాలని భావించడం. మీరు మీ దేశాన్ని మీ దేశంగా భావించి, గౌరవించి, అభివృద్ధి చెందాలని కోరుకుంటే, అది జాతీయవాదం.
జాతీయవాదం అనేది ఒకే జాతి, భాష, సంప్రదాయాలు, సంస్కృతి, మతం, రాజకీయాలు కలిగిన వ్యక్తులలో తలెత్తే ఆలోచన. జాతీయవాదం అనేది దేశం పట్ల ప్రేమ, గౌరవమైన భావన. ఇది గౌరవం, స్వేచ్ఛ, అభివృద్ధి మార్గాన్ని చూపుతుంది. జాతీయ జెండా, జాతీయ గీతం, దేశభక్తి గీతాలు, ఇవన్నీ జాతీయతకు చిహ్నాలు.
ఉదాహరణ: మీరు ఎక్కువ మంది వ్యవసాయం చేసే ప్రాంతంలో నివసిస్తున్నారనుకోండి. మీకు జాతీయ భావజాలం ఉంటే పంటను అమ్మినప్పుడు ఈ పంట లేదా దాని నుంచి వచ్చే లాభం దేశం నుంచి బయటకు వెళ్లకూడదని భావిస్తారు. అంటే దేశ వనరులను దేశాభివృద్ధికే వినియోగించాలని జాతీయవాదం అర్థం.
జాతీయవాదం ఎక్కడ నుంచి వచ్చింది?
రాజకీయ, సామాజిక దృక్కోణం నుంచి రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి దృక్కోణం ‘ప్రాచీన’. అంటే జాతీయవాదం అనేది మానవుల ప్రాచీన స్వభావానికి చెందిన ఒక రూపం. మానవులు పుట్టినప్పటి నుంచి ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన ఆదిమ ధోరణిని కలిగి ఉండడం. దానికి భవిష్యత్తులో కొనసాగించాలనుకోవడం జాతీయవాదం.
రెండవ దృక్కోణం ‘ఆధునిక’. జాతీయవాదం అనేది పురాతనమైనది కాదని, అది ఆధునిక సమాజం ఫలితమని నమ్మేవారు ఉన్నారు. అంటే ఈనాటిలా పెద్దదైన సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ ఉండడం వల్ల ఏదో జాతీయవాదం పుట్టుకొచ్చిందని అంటరు.
జాతీయవాదం ప్రయోజనాలు
■జాతీయ సంస్కృతిని కాపాడుతుంది.
■దేశాన్ని బలోపేతం చేస్తుంది
■దేశం పట్ల ప్రేమ, గౌరవాన్ని ఏర్పరుస్తుంది
■జాతీయ ఆత్మగౌరవాన్ని రేకెత్తిస్తుంది
■అంతర్జాతీయ సహకారాన్ని పెంచుకోవచ్చు.
జాతీయవాదం ప్రతికూలతలు
■ఒంటరితనాన్ని ప్రోత్సహిస్తుంది
■సమాజంలో ఆర్థిక, సామాజిక వివక్షకు దారితీయవచ్చు
■యుద్ధానికి దారితీయవచ్చు
■కొంతమంది పండితులు జాతీయవాదం కేవలం ‘విధ్వంసం’ మాత్రమే తెస్తుందని నమ్ముతారు.
కమ్యూనిజం: ప్రతి ఒక్కరికీ ప్రతిదీ!
కమ్యూనిజం అనేది ప్రతి ఒక్కరికీ చెందే వ్యవస్థ. ఇందులో ధనిక, పేద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా పని చేస్తారు. వారి అవసరాలకు అనుగుణంగా వస్తువులను పొందుతారు. కమ్యూనిజంలో అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. దీంతో అందరికీ సమాన హోదా, నిత్యావసర వస్తువులు లభిస్తున్నప్పటికీ స్వేచ్ఛ ఉండదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తారు. ప్రభుత్వం భయం ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణ: మీరు ఎక్కువ మంది వ్యవసాయం చేసే ప్రాంతంలో నివసిస్తున్నారనుకుందాం. పంటను విక్రయించినప్పుడు, దాని నుంచి వచ్చే లాభం గ్రామస్తులందరికీ సమానంగా పంపిణీ చేయబడుతుంది. అయితే, ఈ కమ్యూనిజం వ్యవస్థ కొన్నిసార్లు కష్టపడే ప్రజలను ప్రోత్సహించదు. తమ ప్రతి అవసరాన్ని ప్రభుత్వమే ఆదుకుంటుందని ప్రజలు భావిస్తున్నందున, మరి కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఇది కమ్యూనిజం యొక్క ప్రధాన బలహీనతగా పరిగణించబడుతుంది. దీంతో సోమరితనం పెరుగుతుంది.
అసమానతలకు ఆస్కారం లేని ఆదర్శ సమాజాన్ని రూపొందించాలని కార్ల్ మార్క్స్ కోరుకున్నారు. దీని కోసం ఆయన రెండు ముఖ్యమైన పుస్తకాలు రాశారు. అవి దాస్ కాపిటల్, కమ్యూనిస్ట్ మానిఫెస్టో. కమ్యూనిస్టు మానిఫెస్టోలో కమ్యూనిస్టు సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించారు. ఇక మార్క్స్ దృష్టిలో ప్రపంచంలో రెండు రకాల ప్రజలు ఉన్నారని చెప్పారు. వారు ధనిక, పేద.
పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కోసం కార్మికులను దోపిడీ చేస్తారని మార్క్స్ నమ్మారు. కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించి లాభాలన్నీ తమ వద్దే ఉంచుకుంటున్నారని, సంపద పంపిణీలో ఇది తీవ్ర అన్యాయమని భావించారు. ఈ దోపిడీయే అసలు సమస్య. పెట్టుబడిదారులు తక్కువ వేతనాలు చెల్లిస్తారు, అన్ని లాభాలను వారే సంపాదిస్తారు. దీని వల్ల శ్రామిక వర్గం విసిగిపోయి వనరులను చేజిక్కించుకోవడానికి ఒకరోజు నిలబడుతోందని చెప్పారు.
కార్ల్ మార్క్స్ ప్రకారం.. సోషలిస్టు వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలకు కార్మికులు యజమానులుగా ఉంటారు. అందరూ కలిసి లాభాలను పంచుకుంటారు. ప్రతి ఒక్కరూ వారి సంక్షేమం కోసం పని చేస్తారు. క్రమంగా ప్రభుత్వ అవసరం అంతమవుతుంది. ఎందుకంటే అందరూ కలిసి పనిచేసినప్పుడే అందరికీ ప్రయోజనం కలుగుతుందని అప్పటికి ప్రజలకు అర్థమై ఉండేది.
కమ్యూనిజం ప్రయోజనాలు
■ అంతా దేశం పేరుతోనే ఉండడం వల్ల ప్రజల్లో జాతీయతాభావం ఉంటుంది.
■ కమ్యూనిస్ట్ దేశాలు తమ సైన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి, ఇది భద్రతను పెంచుతుంది.
■ సమాన హోదా ఇచ్చే వర్గ రహిత సమాజం పెరుగుతుంది.
■ ప్రభుత్వం గృహాలు, ఉపాధి, ఆరోగ్య సేవలు మొదలైన అనేక విషయాలను ఉచితంగా అందిస్తుంది.
■ కమ్యూనిజంలో ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా వస్తువులను పొందుతారు.
■ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నందున ఉద్యోగం పోతుందనే భయం ఉండదు.
కమ్యూనిజం ప్రతికూలతలు
■ కమ్యూనిస్ట్ దేశాలలో హింస ద్వారా అధికార మార్పిడి తరచుగా జరుగుతుంది.
■ ప్రభుత్వాలు తరచుగా బెదిరింపుల ద్వారా ప్రజలను పాలిస్తాయి.
■ ప్రతి ఒక్కరి ఆదాయాన్ని సమానంగా ఉంచడం కష్టపడి పనిచేసే వారిని బాధపెడుతుంది
■ ప్రజలు తమ సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు.
■అందరూ సమానం అయినప్పుడు మనుషులు కష్టపడరు.
■ ప్రభుత్వ ఖర్చులను తీర్చడానికి ప్రజలు ఎక్కువ పన్ను చెల్లిస్తారు.
సోషలిజం: అందరూ కలిసి, అందరికీ!
సోషలిజం అనేది పెద్ద పరిశ్రమలు, కర్మాగారాలు, కంపెనీలు ప్రభుత్వంచే నియంత్రించబడే భావజాలం. ఈ వ్యవస్థలో సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. పెట్టుబడిదారులను నిర్మూలించడం, కార్మికులకు వ్యవస్థను నడపడానికి అధికారం ఇవ్వడం దీని లక్ష్యం. క్రమంగా, సోషలిజం బలపడుతున్న కొద్దీ, ప్రభుత్వ పాత్ర తగ్గుతుంది. రాను రాను కమ్యూనిజం స్థితి ఏర్పడుతుంది.
ఉదాహరణ: మీరు చాలా మంది వ్యవసాయం చేసే రాష్ట్రంలో నివసిస్తున్నారనుకుందాం. పంట పండినప్పుడు దానిలో కొంత భాగాన్ని ప్రభుత్వం తన పొరుగు రాష్ట్రానికి సహాయంగా పంపవచ్చు. అంటే సోషలిజంలో అందరూ కలిసి పని చేస్తారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.
సోషలిజం ప్రయోజనాలు
■ ధనిక, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడం సోషలిజం లక్ష్యం.
■ ప్రభుత్వం ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటుంది, నిరుద్యోగం తగ్గుతుంది
■ ఆసుపత్రులు, పాఠశాలలు, రోడ్లు, సేవలు వంటివి ప్రభుత్వ బాధ్యత
■ ప్రతి ఒక్కరికీ ఆహారం, వసతి, విద్య అందేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.
సోషలిజం ప్రతికూలతలు
■ ఎక్కువ సంపాదించేవారి వాటాను తగ్గించి తక్కువ సంపాదన కలిగిన వారికి ఇవ్వబడుతుంది.
■ పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వాలు ఎక్కువ పన్నులు విధించవచ్చు
■ ప్రభుత్వం ప్రతి విషయంలో జోక్యం చేసుకోవచ్చు, ప్రజలకు తక్కువ స్వేచ్ఛ లభిస్తుంది
■ కష్టపడి పనిచేయడం వల్ల ప్రయోజనం లేనప్పుడు, ప్రజలు కష్టపడరు.
■ ఒక వస్తువు ధర ఎంత అనేది ప్రభుత్వం మాత్రమే నిర్ణయిస్తుంది.
■ ఎవరికి ఏది ఎంత పొందాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఒకే నాణేనికి రెండు వైపులా: నాజీయిజం-ఫాసిజం
నాజీయిజం, ఫాసిజం ఒకే నాణేనికి రెండు వైపులా ఉండే రెండు భావజాలాలు. ఇవి ఇప్పుడు చరిత్రగా మారిన నియంతృత్వ పాలనలను మనకు గుర్తు చేస్తాయి. అయితే వారి తీవ్రమైన తప్పులు నేటికీ చర్చలో ఉన్నాయి. ఈ రెండు సిద్ధాంతాలు ఉదారవాదం, ప్రజాస్వామ్యం, కమ్యూనిజంలను తిరస్కరించినప్పటికీ, రెండింటి మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలు ఉన్నాయి.
ఫాసిజం సాధారణంగా ఇటలీలో ముస్సోలినీ పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. అయితే నాజీయిజం జర్మనీలో హిట్లర్‌తో సంబంధం కలిగి ఉంటుంది (వీమర్ రిపబ్లిక్). రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించడంలో రెండు భావజాలాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. దీని కారణంగా ప్రపంచంలో విధ్వంసం, అరాచకం వ్యాపించింది. నేటి యుగంలో, ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది నాజీయిజం, ఫాసిజాన్ని చెడు దృష్టితో చూస్తున్నారు.
సరిగ్గా చెప్పాలంటే నాజీయిజం, ఫాసిజం రెండూ ఒక వ్యక్తి మాత్రమే పాలించే, ఒకే వ్యక్తి దేశాన్ని నియంత్రించే ప్రభుత్వాలు. స్వేచ్ఛ, సమానత్వానికి ఇవి వ్యతిరేకం. కానీ ఫాసిజంలో దేశమనేది ప్రధాన ప్రాధాన్యత. అయితే నాజీయిజంలో జాతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నాజీలు తమ ఆర్యన్ జాతి మిగిలిన వారి కంటే గొప్పదని విశ్వసించారు. యూదుల వంటి ఇతర వర్గాలను చిన్నచూపు చూసేవారు. నేటి కాలంలో ఈ రెండు సిద్ధాంతాలు అపఖ్యాతి పాలయ్యాయి. ఎందుకంటే వాటి కారణంగా లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రపంచంలో పెద్ద విధ్వంసమే జరిగింది.
ఫాసిస్ట్ పాలన అంటే ఏమిటి?
ఫాసిజం అనేది ఒక రకమైన నియంతృత్వ వ్యవస్థ. ఇక్కడ పాలకుడు సర్వశక్తిమంతుడు. హింస అయినా, ఒత్తిడి అయినా ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి ఈ నాయకుడు ఎంతకైనా దిగవచ్చు. ఇది తరచుగా జాతీయవాదం, జాత్యహంకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సాధారణ ప్రజల స్వేచ్ఛను నాశనం చేస్తుంది. ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది.
ఫాసిజం అనేది ఒక భావజాలం. దీనిలో దేశం చాలా ముఖ్యమైనది. కానీ ఫాసిస్ట్ నాయకులు సాధారణంగా ప్రజల దేశభక్తి, జాత్యహంకార భావాలను ప్రేరేపిస్తూ ప్రజల మద్దతు పొందుతారు. వారు తరచుగా వ్యక్తులను బయటి వ్యక్తులు లేదా చట్టవిరుద్ధమైన పౌరులుగా ముద్ర వేస్తూ వారి పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు. జర్మనీలోని యూదులతో హిట్లర్ ఇలాగే చేశారు. ఇటువంటి నాయకులు తరచుగా పెద్ద ర్యాలీలు, కవాతులు నిర్వహిస్తూ వారి అనుచరులలో ఈ భావాలను బలపరుస్తారు.
ఈ పదం 1922 నుంచి 1943 వరకు ఇటలీలో ముస్సోలినీ నియంతృత్వ పాలనను గుర్తు చేస్తుంది. ఇది కాకుండా జర్మనీలో హిట్లర్, స్పెయిన్‌లోని ఫ్రాంకో వంటి నియంతృత్వ పాలనలను కూడా ఫాసిస్ట్‌గా పరిగణిస్తారు. ఫాసిజం భావజాల ప్రధాన ఆధారం మతోన్మాద జాతీయవాదం. ప్రజాస్వామ్యం, ఉదారవాదానికి వ్యతిరేకం.
నాజీయిజం పాలన అంటే ఏమిటి?
రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు ఆరు లక్షల మంది యూదులను, ఇతర ప్రజలను జర్మన్ ప్రభుత్వం, నాజీ సైన్యం దారుణంగా చంపింది. నాజీయిజం ఒక రకమైన ఫాసిజంగా పరిగణించబడుతుంది. ఫాసిజం, నాజీజం రెండూ ప్రజాస్వామ్య, ఉదారవాద ఆలోచనలను తిరస్కరించాయి. వాటి స్థానంలో జాతీయవాద దేశం అనే ఆలోచనను తీసుకున్నాయి.
నాజీ నిజానికి ‘నేషనల్‌సోజియలిస్ట్’ (అంటే నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ) యొక్క సంక్షిప్త రూపం. ఈ ప్రజలు ఆర్యన్ జాతి ఉత్తమమని నమ్ముతారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వారి భయంకరమైన చర్యల కారణంగా నాజీ అనే పేరు క్రూరమైన నియంతృత్వానికి. అన్యాయమైన అనాగరికతకు మరో పేరుగా మారింది. అడాల్ఫ్ హిట్లర్ 1933లో జర్మనీలో ఈ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. దాని పాలన 1945 వరకు కొనసాగింది.
1945లో యాక్సిస్ శక్తుల ఓటమి తరువాత నాజీ, ఫాసిస్ట్ భావజాలం ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా క్షీణించింది. ఈ పదాలు అవమానకరంగా మారాయి. కాలక్రమేణా ఈ పదాల అర్థం మరింత దిగజారింది.
– Tony Bekkal